ఎవరినీ వదలం

Don't leave anyone behind– ఆధారాల కోసమే అఫిడవిట్‌
– ఏజెన్సీలకు డెడ్‌లైన్‌ పెట్టారు
– అందుకే వేగంగా పనులు చేశారు
– అలాంటి ఆదేశాలు ఇచ్చిన వాళ్లనూ పిలుస్తాం : కాళేశ్వరం జ్యుడీషియల్‌ కమిషన్‌ చైర్మెన్‌ జస్టిస్‌ పీసీ ఘోష్‌
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
కాళేశ్వరం బ్యారేజీల వైఫల్యానికి కారణమైన బాధ్యులెవరినీ వదలబోమని జ్యుడీషియల్‌ కమిషన్‌ చైర్మెన్‌ జస్టిస్‌ పీసీ ఘోష్‌ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో మీడియాతో ఆయన చిట్‌చాట్‌ చేశారు. వర్కింగ్‌ ఏజెన్సీల ప్రతినిధులను విచారణకు పిలిచినట్టు తెలిపారు. వాళ్లు చెప్పిన అంశాలన్నింటినీ అఫిడవిట్‌ రూపంలో ఇవ్వాలని ఆదేశించామని చెప్పారు. గ్రౌండ్‌ రిపోర్టు తెలుసుకునేందుకే అఫిడవిట్‌ ఫైల్‌ చేయాలని ఆదేశించామని చెప్పారు. గడువులోగా పనులు పూర్తిచేయాలని గత సర్కారు తమపై ఒత్తిడి తెచ్చిందనీ, డెడ్‌లైన్‌ విధించిందనీ, అందుకే వేగంగా పనులు పూర్తిచేశామని ఏజెన్సీల ప్రతినిధులు విచారణలో చెప్పారని వివరించారు. ఎవరు ఏది చెప్పినా పక్కాగా రికార్డులను నిర్వహిస్తున్నామనీ, అన్నింటినీ రికార్డుల రూపంలో ఉంచుతున్నామని చెప్పారు.
ఈ నెలాఖరు నాటికి అఫిడవిట్‌ ఇవ్వాలని నిర్మాణ సంస్థలను ఆదేశించామన్నారు. ఎవరి ఆదేశాల మేరకు పనులు ఆదరాబాదరాగా జరిగాయన్నది రికార్డుల రూపంలో సమాధానం వచ్చాకే, సంబంధిత ఆదేశాలు ఇచ్చిన బాధ్యులను కూడా విచారణకు పిలుస్తామని చెప్పారు. ఆధారాల కోసమే అఫిడవిట్‌ అడుగుతున్నామని తెలిపారు. కాళేశ్వరం నిర్మాణంలో భాగస్వాములైన కొందరు అధికారులు ప్రస్తుతం రాష్ట్రంలో లేరనీ, వాళ్లు వచ్చాక విచారిం చాల్సి ఉందని తెలిపారు. కాగ్‌, విజిలెన్స్‌ రిపోర్టులు అందాయనీ, వాటిని కూడా పరిశీలిస్తు న్నామని చెప్పారు. వాళ్లనూ విచారణ చేయనున్నట్టు తెలిపారు. ఎవరైనా తప్పుడు అఫిడవిట్‌ ఫైల్‌చేస్తే తమకు తెలిసిపోతుందనీ, వాళ్లపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Spread the love