దాటవేతలొద్దు..

Don't skip..– ఎంపీ ఎన్నికల కోడ్‌ పేరిట ఎగవేతలు, కోతలు పెట్టొద్దు…
– ఫిబ్రవరి 20 లోపే ఆరు గ్యారెంటీలపై విధానపర నిర్ణయం తీసుకోండి
– ఓటాన్‌ అకౌంట్‌ కాదు.. పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టండి
– అప్పుడే మీ హామీల అమలు సాధ్యం
– యాసంగి పంటకు బోనస్‌పై తక్షణమే నిర్ణయం తీసుకోండి : మీడియాతో ఇష్టాగోష్టిలో ప్రభుత్వానికి మాజీమంత్రి హరీశ్‌రావు సూచన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాబోయే లోక్‌సభ ఎన్నికల కోడ్‌ పేరిట ఆరు గ్యారెంటీలకు ప్రభుత్వం ఎగవేతలు, దాటవేతలు, కోతలు పెడుతుందేమోననే ఆందోళనలో రాష్ట్ర ప్రజలున్నారని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. తాను ఇటీవల పలు జిల్లాల్లో పర్యటించినప్పుడు ఇదే అనుమానాన్ని పలువురు వ్యక్తం చేశారని ఆయన తెలిపారు. అందువల్ల ఆరు గ్యారెంటీలపై ఎగవేతలు, దాటవేతలు, కోతలొద్దంటూ ప్రభుత్వానికి సూచించారు. ఫిబ్రవరి చివరి వారంలో లోక్‌సభ ఎన్నికల కోడ్‌ రానుందనే వార్తల నేపథ్యంలో ఆ లోపే (ఫిబ్రవరి 20) వాటిపై ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఎంపీ ఎలక్షన్ల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోందనీ, అలా కాకుండా పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడితేనే హామీల అమలు సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
ఆదివారం హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష కార్యాలయంలో హరీశ్‌రావు… మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ హామీనిచ్చిన ఆరు గ్యారెంటీలు, ప్రజా పాలన, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రాలు, యాసంగి పంటకు బోనస్‌, లోక్‌సభ ఎన్నికలు తదితరాంశాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. పాత్రికేయులు అడిగిన వివిధ ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామంటూ కాంగ్రెస్‌ ప్రకటించిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ గడువు మార్చి 17తో ముగుస్తుందని తెలిపారు. ఈలోపే లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌, కోడ్‌ రానున్నాయని వివరించారు. అలాంటప్పుడు ఆ కోడ్‌ పేరుతో ఆరు గ్యారెంటీల అమల్లో జాప్యం జరిగే అవకాశముందని చెప్పారు. అందువల్ల ఈ లోపే వాటిపై ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
ఆ వెంటనే జీవోలు, మార్గదర్శకాలు విడుదల చేయటం ద్వారా ఆరు గ్యారెంటీల అమలుకు ఎలాంటి అడ్డంకులు (ఆన్‌ గోయింగ్‌ స్కీమ్స్‌ అవుతాయి కాబట్టి) లేకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ కూడా హామీల అమలుకు ప్రతిబంధకంగా మారనుందని హెచ్చరించారు. ఆ బడ్జెట్‌లో ఏ పద్దుకు ఎన్ని నిధులు, ఎంత కేటాయింపులు అనే విషయం ఉండబోదన్నారు. అందువల్ల ఫిబ్రవరిలోనే పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టటం ద్వారా గ్యారెంటీల అమలుకు పూనుకోవాలనీ, తద్వారా ప్రజల పట్ల చిత్తశుద్ధిని నిరుపించుకోవాలని ప్రభుత్వానికి సవాల్‌ విసిరారు. అందుకోసం ఇప్పటి నుంచే వివిధ పథకాలను గ్రౌండింగ్‌ చేయాలని కోరారు.
బోనస్‌కు విధి విధానాలు ఖరారు చేయండి…
మార్చి, ఏప్రిల్‌ నెలల్లో యాసంగి పంట రాబోతోందని హరీశ్‌రావు ఈ సందర్భంగా చెప్పారు. క్వింటాల్‌ వరికి రూ.500 బోనస్‌ను ఇస్తామంటూ ఎన్నికల్లో కాంగ్రెస్‌ హామీనిచ్చిందని గుర్తు చేశారు. అందువల్ల బోనస్‌ కోసం ఇప్పటి నుంచే విధి విధానాలను ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అంతేతప్ప దీన్ని కూడా లోక్‌సభ ఎన్నికల కోడ్‌లో ఇరికించొద్దని సూచించారు. తద్వారా రైతులను ఇబ్బంది పెట్టొద్దన్నారు. అసెంబ్లీలో పలు అంశాలపై శ్వేతపత్రాలను ప్రకటించిన ప్రభుత్వం… డిసెంబరులో వేయాల్సిన రైతు బంధుపై ఎందుకు శ్వేతపత్రం విడుదల చేయలేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికీ లక్షలాది మంది రైతులు తమ ఖాతాల్లో ఎప్పుడు డబ్బులు పడతాయా..? అని ఎదురు చూస్తున్నారని చెప్పారు.
మిగతా పదకొండు అంశాల సంగతేమిటి..?
కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో మొత్తం 13 అంశాలున్నాయని హరీశ్‌రావు ఈ సందర్భంగా తెలిపారు. వీటిలో ఇప్పటి వరకూ రెండింటినే ప్రారంభించారనీ, మిగతా పదకొండింటి సంగతేంటని ఆయన ప్రశ్నించారు.
