విద్య, వైద్యం పరిరక్షణ కోసం దశలవారీగా ఉద్యమాలు
28 నుంచి కేవీపీఎస్ రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులు : రాష్ట్ర కమిటీ సమావేశంలో అబ్బాస్, స్కైలాబ్‌బాబు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఈ ఏడాది మర్చి 24న సుప్రీంకోర్టు వెలువడించిన తీర్పు కోట్లాది మంది దళితులకు రాజ్యాంగ హక్కులు, రిజర్వేషన్లు దూరం చేసే విధంగా ఉందని దాన్ని తిరిగి సమీక్షించాలంటూ ఈనెల 10 నుంచి అన్ని జిల్లాలలో సదస్సులు నిర్వహించునున్నట్టు ఆవాజ్, కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శులు ఎండి.అబ్బాస్, టి. స్కైలాబ్ బాబు వెల్లడించారు. శనివారం హైదరాబాద్ చిక్కడపల్లిలోని కేవీపీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆ సంఘం ఉపాధ్యక్షులు నందిపాటి మనోహర్ అధ్యక్షతన రాష్ట్రస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎండి. అబ్బాస్, టి. స్కైలాబ్ బాబులు మాట్లాడుతూ కోట్లాదిమంది దళిత క్రైస్తవులకు రాజ్యాంగం కల్పిస్తున్న హక్కులపై సుప్రీంకోర్టు తీర్పు ముప్పేట దాడి చేసిందన్నారు. మతం మారినంత మాత్రాన కుల వివక్ష, అంటరానితనం పోవట్లేదని తెలిపారు. కులం వేళ్లూనుకుని తరతరాలుగా అంతరాల సామాజిక వ్యవస్థగా కొనసాగుతుంటే, మతం ఒక ఆధ్యాత్మిక వ్యవస్థగా కొనసాగుతుందని వివరించారు. సుప్రీంకోర్టు తీర్పును మళ్లీ సమీక్షించాలంటూ ఈనెల 10 నుంచి 25 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహించనున్నట్టు వారు తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్య తీవ్ర సంక్షోభంలో కొనసాగుతుందనీ, నూటికి 80 శాతం మంది విద్యార్థులు అట్టడుగు పేద వర్గాలు నుంచి ఉన్నారనీ, ఆ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, సౌకర్యాల కొరత కొనసాగుతుందని విమర్శిం చారు. ప్రభుత్వ ఉద్యోగులు ,అధికారులు, ప్రజాప్రతినిధుల పిల్లలను సైతం ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వ విద్యా వ్యవస్థను పరిరక్షించాలని వారు డిమాండ్ చేశారు. ప్రయివేటు విద్యా వ్యవస్థలో ఫీజుల నియంత్రణపై ప్రభుత్వానికి పట్టు లేకపోవడంతో కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థుల తల్లిదండ్రుల రక్తమాంసాలు పీల్చుకు తింటున్నారని విమర్శించారు. ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొచ్చి పేద విద్యార్థులకు కూడా ఉన్నత విద్య ఉచితంగా దక్కే విధంగా చూడాలని కోరారు. విద్యా హక్కు చట్టాన్ని రాష్ట్రంలో పకడ్బందీగా అమలు చేయకపోవడంతో అర్హులైన దళితులు, గిరిజనులు, వికలాంగుల పిల్లలు విద్యకు నోచుకోవడం లేదని చెప్పారు.
బెస్ట్ అవైలబుల్ స్కీం విద్యార్థులకు సరిపడా బడ్జెట్ కేటాయించకపోవడం వల్ల ప్రయివేటు యాజమాన్యాలు విద్యార్థులను బయటికి గెంటేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస ప్రాథమిక సౌకర్యాలు ఉండటం లేదని వారు విమర్శించారు. పేదలకు పెద్ద జబ్బులొస్తే కార్పొరేట్ వైద్యం చేయించుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు ప్రభుత్వ వైద్యశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సౌకర్యాలపై జూలై, ఆగస్టు నెలలో సమస్యలపై అధ్యయనాలు సదస్సులు, ధర్నాలు వంటి దశల వారి పోరాటాలకు శ్రీకారం చుట్టనున్నట్టు తెలిపారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ పై పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలు ట్రోల్ దాడి చేయడానికి ఖండించారు. 16 రకాల నిత్యవసర సరుకుల కోసం దశలవారీగా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నెల 28 నుంచి రాష్ట్రస్థాయి సామాజిక శిక్షణ తరగతులు హైదరాబాద్ లో నిర్వహించనున్నట్టు వారు చెప్పారు. సమావేశంలో కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.ప్రకాష్ కరత్, పి.అశోక్, పి.పరశురాములు రాష్ట్ర సహాయ కార్యదర్శులు తిప్పారపు సురేష్, డి.రామ్మూర్తి, కోట గోపి, బొట్ల శేఖర్, ఉప్పలి మల్కయ్య తదితరులు పాల్గొన్నారు.
దళిత క్రైస్తవుల ఎస్సీ హోదాపై ఈనెల 10 నుంచి జిల్లాల సదస్సులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



