తీవ్ర ఒత్తిడిలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం

– మోడీ మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు : ఆర్జేడీ అధినేత లాలూ
పాట్నా: లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను మోడీ రద్దు చేస్తారని ప్రజలు భయపడుతున్నారని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ అన్నారు. ఆయన మోడీపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు చనిపోవటానికి కాదు, మనుగడ కోసం పోరాడాలని లాలూ అన్నారు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు కూడా మోడీని మళ్లీ అధికారంలోకి తెచ్చినట్టయితే ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందో లేదో అని అనిశ్చితంగా ఉన్నారని ఆర్జేడీ చీఫ్‌ తెలిపారు. మోడీ మళ్లీ ప్రధాని అయితే యువత ఉద్యోగావకాశాల గురించి అనిశ్చితితో ఉంటారన్నారు. ” పోలీసు, కేంద్ర పారామిలటరీ బలగాలలో అగ్నివీర్‌ పథకం అమలు చేయబడుతుందా, రైతుల డిమాండ్లు ఎప్పటికీ నెరవేరుతాయా లేదా, సమాజంలో ద్వేషం, చీలికలు పెరుగుతాయా, మోడీ మూడో దఫాలో రాజ్యాంగ సంస్థల స్వయంప్రతిపత్తికి భంగం వాటిల్లుతుందా అనే అనిశ్చితిలో యువత ఉన్నది” అని లాలూ ఆరోపించారు. గోద్రా రైలు దహనం కేసులో దోషులను రక్షించేందుకు లాలూ ప్రసాద్‌ ప్రయత్నించారని మోడీ చేసిన ఆరోపణలపై ఆర్జేడీ అధ్యక్షుడి కుమారుడు తేజస్వీ యాదవ్‌ స్పందించారు. మాజీ ప్రధాని, బీజేపీ వ్యవస్థాపక నాయకుడు అటల్‌ బిహారీ వాజ్‌పేయి చేసిన ప్రసిద్ధ ”రాజ్‌ ధర్మ” వ్యాఖ్యను తేజస్వీ ప్రస్తావించారు. ”ఆయన (పీఎం) తనకు ఏది కావాలంటే అది చెప్పగలరు. అయితే ఆ సమయంలో అటల్‌జీ చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి. అటల్‌జీ పక్కనే మోడీజీ కూర్చున్నారు, ఆయన ‘రాజ్‌ ధర్మాన్ని’ పాటించాలని సలహా ఇచ్చారు” అని తేజస్వి గుర్తు చేశారు.

Spread the love