– సచివాలయంలో కమిటీ తొలి భేటీ
– సమస్యల శాశ్వత పరిష్కారంపై ఫోకస్
– సమాచార సేకరణ తర్వాత నివేదిక
– పెండింగ్‌లో 2.31 లక్షల దరఖాస్తులు
– డిజిటల్ సంతకం కోసం 1.8 లక్షల ఎకరాల భూములు
– 130 రకాలకుపైగా రెవెన్యూ సమస్యలు
నవతెలంగాణబ్యూరో – హైదరాబాద్
ధరణితో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. వ్యవస్థలోని లోటుపాట్లను సవరిస్తూ, భూ సమస్యలకు తక్షణ, శాశ్వత పరిష్కారం కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల నిపుణుల కమిటీ తొలి సమావేశం గురువారం సచివాలయంలో జరిగింది. చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ ఆడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్‌ఏ) మెంబర్ కమిషనర్ నవీన్ మిట్టల్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎం.కోదండరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రేమండ్ పీటర్, ప్రముఖ న్యాయవాది సునిల్, రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్‌లతో కూడిన కమిటీ ధరణి అమలవుతున్న తీరు, విధి విధానాలను అధికారులను అడిగి తెలుసుకుంది. ఏ మాడ్యూల్‌లో ఎన్ని దరఖాస్తులొచ్చాయని ఆరా తీసింది. కోర్టు పరిధిలో ఉన్న భూములు, పీవోబీ జాబితాలో ఉన్న భూముల వివరాలను గ్రామం, మండలాల వారీగా సేకరించనున్నారు. ధరణికి ముందు, తరువాత ఉన్న అసైన్డ్ భూమి, భూదాన్, ఎండోమెంట్, వక్ఫ్ భూమలు, పీవోబీ, ప్రభుత్వ భూములు, వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలపై సమావేశంలో చర్చించారు.
పెండింగ్‌లో 2.31 లక్షలు దరఖాస్తులు
రెవెన్యూ అధికారుల లెక్కల ప్రకారం ధరణి పోర్టల్‌లో పస్తుతం 1 నుంచి 33 వరకు టెక్నికల్ మ్యాడ్యూల్స్ (టీఎం) ఉన్నాయి. ఈ మాడ్యూళ్లలో పరిష్కారం కోసం చేసుకున్న 2.31 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. మరో 1.8 లక్షల ఎకరాల భూములకు సంబంధించి డిజిటల్ సంతకాల (డీఎస్) కోసం భూ యాజమానులు ఎదురు చూస్తున్నారు. ధరణి పోర్టల్ అమల్లోకి రాకముందు 75 రకాల భూ సమస్యలుంటే, ధరణి వచ్చాక ఆ సమస్యల సంఖ్య 130కి పెరిగాయనే విమర్శలున్నాయి. సాదా బైనామా కోసం 9.5 లక్షల దరఖాస్తులు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని పరిష్కరించేందుకు ధరణి పోర్టల్‌లో ప్రస్తుతం అవకాశం లేదు.
అమల్లోకి తెచ్చిన ఆర్వోఆర్-2020 చట్టంలో చిన్నపాటి సవరణ చేస్తే సాదాబైనామా కోసం నిరీక్షిస్తున్న లక్షలాది మందికి ఊరట లభిస్తుంది. ప్రస్తుతం ధరణి ఆన్‌లైన్‌లో నమోదైన భూముల వివరాలు, యాజమానుల పేర్లు, ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలకు సంబంధించిన సమాచారానికి పూర్తి స్థాయి బాధ్యులు ఎవరన్న ప్రశ్న తలెత్తున్నది. వీటికి సంబంధించిన మాన్యువల్ రికార్డులు లేకపోవడంతో ఎప్పుడైనా ఈ సమస్యలు రావచ్చని నిపుణులు అంటున్నారు. ఒకరి భూమి మరో వ్యక్తిపై నమోదై పట్టాదారు పాస్ పుస్తకం పొందితే.. ఆ పాస్‌పుస్తకాన్ని రద్దు చేసే అధికారం ఏ అధికారికీ లేదు. బాధితుడు కేవలం కోర్టుకెళ్లి తేల్చుకోవాల్సి ఉంటుంది.
ధరణి వల్ల రైతులు తీవ్రంగా నష్ట పోయారు
కమిటీ సభ్యులు ఎం.కోదండరెడ్డి
గత ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్ వల్ల రైతులు తీవ్రంగా నష్ట పోయారని కమిటీ సభ్యులు ఎం.కోదండరెడ్డి విమర్శించారు. గురువారం సచివాలయంలో కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ధరణి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చిందనీ, ఆ క్రమంలోనే అధికారం చేపట్టిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి సమస్యలపై దష్టి సారించారని తెలిపారు. రికార్డులు తప్పుల తడకగా ఉండటం వల్ల రుణాలు తీసుకోవడంతో పాటు రైతులు తమ భూములను అమ్ముకునేటప్పుడు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆయన గుర్తు చేశారు. కేంద్రం భూసర్వే కోసం రూ.83 కోట్లు మంజూరు చేసినా రాష్ట్ర సర్కార్ ఎలాంటి సర్వే చేపట్టలేదని అన్నారు. పక్కనున్న ఏపీ సైతం భూసర్వే, డిజిటలైజేషన్, టైటిల్ గ్యారంటీలను చేపట్టిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు.తాము రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి రైతులతో పాటు అన్ని పక్షాల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటామని తెలిపారు. సాధ్యమైనంత తొందరగా కమిటీ నివేదిక అందిస్తుందనీ, ఆలస్యం అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకునేందుకు వీలుగా మద్యంతర నివేదికను అందిస్తామని వెల్లడించారు. ధరణి పోర్టల్ నిర్వహణపై కూడా సమీక్షించనున్నట్టు ఆయన తెలిపారు. కమిటీ కోసం సీసీఎల్‌ఏలో కార్యాలయం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రెండో సమావేశం ఈ నెల 17న జరగనుందని చెప్పారు.
చిన్న సమస్యకూ ఇబ్బందులే
భూమికి సంబంధించిన సర్వే నెంబరు మిస్సింగ్, ఎక్స్‌టెన్షన్ కరెక్షన్ తదితర చిన్న సమస్యలకు కూడా ఫైలు సీసీఎల్‌ఏ వరకు వెళ్లాల్సి వస్తోంది. డిజిటల్ పాస్‌బుక్ మొదటి పేజీలో తప్పులు సరిచేయించుకోవాలంటే కలెక్టర్‌ను ఆశ్రయించాలి. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లను సరిచేయించుకునేందుకు యజమానులు నెలల తరబడి అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. అంతేకాకుండా ప్రతి సమస్య పరిష్కారానికీ దరఖాస్తు చేసేటప్పుడు చార్జీలు చెల్లించాల్సి వస్తోంది.రెవెన్యూ రికార్డులను కంప్యూటర్‌లో అప్‌డేట్ చేసేటప్పుడు ప్రభుత్వం చేసిన తప్పులను వారే సరిదిద్దాలే తప్ప తామెందుకు రుసుము చెల్లించాలని యజమానులు ప్రశ్నిస్తున్నారు. ఉన్న ఇబ్బందులకు తోడు ఈ ఫీజులతో తమపై ఆర్థిక భారం పడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.