నవతెలంగాణ-కమ్మర్‌పల్లి: పంట అవశేషాలను కాల్చవద్దు.. భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మండల వ్యవసాయ అధికారి బి.రాజు, సుస్థిర వ్యవసాయ కేంద్రం సిఆర్పి చింత శ్రీనివాస్ అన్నారు. మంగళవారం వేల్పూర్ మండలం కుక్కునూర్, కోమన్ పల్లి గ్రామాలలో పంట వ్యర్థాలను కాల్చద్దని, భూమి ఆరోగ్యాన్ని కాపాడాలని రైతులకు, ఉపాధి హామీ కూలీలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వరి పంట అవశేషాలు కాల్చితే నేలలో ఉన్న వానపాములు, సూక్ష్మజీవులు వేడితో చనిపోతాయన్నారు. వాయు కాలుష్యం పెరిగి కర్బన ఉద్గారాలు వాతావరణ మార్పులకు దారితీస్తాయన్నారు. పొగ వల్ల శ్వాస సమస్యలు, కంటి, ఊపిరితిత్తుల దగ్గు వంటి వ్యాధులు వస్తాయని తెలిపారు.
పొలంలో గాలి ప్రసరణ, నీటి చొరబాటు తగ్గి తదుపరి పంట దిగుబడి పడిపోతుందని తెలియజేశారు. భూమి గట్టిపడి నీరు నిల్వ సామర్థ్యం తగ్గిపోతుందని, భూమి చౌడుగా మారుతుందన్నారు. వరి కొయ్యలను కాల్చకుండా పొలంలో ఉంచాలని, నీరు పెట్టి ట్రాక్టర్ రోటవేటర్ తో 25 రోజులలో రెండుసార్లు దమ్ము చేస్తే గడ్డి కుళ్ళి పంటకు సేంద్రియ కర్బనం అందుతుందన్నారు. వరి కొయ్య కాలను కాల్చకుండా భూమి సారవంతం కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ రోజా, ఉపాధి హామీ కూలీలు, గ్రామ రైతులు, తదితరులు పాల్గొన్నారు.



