భూపతిపూర్ లో తాగునీటి కష్టాలు

– 6 చేతి బోరులకు, 4చేతి పంపు లు కరాబ్
– తాగునీటికి తెల్లాడుతున్న ఆదివాసులు
– నెల రోజుల నుండి గొంతెండుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారని గ్రామస్థులు ఆగ్రహం
నవతెలంగాణ – తాడ్వాయి
మండలంలోని గంగారం గ్రామపంచాయతీ పరిధిలోని భూపతిపూర్ ఆదివాసి గ్రామంలో తాగునీటి సమస్య వెంటాడుతోంది. గత నెల రోజులుగా ఇదే పరిస్థితి నెలకొన్నా పట్టించుకునేవారు కరువయ్యారు. గంగారం గ్రామపంచాయతీలోని భూపతిపూర్ గ్రామంలో సుమారు 100 ఇండ్లు, 500 జనాభా గల పూర్తి ఆదివాసి గిరిజన కుటుంబాలవారు నివాసం ఉంటున్నారు. వీరు గొంతు తడుపుకునేందుకు గ్రామంలోని ఆరు హ్యాండ్ పంపులు వేశారు. మిషన్ భగీరథ నీరు వాటర్ ట్యాంక్ కూడా ఉంది. మిషన్ భగీరథ నీరు నెలరోజుల నుండి రావడం లేదు. గ్రామంలో 6 హ్యాండ్ పంపు(చేతి బోరు) లకు నాలుగు చెడిపోవడంతో వీరికి నీటి కష్టాలు ఆరంభమయ్యాయి. రెండు చేతులు పంపుల తో ఊరు మొత్తం 100 కుటుంబాల ఆదివాసీలు తాగునీరు తెచ్చుకోవడానికి తండ్లాటపడుతున్నారు. గ్రామంలోని తాగునీటి సమస్యపై పలుమార్లు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు విన్నవించినా పట్టించుకునేవారు కరువయ్యారని గ్రామస్థులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాల్సిందిగా అంతా వేడుకుంటున్నారు. ఈ సమస్యను ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ రామ్ చరణ్ తో వివరణ అడగగా చిన్నబోయినపల్లిలో మరమ్మతులు ఉండడంతో ఇబ్బంది ఏర్పడిందని, రేపటి వరకు సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Spread the love