మోడీపై కాంగ్రెస్ ఫిర్యాదు.. పరిశీలిస్తున్నామన్న ఈసీ..!

నవతెలంగాణ-హైదరాబాద్ : ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ చేసిన ‘చొరబాటుదారు’ వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫిర్యాదును తాము పరిశీలిస్తున్నామని ఈసీ వర్గాలు వెల్లడించినట్లు ఓ జాతీయ మీడియా కథనం పేర్కొంది. ఇటీవల రాజస్థాన్‌లోని బాంస్వాడాలో జరిగిన ర్యాలీలో మోడీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రజల సంపద అంతా మైనార్టీలైన ముస్లింలకు పంచుతుందని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. ప్రజల వద్ద ఉన్న బంగారంతో సహా సంపద మొత్తం సర్వే చేసి అందరికీ సమానంగా ‘పునఃపంపిణీ’ చేస్తామని కాంగ్రెస్‌ తన మేనిఫెస్టోలో చెప్పిందని అన్నారు. ఆ మేరకు దేశ సంపదనంతా చొరబాటుదారులకు, ఎక్కువమంది పిల్లలు ఉన్నవారికి పంచుతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్‌ సహా ఇతర విపక్ష పార్టీలు మండిపడ్డాయి. తమ మేనిఫెస్టోలో హిందూ-ముస్లిం అని ఎక్కడ ఉందో ప్రధాని చూపాలని హస్తం పార్టీ డిమాండ్ చేసింది. ఏళ్లతరబడి భారత్‌లో నివసిస్తున్న మైనార్టీలు చొరబాటుదారులా? గతంలో ఏ ప్రధాని కూడా ఇలా మాట్లాడలేదని ధ్వజమెత్తాయి. అభిషేక్‌ మను సింఘ్వి, గుర్దీప్‌ సప్పల్‌లతో కూడిన కాంగ్రెస్‌ ప్రతినిధి బృందం సోమవారం ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌తోపాటు కమిషనర్లు జ్ఞానేశ్‌ కుమార్‌, సుఖ్బీర్‌సింగ్‌ సంధులను కలిసి ప్రధానితోపాటు బీజేపీపై మొత్తం 16 ఫిర్యాదులు అందజేసింది. .

Spread the love