నేడు గోవాకు ఢిల్లీ సీఎం..

నవతెలంగాణ – న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణకు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మరోసారి గైర్హాజరవనున్నారు. గురువారం విచారణకు హాజరు కావాలంటూ ఈడీ నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. అయితే కేజ్రీవాల్‌ దానికి దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది. మూడు రోజుల పర్యటన నిమిత్తం పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ సింగ్‌ మాన్‌తో కలిసి ఆయన నేడు గోవాకు బయల్దేరనున్నారు. అక్కడ లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో పాల్గొంటారు. దీంతో నాలుగోసారీ ఈడీ విచారణకు డమ్మా కొట్టనున్నారు. కాగా, ఢిల్లీ మద్యం పాలసీల వ్యవహారంలో గతేడాది నవంబర్‌ 2న తొలిసారిగా సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు జారీచేసింది. అయితే దానిని ఆయన హాజరుకాలేదు. దీంతో డిసెంబర్‌ 21న మరోసారి తాఖీదులచ్చింది. అయితే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ మేరకు పది రోజులపాటు విపాసన మెడిటేషన్‌ క్యాంప్‌నకు వెళ్లారు. ఈ నేపథ్యంలో జనవరి 3న విచారణకు రావాలంటూ ఆప్‌ అధినేతకు మరోసారి నోటీసులు పంపించింది. అయితే దానికి కూడా సీఎం కేజ్రీవాల్‌ దూరంగా ఉన్నారు. తాజాగా జనవరి 18న రావాలని నోటీసులివ్వడంతో.. చట్టం ప్రకారం నడుచుకుంటానని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు.

Spread the love