నైరాశ్యంలో ఆశావహులు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వారంతా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. కేసీఆర్‌ అడుగులో అడుగేశారు. ఆయన చెప్పిన దాన్ని తూ.చా.తప్పకుండా పాటించారు. ఆ క్రమంలో సీఎంకు, ఆయన కుటుంబ సభ్యులకు అత్యంత సన్నిహితులుగా మారారు. స్వరాష్ట్రం సిద్ధించింది. పదేండ్లు గడిచిపోయాయి. పెద్ద సారు కరుణించకపోతారా..? తమకు ఏదో ఒక పదవిని ఇవ్వకపోతారా..? అని వేచి చూసిన ఆ నాయకులంతా ఎమ్మెల్యే టిక్కెట్‌పై గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ బీఆర్‌ఎస్‌ తొలి జాబితాతో వారు తీవ్ర నిరాశా నిస్పృహలకు లోనయ్యారు. వాస్తవానికి ఈ పాటికే తాము ఆశించిన నియోజకవర్గాల్లో తీవ్ర నిరసనలను వ్యక్తం చేయాలని భావించినా.. జాబితాలో మార్పులు.. చేర్పులకు అవకాశం ఉండకపోతుందా..? అనే ఆశతో ఎదురు చూస్తున్నారు. దాంతోపాటు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అమెరికా పర్యటనలో ఉండటంతో… ఆయనతో ఉన్న స్నేహం, సాన్నిహిత్యం మూలంగా ఇప్పటికిప్పుడు పార్టీ మారటం లాంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా మిన్న కుండిపోయారు. కేటీఆర్‌ హైదరాబాద్‌లో దిగాక… ఆయనతో ఒకసారి చర్చించి.. తదుపరి నిర్ణయం ప్రకటించేందుకు వారు రెడీగా ఉన్నారు.
వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాక కోసం ఎదురు చూస్తున్న వారిలో గజ్జెల నరేశ్‌, క్రిశాంక్‌ (కంటోన్మెంట్‌), భేతి సుభాష్‌రెడ్డి, బొంతు రామ్మోహన్‌ (ఉప్పల్‌), రామ్మోహన్‌ గౌడ్‌ (ఎల్‌బీ నగర్‌), కె.శశిధర్‌రెడ్డి (కోదాడ), బొమ్మెర రామ్మూర్తి (మధిర), దిండిగళ్ల రాజేందర్‌ (కొత్తగూడెం), ఢిల్లీ వసంత్‌ (జహీరాబాద్‌) ఉన్నారు. వీరందరూ అయితే ఉద్యమకారులుగానో, లేక కేసీఆర్‌ కుటుంబానికి అత్యంత సన్నిహిలుగానో ఉన్నారు. ఉప్పల్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా భేతి సుభాష్‌రెడ్డి…ఈసారి కూడా టిక్కెట్‌ ఆశించినా, ఆయనకు భంగపాటే ఎదురైంది.
ఆయనతో పాటు హైదరాబాద్‌ మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ కూడా అక్కడి నుంచి బరిలోకి దిగాలని భావించారు. టిక్కెట్‌ దక్కించుకోవటం కోసం శతవిధాలా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఈ క్రమంలో భేతి, బొంతు…ఇద్దరూ రాజీ ధోరణిని ప్రదర్శించారు. తామిద్దరిలో ఎవరికి టిక్కెట్‌ ఇచ్చినా ఫరవాలేదు.. కానీ కొత్త వారికి టిక్కెట్‌ ఇవ్వొద్దని కోరుతూ సీఎం తనయ, ఎమ్మెల్సీ కవితకు మొరపెట్టు కున్నారు. కానీ వారి మొరను కేసీఆర్‌ ఆలకించలేదు. అక్కడ కొత్త వారికి టిక్కెట్‌ ఇచ్చారు. దీంతో వారిద్దరూ తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. వీరిద్దరిలో బొంతు రామ్మో హన్‌… కేటీఆర్‌కు ‘అత్యంత సన్నిహితుడ’నే విషయం విదితమే. కోదాడ మాజీ ఎమ్మెల్యే, సీనియర్‌ నేత వేనేపల్లి చందర్‌రావు అనుయాయుడిగా గుర్తింపు పొందిన కె.శశిధర్‌రెడ్డి… ఆయన ద్వారా సీఎం మెప్పు పొంది.. టిక్కెట్‌ దక్కించుకోవాలని చూశారు. తొలుత సిట్టింగ్‌ అయిన బొల్లం మల్లయ్య యాదవ్‌కి కాకుండా కొత్త వారికి టిక్కెట్‌ ఇస్తారనే ప్రచారం కూడా కొనసాగింది. చివరికి మల్లయ్య యాదవ్‌నే సీఎం కరుణించారు. దీంతో రగిలిపోయిన చందర్‌రావు, శశిధర్‌రెడ్డి…తమ అసంతృప్తిని వెళ్లగక్కుతూ పలు సమావేశాలు, శిబిరాలు నడిపారు.
సీఎంను కలిసి అసమ్మతిని తెలపాలని భావించినా, వారికి ఇప్పటి వరకూ అపాయింట్‌మెంట్‌ దొరక్కపోవటం గమనార్హం. మరోవైపు రైతు ఆత్మహత్యలపై దేశ రాజధానిలో పాదయాత్రలు చేయటం ద్వారా ‘ఢిల్లీ వసంత్‌’గా పేరు తెచ్చుకున్న జహీరాబాద్‌ టిక్కెట్‌ ఆశావహుడు వసంత్‌… తనకు ఈసారి ఎన్నికల్లో కేసీఆర్‌ కచ్చితంగా అవకాశం ఇస్తారని భావించారు. కానీ టిక్కెట్‌ దక్కకపోవటంతో భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రతీ రోజూ ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ చర్చలు కొనసాగిస్తున్నారు. నూతన సచివాలయానికి అంబేద్కర్‌ పేరును పెట్టటం ద్వారా సీఎం.. దేశంలోని దళిత మేధావులతోపాటు ఆయా వర్గాల్లో మంచి ఇమేజ్‌ను సంపాదించుకోగలిగారు. ఈ క్రమంలో వసంత్‌…హైదరాబాద్‌ రవీంద్రభారతిలో పలు రాష్ట్రాలకు చెందిన దళిత ప్రొఫెసర్లు, మేధావులతో ‘కేసీఆర్‌కు ధన్యవాద సభ’ను ఏర్పాటు చేశారు. ఆయనకు టిక్కెట్‌ ఇవ్వకపోవటంపై ఆయా వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. కాగా… ఎట్టిపరిస్థితుల్లోనూ ఈసారి పోటీ చేసి తీరతానని సంపత్‌ చెబుతుండటం గమనార్హం. అయితే ఇలాంటి ఉద్యమకారులు, సన్నిహితులు, ఆశావహుల్లో ఏ ఒక్కరికీ సీఎం అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. కనీసం పిలిచి మాట్లాడకపోవటంతో వారు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వచ్చాక తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు.

Spread the love