తమ ప్రభుత్వ హయాంలో ఆరోగ్య శ్రీ కింద మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు, గుండెకు సంబంధించిన చికిత్సలు, శస్త్ర చికిత్సల కోసం రూ.11.05 లక్షల ప్యాకేజీని ప్రకటించామని తెలిపారు. ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.10 లక్షల వరకూ పెంచామని చెబుతున్న సీఎం రేవంత్‌… ఇప్పటి వరకూ ఆ ప్యాకేజీ కింద ఎవరెవరికి ఎన్నెన్ని చికిత్సలు చేశారో చెప్పాలన్నారు. 2023 డిసెంబరు మూడున బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దిగిపోతే… 2024 మార్చి వరకూ అప్పులపై వేసుకున్న అంచనాలను కూడా కలిపి శ్వేతపత్రంలో చెప్పటమేంటని వాపోయారు. రేవంత్‌ సర్కారు కూడా రూ.13 వేల అప్పు కావాలంటూ ఆర్‌బీఐకి విజ్ఞప్తి చేసిందన్నారు. ఇప్పటికే రూ.1,400 కోట్ల రుణం తీసుకున్నట్టు తెలిసిందని అన్నారు.
నిరుద్యోగ భృతిపై స్పష్టతేది…?
నిరుద్యోగ భృతి అమలుపై కూడా రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత లేదని హరీశ్‌రావు విమర్శించారు. దీనిపై కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌, ప్రియాంక ఒక రకంగా ప్రకటనలు చేస్తే… డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరో రకంగా స్టేట్‌మెంట్లు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. ఫిబ్రవరిలో ఉద్యోగ నోటిఫికేషన్లు, జాబ్‌ క్యాలెండర్‌ వేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే టీఎస్‌పీఎస్సీకి చైర్మెన్‌ను, సభ్యులను ఇంతవరకూ నియమించలేదన్నారు. అయినా సీఎస్‌తో లేదా ప్రస్తుతమున్న టీఎస్‌పీఎస్సీ కార్యదర్శితో అందుకనుగుణంగా కార్యాచరణ రూపొందిచొచ్చని తెలిపారు. బీఆర్‌ఎస్‌ హయాంలో రూ.40 వేల కోట్ల బిల్లులు పేరుకు పోయాయనే విషయాన్ని పాత్రికేయులు ప్రస్తావించగా…’బిల్లుల చెల్లింపు అనేవి ఆన్‌గోయింగ్‌ ప్రాసెస్‌, అవి ఒకదాని తర్వాత ఒకటి చెల్లింపబడుతూనే ఉంటాయి…’ అని సమాధానమిచ్చారు. 2014లో తాము అధికారం చేపట్టే నాటికి రూ.3,200 కోట్ల మేర ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు పేరుకు పోయాయని తెలిపారు.
వాటిని దాచటం సాధ్యమా..?
బీఆర్‌ఎస్‌ సర్కారు రూ.66 కోట్ల విలువైన ల్యాండ్‌ క్రూజర్‌ వాహనాలను కొనుగోలు చేసి, విజయవాడలో దాచిందంటూ సీఎం రేవంత్‌ వ్యాఖ్యానించటం శోచనీయమని హరీశ్‌రావు పేర్కొన్నారు. వాటిని దాచటం సాధ్యమా..? అని ప్రశ్నించారు. ఏ రాష్ట్రానికి చెందిన వాహనాలనైనా బుల్లెట్‌ ఫ్రూప్‌ కోసం విజయవాడకు తరలించాల్సిందేనని స్పష్టం చేశారు.
ఘోరంగా ప్రొటోకాల్‌ ఉల్లంఘన…
కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ప్రొటోకాల్‌ను ఘోరంగా ఉల్లంఘిస్తున్నారని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. నర్సాపూర్‌, జనగామ, హుజూరాబాద్‌, సంగారెడ్డిలో ఇదే జరిగిందని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కాకుండా వారిపై ఓడిపోయిన కాంగ్రెస్‌ నేతలను పిలుస్తున్నారని తెలిపారు. ప్రజా పాలన కార్యక్రమంలో సైతం తమ పార్టీ ఎమ్మెల్యేల ఫొటోలను పెట్టటం లేదని విమర్శించారు.
‘లోక్‌సభ’పై ఫోకస్‌…
రానున్న లోక్‌సభ ఎన్నికలపై ఇప్పటి నుంచే తమ పార్టీ దృష్టి సారిస్తోందని హరీశ్‌ తెలిపారు. మూడో తేదీ నుంచి ఒక్కో ఎంపీ స్థానంపై సమీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. మెదక్‌ నుంచి కేసీఆర్‌ పోటీ చేయటంపై అడగ్గా… ఆ విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు. ఆ స్థానం నుంచి కాంగ్రెస్‌, బీజేపీ అగ్రనేతలు బరిలోకి దిగబోతున్నారనే వార్తలను ప్రస్తావించగా… ‘చూద్దాం…’ అని వ్యాఖ్యానించారు. శస్త్ర చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్‌…జనవరి చివరి నాటికి ఎలాంటి సాయం లేకుండానే తనంతట తాను నడవొచ్చంటూ డాక్టర్లు అభిప్రాయపడ్డారని వివరించారు.

Spread the love