ప్రయివేటు వ్యక్తుల చేతుల్లోకి ప్రభుత్వ పరిశోధనల వివరాలు

– ఎన్‌ఆర్‌ఎఫ్‌ బిల్లుపై ఎఐపిఎస్‌ఎన్‌ ఆందోళన
– సమగ్ర అంచనాకై స్థాయీ సంఘానికి నివేదించాలని సూచన
ఢిల్లీ : నేషనల్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ (ఎన్‌ఆర్‌ఎఫ్‌) బిల్లు-2023పై ఆల్‌ ఇండియా పీపుల్స్‌ సైన్స్‌ నెట్‌వర్క్‌ (ఎఐపిఎస్‌ఎన్‌) ఆందోళన వ్యక్తం చేసింది. సమగ్ర అంచనా కోసం ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం తక్షణమే పార్లమెంట్‌ స్థాయీ సంఘానికి (ఎస్‌ అండ్‌ టి, పర్యావరణం, అడవులు) పంపాలని ఎఐపిఎస్‌ఎన్‌ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. ఎన్‌ఆర్‌ఎఫ్‌ బిల్లు 2023ను కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదించింది. త్వరలో జరిగే పార్లమెంట్‌ సమావేశాల్లో ఆమోదం కోసం బిల్లును ప్రవేశపెట్టనుంది. సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ బోర్డ్‌ (ఎస్‌ఇఆర్‌బి) చట్టం- 2008 స్థానంలో ఈ ఎన్‌ఆర్‌ఎఫ్‌ బిల్లును కేంద్రం తీసుకుని రానుంది. ఎన్‌ఆర్‌ఎఫ్‌ బిల్లుపై ఎఐపిఎస్‌ఎన్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఎఐపిఎస్‌ఎన్‌ అనేది 25 రాష్ట్రాల్లో పనిచేసే 40 ప్రజా సైన్స్‌ సంఘాల ఐక్యవేదిక. పబ్లిక్‌ ఫండింగ్‌, కార్పొరేట్లు, దాతృత్వ సంస్థలు, అంతర్జాతీయ సహకారంపై అధారపడే ఒక సంస్థను స్థాపించడమే లక్ష్యంగా కేంద్రం ఈ బిల్లును తీసుకుని వచ్చిందని ఎఐపిఎస్‌ఎన్‌ విమర్శించింది. ఎన్‌ఆర్‌ఎఫ్‌ బిల్లు ప్రకారం కొత్తగా ఏర్పాటు చేసే సంస్థకు ప్రభుత్వం నుంచి 28 శాతం నిధులు మాత్రమే వస్తాయని, మిగిలిన 72 శాతం నిధులు ప్రైవేటు సంస్థలు, వ్యక్తుల నుంచి లభ్యమవుతాయని, కాబట్టి ఇటువంటి సంస్థ నిర్మాణంతో ప్రభుత్వ పరిశోధనలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళతాయని ఎఐపిఎస్‌ఎన్‌ తన వాదన వినిపించింది.
ఈ నేపథ్యంలో ఎన్‌ఆర్‌ఎఫ్‌ బిల్లును పున్ణపరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరింది. అలాగే, ఈ బిల్లును సమగ్ర అంచనా కోసం ఎస్‌ అండ్‌ టి, పర్యావరణం, అటవీ శాఖకు చెందిన పార్లమెంట్‌ స్థాయీ సంఘానికి పంపాలని కోరింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సైన్స్‌ సంస్థల ప్రతినిధులు బిల్లుపై తమ అభిప్రాయాలను అందచేయాలని కోరింది.
ప్రపంచంలో ఇతర దేశాలతో పోల్చితే పరిశోధన-అభివృద్ధిపై భారతదేశం పెట్టే ఖర్చు చాలా తక్కువగా ఉందని ఎఐపిఎస్‌ఎన్‌ గుర్తుచేసింది. 2022లో పరిశోధన-అభివృద్ధి కోసం దేశ జిడిపిలో కేవలం 0.65 శాతాన్ని మాత్రమే కేంద్రం కేటాయించింది. ఈ సంఖ్య ప్రపంచ సగటు 1.8 శాతం కంటే చాలా తక్కువగా ఉందని తెలిపింది. అమెరికా (2.9 శాతం), చైనా (2.2 శాతం), ఇజ్రాయల్‌ (4.9 శాతం) వంటి దేశాల కంటే చాలా తక్కువగా ఉందని తెలిపింది. దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో పరిశోధనలు చాలా తక్కువగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. భారతదేశంలో ఉన్న దాదాపు 40,000 ఉన్నత విద్యా సంస్థలలో కేవలం 1% మాత్రమే పరిశోధనల్లో చురుకుగా పాల్గొంటున్నాయని తెలిపింది. ఈ పరిస్థితిని పరిష్కరించడానికి గానూ, శాశ్వత పోస్టుల కోసం సరైన అర్హత కలిగిన ఉపాధ్యాయులు, పరిశోధకులను నియమించడం ద్వారా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయవలసిన అవసరం ఉందని ఎఐపిఎస్‌ఎన్‌ తెలిపింది. టెక్నాలజీలో భారత్‌ స్వావలంబన సాధించడానికి, గ్లోబల్‌ టెక్నాలజీ లీడర్‌గా మారడానికి పరిశోధనలు- అభివృద్ధి రంగంలో తగినన్ని పెట్టుబడులు చాలా కీలకమని తెలిపింది. ప్రభుత్వం సరైన రీతిలో పెట్టుబడులు పెట్టాలని ఎఐపిఎస్‌ఎన్‌ డిమాండ్‌ చేసింది.

Spread the love