మనల్నే వదలనోడు వాళ్లనొదుల్తడా?

He will not leave us alone Is it because of them?– ఏడాది తర్వాత కాంగ్రస్‌ సర్కార్‌లో గందరగోళం
– మోడీ ఓ దుర్మార్గుడు.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొనాలని చూసిండు
– రేవంత్‌ బీజేపీలోకి వెళతాడని నేను అనుకోవటం లేదు
– 20 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు నాతో టచ్‌లో ఉన్నరు
– లిక్కర్‌ కేసంతా ఉత్తిదే
– బీఎల్‌ సంతోశ్‌ వ్యవహారంలో ప్రధాని మనపై కక్షగట్టిండు : బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
‘గతంలో బీఆర్‌ఎస్‌కు 104 మంది ఎమ్మెల్యేలున్నప్పుడే ప్రధాని మోడీ మన సర్కారును కూల్చాలని చూసిండు. ఆయన అంతటి దుర్మార్గుడు. అలాంటిది ఇప్పుడు 64 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్‌ను వదలిపెడ తడా..? మోడీ మూడోసారి అధికారంలోకి వస్తే కచ్చితంగా రేవంత్‌ సర్కార్‌ను కూలుస్తడు…’ అని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ఏడాది తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం గందరగోళంలో పడుతుందంటూ ఆయన హాట్‌ హాట్‌ కామెంట్లు చేశారు. రేవంత్‌ బీజేపీలోకి వెళతాడని తాను భావించటం లేదన్నారు. ఒకవేళ ఆయన ఆ పార్టీలోకి వెళ్లినా… కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వెళ్లబోరని తెలిపారు. గతంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన వారిని దొరకబట్టామని అన్నారు. ఆ కేసులో బీజేపీ నేత బీఎల్‌ సంతోశ్‌ను అరెస్టు చేసేందుకు రాష్ట్ర పోలీసులను ఢిల్లీకి పంపించామని చెప్పారు. అప్పటి నుంచి మోడీ… బీఆర్‌ఎస్‌పై కక్ష కట్టారని విమర్శించారు. అందుకే కవితను అరెస్టు చేసి జైలుకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. లిక్కర్‌ కేసంతా ఉత్తిదేనంటూ ఆయన ఈ సందర్భంగా కొట్టిపారేశారు.
గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ లోక్‌సభ అభ్యర్థులకు కేసీఆర్‌ బీఫాంలను అందజేశా రు. ఎన్నికల నియమావళిని అనుసరించి ఎలక్షన్‌ ఖర్చుల కోసం ఒక్కో అభ్యర్థికి రూ.95 లక్షల చెక్కును అందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశానికి ఎంపీ అభ్యర్థులతోపాటు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, శాసన సభ, మండలి మాజీ సభ్యులు, ఆ పార్టీ జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గసభ్యులు, జడ్పీ చైర్‌పర్సన్లు, ముఖ్యులు హాజరయ్యారు. వారందరినీ ఉద్దేశించి కేసీఆర్‌ మాట్లాడుతూ… గతంలో బీఆర్‌ఎస్‌లో ఉండి, ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరిన నేతలు ఇప్పుడు బాధపడుతున్నారని చెప్పారు. ‘అధికారంలో ఉంది కదాని హస్తం పార్టీలోకి వెళితే…అక్కడంతా బీజేపీ కథనడుస్తోంది…’ అంటూ ఓ నాయకుడు తనతో చెప్పి బాధపడినట్టు కేసీఆర్‌ తెలిపారు. 20 మంది ఎమ్మెల్యేలను తీసుకుని రావాలా సార్‌…? అంటూ సదరు నేత అడిగితే, ఇప్పుడే వద్దంటూ తాను వారించినట్టు చెప్పారు. కాంగ్రెస్‌లో టీమ్‌ వర్క్‌ లేదు, స్థిరత్వం లేదని ఎద్దేవా చేశారు. ఆ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌పై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందనీ, అందువల్ల రానున్న రోజులన్నీ బీఆర్‌ఎస్‌వేనని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే ఉద్యమకాలం నాటి కేసీఆర్‌ను చూస్తారని తెలిపారు. ధాన్యాన్ని కొనుగోలు చేయటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్‌ సర్కారు మాటలను అధికారులు సైతం లక్ష్య పెట్టటం లేదని తెలిపారు. ఇలాంటి అనేక విషయాలను ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ తనతో పంచుకున్నారని వివరించారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ ఎనిమిది స్థానాల్లో విజయం సాధిస్తుందని కేసీఆర్‌ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. మరో మూడు స్థానాల్లో విజయావకాశాలున్నాయని చెప్పారు. మేడిగడ్డ పిల్లర్ల డ్యామేజీ వెనుక ఇసుక కుంగిపోవటమే కారణమని అన్నారు. కొందరు నేతలు పార్టీని వీడినంత మాత్రాన నష్టమేమీ లేదని ఆయన స్పష్టం చేశారు.
22 నుంచి బస్సు యాత్రలు..
రైతు సమస్యలపై పోస్టుకార్డు ఉద్యమాలు : కేసీఆర్‌ పిలుపు
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ ఈనెల 22 నుంచి బస్సు యాత్రలు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను, రూట్‌మ్యాప్‌ను తయారు చేయాలంటూ ఆయన సీనియర్లను ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో లోక్‌సభ అభ్యర్థులకు బీఫాంలను అందజేసిన కేసీఆర్‌… నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఎక్కడెక్కడ బస్సు యాత్రలు చేయాలనే దానిపై జిల్లా స్థాయి నాయకత్వాలు ప్రతిపాదనలు పంపించాలని కోరారు. యాత్రల సందర్భంగా అవసరమైతే తాను జిల్లాల్లోనే బస చేస్తానని వివరించారు. వరంగల్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, సిద్ధిపేట లాంటి ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలు కూడా నిర్వహించాలని సూచించారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకీ తీవ్రతరమవుతున్న నేపథ్యంలో సాయంత్రం వేళల్లో రోడ్‌ షోలు, కార్నర్‌ మీటింగులు నిర్వహించాలని అన్నారు. ప్రతీ రోజూ ఒక్కో లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని రెండు మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో రోడ్‌ షోలు నిర్వహించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఉదయం వేళల్లో రైతుల వద్దకు వెళ్లి, ధాన్యం కొనుగోళ్లు, మద్దతు ధరలు, వరికి రూ.500 బోనస్‌ తదితర సమస్యలపై వారితో చర్చించాలని కోరారు. అదే సమయంలో రైతులతో కలిసి కల్లాల్లోనే నిరసనలు తెలిపే విధంగా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. రైతులకు సంబంధించిన అనేకాంశాలపై పోస్టు కార్డు ఉద్యమాన్ని ఉధృతం చేయాలనీ, ఒక్కో పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో లక్ష కార్డులు ప్రభుత్వానికి రాయాలని పిలుపునిచ్చారు.

Spread the love