ప్రజాభాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యం

Development is possible only with public participation– ‘రెరా’ చైర్మెన్‌ డాక్టర్‌ ఎన్‌ సత్యనారాయణ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రజల సంపూర్ణ భాగస్వామ్యంతోనే గ్రామాలు, పట్టణాలు అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధిని సాధించగలుగుతాయని రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) చైర్మెన్‌ డాక్టర్‌ ఎన్‌ సత్యనారాయణ అన్నారు. శనివారం ఉస్మానియా విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం సెమినార్‌ హాలులో స్థానిక పాలనే సుపరిపాలన అంశంపై జరిగిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మూస పద్ధతిలో కాకుండా అర్థవంతమైన అభివృద్ధి కోసం యువత, సీనియర్‌ సిటిజన్‌లు, మహిళలను భాగస్వామ్యం చేస్తూ వార్డు కమిటీలు, పట్టణ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. దీనివల్ల అభివృద్ధిలో పారదర్శకత, జవాబుదారీతనం ఏర్పడతాయన్నారు. అందువల్లే గ్రామపంచాయతీలు, పట్టణాలు కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి అవార్డులు అందుకుంటున్నాయని ఉదహరించారు. మూడు నెలలకోసారి అభివృద్ధి కమిటీలు సమావేశమై, సామూహిక పనులపై చర్చించి తీర్మానాలు చేయాలన్నారు. కొత్త పంచాయతీరాజ్‌, పురపాలక చట్టంపై ప్రతి ఒక్కరూ విషయపరిజ్ఞానం కలిగి ఉండాలని అన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి పనులు జరిపేందుకు అదనపు కలెక్టర్ల వ్యవస్థ ప్రత్యేకంగా రూపొందించారని వివరించారు. గతంలో మాదిరి కాకుండా సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ప్రజలకు అందించే సేవలకు నిర్ణీత కాలవ్యవధి నిర్ణయించి, పారదర్శకంగా పనులు చేపడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో మహారాష్ట్ర ఓపెన్‌ యూనివర్సిటీ మాజీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ ఈ. వాయునందన్‌, ట్రస్ట్‌ వైస్‌ చైర్మన్‌ పి. మోహన్‌ రావు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, ట్రస్ట్‌ జనరల్‌ సెక్రెటరీ టంగుటూరి శ్రీరామ్‌, జాయింట్‌ సెక్రెటరీ పి.రాజశేఖర్‌ పాల్గొన్నారు.

Spread the love