దేవరగా ఎన్టీఆర్‌

ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబోలో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రానికి ఏ టైటిల్‌ని ఖాయం చేస్తారా అని ఎదురు చూసిన ఎన్టీఆర్‌ అభిమానులకు, ప్రేక్షకులకు మేకర్స్‌ శుక్రవారం సర్‌ప్రైజ్‌ చేశారు. నేడు (శనివారం) ఎన్టీఆర్‌ బర్త్‌డే. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్‌ 30 చిత్రానికి ‘దేవర’ అనే పవర్‌ఫుల్‌ టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు రిలీజ్‌ చేసిన పోస్టర్‌లో మేకర్స్‌ తెలిపారు.
ఎగసి పడుతున్న అలలు.. తీరంలో రక్తం మడుగులో గుట్టలుగా పడి ఉన్న శవాలు.. ఈ నేపథ్యంలో సమద్రమంత గంభీరంగా రక్తంకారుతున్న పదునైన ఆయుధంతో ఉన్న ఎన్టీఆర్‌ గెటప్‌ని చూస్తుంటే, ‘ఈ కథలో మనుషుల కన్నా ఎక్కువ మృగాలు ఉంటారు. భయమంటే ఏంటో తెలియని మృగాలుంటారు. దేవుడంటే భయం లేదు. చావంటే భయం లేదు. కానీ, ఒకే ఒకటంటే భయం వారికి. ఆ భయమేంటో మీ అందరికీ తెలిసే ఉంటుంది. భయం ఉండాలి. భయం అవసరం. భయపెట్టడానికి ఈ సినిమాలో నా ప్రధాన పాత్ర ఏ రేంజ్‌కి వెళ్తుందనేది ఎమోషనల్‌ రైడ్‌’ అని దర్శకుడు కొరటాల శివ ఈ సినిమా ప్రారంభోత్సవంలో ఏమైతే చెప్పారో దాన్ని రిప్రజెంట్‌ చేస్తూ ఉందనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
నందమూరి కళ్యాణ్‌ రామ్‌ సమర్పణలో ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్‌ బ్యానర్స్‌పై కొసరాజు హరికృష్ణ, సుధాకర్‌ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

Spread the love