మోడీ రామరాజ్యంలో దళితులపై వివక్ష

Modi in RamrajyaDiscrimination against Dalits
**EDS: IMAGE VIA AICC** Kanpur: Congress leader Rahul Gandhi during the ‘Bharat Jodo Nyay Yatra’, in Kanpur, Wednesday, Feb. 21, 2024. (PTI Photo)(PTI02_21_2024_000178B)

– వెనుకబడిన వర్గాలకు ఉద్యోగాల్లేవు : జోడో యాత్రలో రాహుల్‌ విమర్శ
కాన్పూర్‌ : మోడీ రామరాజ్యంలో దళితులపై వివక్ష తీవ్రమవుతున్నదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. జనాభాలో 90శాతంగా వున్న దళితులు, ఇతర వెనుకబడిన వర్గాలకు తగినన్ని ఉద్యోగాలను కేంద్రం సృష్టించడం లేదని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ బుధవారం విమర్శించారు. రామరాజ్యంగా చెప్పుకునే మోడీ ప్రభుత్వ హయాంలోనే వారి పట్ల వివక్ష కనబడుతుందన్నారు. ‘ఇదేమీ రామరాజ్యం? వెనుకబడిన వర్గాలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు వీరికెవరికీ ఉద్యోగాల్లేవు.’ అని ఆయన భారత్‌ జోడో న్యాయ యాత్ర సందర్భంగా జరిగిన బహిరంగ సభలో విమర్శించారు.
‘దేశంలో 50శాతం జనాభా వెనుకబడిన వర్గాలు. 15శాతం దళితులు, 8శాతం గిరిజనులు, 15శాతం మైనారిటీలు. మీరెంత అరిచి గీ పెట్టినా మీకు ఈ దేశంలో ఉపాధి దొరకదు. మీకు ఉద్యోగాలు రావాలని నరేంద్ర మోడీ కోరుకోవడం లేదు’ అని రాహుల్‌ గాంధీ విమర్శించారు.
మీడియాలో కానీ, బడా పరిశ్రమల్లో కానీ దళితులు, వెనుకబడిన వర్గాలవారెవరూ లేరని, అధికార యంత్రాంగంలోనూ అదే పరిస్థితి నెలకొందన్నారు. కులం, వర్గం భారత్‌ను విభజిస్తున్న తీరు ఈ రకంగా వుందని విమర్శించారు. ప్రజలు ఆకలితో చనిపోతున్నారని అన్నారు. ఇటీవల జరిగిన రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో ఎంతమంది దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల వారు వున్నారు. గిరిజనురాలైన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించలేదు. దళితుడైన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ కోవింద్‌ను లోపలకు అనుమతించలేదని రాహుల్‌ గుర్తు చేశారు. కులగణన జరగాలన్నదే తమ పార్టీ, మిత్రపక్షాల డిమాండ్‌ అని ఆయన స్పష్టం చేశారు. దేశ ప్రగతికి అతిపెద్ద విప్లవాత్మక చర్య అదేనన్నారు. అటువంటి సర్వే వల్లనే వెనుకబడిన వర్గాల సంక్షేమం ఎలా వుందో తెలుస్తుందని అన్నారు.

Spread the love