ముంచుకొస్తోంది..

– సౌరాష్ట్ర, కచ్‌ జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌
– బిపోర్‌జారు తుపానుతో 8 రాష్ట్రాల్లో వర్షాలు
న్యూఢిల్లీ : బిపోర్‌జారు తుపాను అంతకంతకూ తీవ్రమవుతూ గుజరాత్‌పై విరుచుకుపడుతోందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బుధవారం తెలిపింది. గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కచ్‌ జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. జునాగఢ్‌, ద్వారక తీర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు తెలిపారు. ద్వారకా జిల్లాలో సుమారు 400కు పైగా రక్షణ శిబిరాలను ఏర్పాటుచేశామని అన్నారు. భుజ్‌లోని జఖౌ ఓడరేవులో పెద్ద సంఖ్యలో పడవలు చేరుకున్నాయి. రాజ్‌కోట్‌లోని రిలే టవర్‌ను కూల్చివేసినట్టు అధికారులు తెలిపారు. తుఫాను ధాటికి కూలిపోయే ప్రమాదం ఉన్నందున టవర్‌ను తొలగించామనీ, త్వరలో కొత్త టవర్‌ను నిర్మిస్తామని ఆకాశవాణి రాజ్‌కోట్‌ డైరెక్టర్‌ రమేష్‌ చంద్ర వివరించారు. ప్రధాని సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైందని, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సహాయక బృందాలను మోహరించామని కేంద్రమంత్రి పురషోత్తమ్‌ రూపాలా పేర్కొన్నారు. గురువారం సాయంత్రం గుజరాత్‌లోని జఖౌ పోర్ట్‌లో తీరాన్ని దాటవచ్చని ఐఎండీ అధికారులు అంచనా వేశారు. ఆ సమయంలో గంటకు 150 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.
8 రాష్ట్రాల్లో వర్షాలు..
ఈ తుపాను ప్రభావంతో గుజరాత్‌తో పాటు మరో ఎనిమిది రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో కేరళ, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గోవా రాష్ట్రాలతో పాటు డామన్‌డయ్యూ, లక్షద్వీప్‌, దాద్రానగర్‌ హవేలీ కేంద్ర పాలిత ప్రాంతాలు అప్రమత్తమయ్యాయి. రాజస్థాన్‌లో జూన్‌ 16 నుంచి ఈ తుఫాను ప్రభావం ఉండనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.

Spread the love