– ఈ తరహా పరిశీలన వ్యక్తిగత గోప్యత హక్కును ఉల్లంఘించడమే : హైకోర్టు ఆదేశాలకు సుప్రీం బ్రేక్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
లైంగికదాడి బాధితురాలి జాతకంలో కుజ దోషం ఉన్నదో, లేదో పరిశీలించాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు నిలిపేసింది. జ్యోతిష్యం సైన్స్ ఔనా? కాదా? అనే అంశం జోలికి వెళ్లడం లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నిందితుని బెయిలు దరఖాస్తుపై విచారణ జరిపేటపుడు ఇటువంటి ఆదేశాలు ఇచ్చి ఉండకూడదని తెలిపింది. ఇది పూర్తిగా సందర్భరహితమైన చర్య అని, వ్యక్తిగత గోప్యత హక్కును ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. అసలు విషయాన్ని దీనితో ముడిపెట్టడాన్ని మాత్రమే తాము పరిశీలిస్తున్నామని తెలిపింది. లైంగికదాడి బాధితురాలికి కుజ దోషం ఉన్నదని నిందితుని తరపు న్యాయవాది అలహాబాద్ హైకోర్టు లక్నో ధర్మాసనంలో వాదించారు. జాతకంలో కొన్ని గ్రహాలు కలవడం వల్ల కుజ దోషం ఏర్పడుతుందని, ఇది సంతోషకరమైన జీవితానికి అడ్డంకిగా నిలుస్తుందని చెప్పారు. ఆమెను పెండ్లి చేసుకోవాలనే ఉద్దేశం నిందితునికి లేదని చెప్పారు. అయితే బాధితురాలి తరపు న్యాయవాది మాట్లాడుతూ, తన క్లయింట్‌కు కుజ దోషం లేదన్నారు. ఈ వాదనలపై హైకోర్టు స్పందిస్తూ, నిందితుడు, బాధితురాలు తమ పుట్టిన తేదీ, సమయంతో కూడిన బర్త్ చార్టులను 10 రోజుల్లోగా లక్నో విశ్వవిద్యాలయంలోని జ్యోతిష్య విభాగం అధిపతికి అందజేయాలని ఆదేశించింది. ఈ ఇద్దరి జాతకాల వివరాలను మూడు వారాల్లోగా సీల్డ్ కవర్లో సమర్పించాలని జ్యోతిష్య విభాగాధిపతిని ఆదేశించింది.