– గులాబీ దండుకు పదవుల గండం
– కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో అవిశ్వాస సెగలు
– విహారయాత్రలో జవహర్‌నగర్ కార్పొరేటర్లు
– ప్రభుత్వం మారడంతో మేయర్, చైర్మెన్ పీఠంపై గురి
– మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో వేడెక్కుతున్న రాజకీయం
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకున్న నేపథ్యంలో మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో ‘అవిశ్వాసం’ మరోసారి తెరపైకి వచ్చింది. అధికార మార్పిడికి అసంతృప్తి తోడవ్వడంతో కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్మెన్లపై అవిశ్వాస పిడుగు పడే అవకాశం కన్పిస్తోంది. దాంతో సిట్టింగ్‌లు తమ పదవులను కాపాడుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో జవహర్‌నగర్ కార్పొరేటర్లు క్యాంపు రాజకీయాలకు తెరలేపుతూ విహారయాత్రకు వెళ్లారు. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో 13 మున్సిపాల్టీలు, 4 కార్పొరేషన్లు ఉన్నాయి. మున్సిపల్ పాలకవర్గాలు ఏర్పడి నాలుగేండ్లు కావస్తుం డటంతో మేయర్లు, మున్సిపల్ చైర్మెన్ల వ్యతిరేక గ్రూపులు అవిశ్వాస తీర్మానాలకు తెరలేపుతున్నాయి. అధికార పార్టీ అండతో పలువురు అసంతృప్త కార్పొరేటర్లు, కౌన్సిలర్లు బీఆర్‌ఎస్ మేయర్లు, చైర్మెన్లను గద్దెదించేందుకు పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ‘అవిశ్వాస’ రాజకీయాలు జోరందుకున్నాయి. రాష్ట్రంలో కొత్త సర్కారు కొలువుదీరడంతో గులాబీ పార్టీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కాంగ్రెస్ వైపు చూస్తుండటంతో ఈ పరిస్థితి నెలకొంది.
ఏడాది, రెండేండ్ల నుంచే అసమ్మతి
నాలుగేండ్ల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను బీఆర్‌ఎస్ గెలుచుకుంది. కానీ, చాలా చోట్ల ఏడాది, రెండేండ్ల నుంచే సొంత పార్టీలోనే అసమ్మతి రాజుకుంది. మేయర్లు, కార్పొ రటర్లు, మున్సిపల్ చైర్మెన్లు, కౌన్సిలర్ల మధ్య విబేధాలు తలెత్తాయి. నిధుల కేటాయింపుల్లో పక్షపాతం, ప్రాధాన్యత కల్పించకపోవడం వల్ల పలువురు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అసంతృప్తితో రగిలిపో యారు. గతేడాది జవహర్‌నగర్ మేయర్‌తోపాటు మేడ్చల్, దమ్మాయిగూడ, మున్సిపల్ చైర్ పర్సన్లపై అవిశ్వాస నోటీసులిచ్చి తమ ఆగ్రహాన్ని బయటపెట్టారు. కానీ అప్పట్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున బీఆర్‌ఎస్ హైకమాండ్‌తో పాటు అప్పటి మంత్రి మల్లారెడ్డి జోక్యంతో అవిశ్వాసాలకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు ముగియడం, కాంగ్రెస్ అధికారం చేపట్టడంతో మరోసారి అవిశ్వాసం అంశం తెరపైకి వస్తున్నది. అధికార పార్టీలో ఉంటే అన్ని రకాలుగా మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో మరోసారి నోటీస్‌లు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇక దమ్మాయిగూడ, మేడ్చల్, ఘట్‌కేసర్ మున్సిపల్ చైర్‌పర్సన్లను సైతం గద్దె దించేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. అంతేకాదు, బోడుప్పల్‌లో 25మంది కార్పొరేటర్లు, ఫిర్జాధిగూడలో 20 మంది కార్పొరేటర్లు ఆయా మున్సిపాల్టీల ఆవిశ్వాస తీర్మానాలపై సంతకాలు చేసినట్టు సమాచారం. దీనిపై బీఆర్‌ఎస్ నాయకత్వం త్వరలో సమావేశం నిర్వహించనట్టు తెలుస్తోంది. బీఆర్‌ఎస్ మేయర్, చైర్ పర్సన్లను గద్దె దించేందుకు సొంత పార్టీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లే పావులు కదువుతున్నారు.
క్యాంపు రాజకీయాలు
మరో రెండు రోజుల్లో జవహర్‌నగర్ మేయర్‌పై అవిశ్వాసంపై సమావేశం జరుగనున్న నేపథ్యంలో ఆదివారం ఉదయం క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. అవిశ్వాసం ఇచ్చిన 19 మంది కార్పొరేటర్లతోపాటు మరొకరు విహార యాత్రకు తరలి వెళ్లారు. నిధుల కేటాయింపులో తమతో ఎలాంటి సంప్రదింపులు లేకుండా మేయర్ కావ్య సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ వీరంతా అసంతృప్తిగా ఉన్నారు. పరిస్థితి చక్కదిద్దేందుకు మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే ఇటీవల కొందరిని విహారయాత్రకు తీసుకెళ్లి వచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కార్పొరేటర్లను కలిసేందుకు మేయర్ కావ్య తీవ్రంగా ప్రయత్నం చేశారు. అవిశ్వాసం ఇచ్చిన వీరు కొత్త మేయర్ ఎన్నిక తర్వాత అధికార కాంగ్రెస్‌లో చేరనున్నట్టు సమాచారం.
వేడెక్కుతున్న రాజకీయం
రాష్ట్రంలో అధికార మార్పిడితో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. రాష్ట్రం అంతటా కాంగ్రెస్ గాలి వీచినా.. జిల్లాలో మాత్రం ఐదు నియోజవకర్గాల్లోనూ బీఆర్‌ఎస్ విజయకేతనం ఎగరేసింది. కానీ పార్టీ అధికారంలో లేకపోవడంతో రాజకీయ సమీరణాల్లో మార్పులు చోటుచేసుకుంటు న్నాయి. అధికార పార్టీలో ఉంటే నిధులతోపాటు రానున్న ఎన్నికల్లో పదవులు పొందవచ్చని భావించిన జిల్లాలోని పలువురు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొందరు చేరిపోగా.. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నాటికి మరికొందరు చేసే అవకాశమూ లేకపోలేదు. ఇక మేయర్, చైర్మెన్ పీఠాలపై గురిపెట్టిన పలువురు అవిశ్వాసం ప్రవేశపెట్టి.. నెగ్గిన తర్వాత అధికార కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్టు జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇలా చేస్తే పదవితోపాటు అధికార పార్టీ సపోర్టు కూడా ఉంటందని కొందరు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ అవిశ్వాస రాజకీయాలు ఎక్కడి వరకు దారి తీస్తాయో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే..!