ఆత్మహత్యలు చేసుకోవద్దు

– డాక్టర్‌ అశోక్‌ పరికిపండ్ల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
చదువు జీవితంలో ఒక భాగమే కానీ, చదువే జీవితం కాదని ఆత్మహత్యల నివారణ కమిటీ చైర్మెన్‌, సైకాలజిస్టుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్‌ పరికిపండ్ల అశోక్‌ తెలిపారు. విద్యార్థులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. ఇంటర్మీడియట్‌ ఫలితాలు వెల్లడవుతున్న నేపథ్యంలో మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తల్లిదండ్రుల అత్యాశ, పక్కవారితో పోల్చడం తదితర కారణాలతో విద్యార్థులు ఆత్మన్యూనతతో తాత్కాలిక ఆవేశానికి లోనై ఆత్మహత్యల దిశగా ఆలోచిస్తుంటారని హెచ్చరించారు. తల్లిదండ్రులు అలాంటి తప్పులు చేయవద్దని సూచించారు. హై స్కూలు స్థాయిలో ఇంగ్లీషు సబ్జెక్టులో ఫెయిల్‌ అయిన సచిన్‌ టెండూల్కర్‌ ప్రపంచంలోనే దిగ్గజ బ్యాట్స్‌మన్‌గా, ప్రముఖ క్రికెటర్‌గా అవతరించాడని పేర్కొన్నారు. ఆయన ఏదైతే ఇంగ్లీష్‌ సబ్జెక్టులో ఫెయిల్‌ అయినాడో అదే ఆంగ్లం సబ్జెక్టులోఆయన జీవితం ఒక పాఠంగా వచ్చిందని గుర్తుచేశారు. అనేక ప్రయత్నాల తర్వాతే థామస్‌ అల్వా ఎడిసిన్‌ బల్బును కనిపెట్టారని తెలిపారు. అబ్రహాం లింకన్‌ అనేక పదవులకు వందల సార్లు పోటీ చేసి గెలుపొందకపోయినా పట్టు వదలకుండా పోరాడి చివరకు ఆ దేశ అధ్యక్షుడయ్యారని చెప్పారు. చదువంటే కేవలం మార్కులు, ర్యాంకులు మాత్రమే కాదని తెలిపారు.

Spread the love