ఎన్ని’కల’ క్రోధి

ఎన్ని'కల' క్రోధికాలచక్రం గిర్రున తిరుగుతోంది. కాలగమనంలో మరో తెలుగు ఏడాది కరిగిపోయింది. ‘శోభకృత్‌’కు వీడ్కోలు చెబుతూ కొత్త ఆశలు.. కొంగొత్త ఊసులతో నేటి ఉగాది పర్వదినాన ‘క్రోధి’నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాం. తెలుగు వత్సరానికి ఆహ్వానం పలుకు తున్న వేళ.. తీపి, పులుపుల మకరందం జీవితంలో అందరూ ఆస్వాదించాలి. క్రోధి నామలో ప్రవేశిస్తున్న వేళ దేశంలో సార్వత్రిక ఎన్నికలు, మరో నాలుగురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ‘వేడి’ సుర్రుమంటోంది. అత్యాధునిక ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్లు, ఆధునిక సౌకర్యాలు అందివచ్చినప్పటికీ, దేశ తొలిసార్వత్రిక ఎన్నికల తరువాత మళ్లీ అంతటి సుదీర్ఘ(44రోజుల) ఎన్నికల ప్రక్రియలో దాదాపు97కోట్ల మంది ఓటర్లు తమ నేతల భవిష్యత్తుని నిర్ణయించే బటన్‌ నొక్కనున్నారు. అందుకే ఎన్ని’కల’ బరిలో దిగిన నేతలంతా కొత్త పంచాంగంలో రాశిఫలాలను చూసుకుంటూ… ఉగాది పచ్చడిని ఇష్టంగా ఆస్వాదించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రోధి నామ సంవత్సరం ఎవరికి క్రోధమో.. ఎవరికి లాభమో మరి?
ఏటా ఉగాది రోజున పంచాంగ శ్రవణం పరిపాటే అయినా… ఈ ఏడాది మాత్రం దానికి మరింత ప్రత్యేకత చేకూరనుంది. గ్రామాల్లో, మండలాల్లో, నియోజకవర్గంలో నాయకులు తాము బలపరుస్తున్న అభ్యర్థుల భవిష్యత్‌పై పంచాంగ బలాలను చూపించుకోనున్నారు. పంచాంగ శ్రవణం పార్టీల ఆధ్వర్యంలో జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం ప్రచారం చేసుకోవడం రెండు జరిగిపోతాయని నాయకులు దూర దృష్టితో వ్యవహరిస్తున్నారు. జన్మ నక్షత్రాలు, రాశుల ఆధారంగా వారి భవిష్యత్‌ తెలుసుకోనున్నారు. మంచి ముహూర్తంలో తమ నేతలతో నామినేషన్‌లు వేయించి ‘క్రోధి’ అందించే విజయాల కోసం నాయకులంతా ఎదురు చూస్తున్నారు. షడ్రుచుల ఉగాది పచ్చడి తిని, పంచాంగాన్ని విని రాశిఫలితాలను తమకు అనుకూలంగా ”మలుచుకుంటూ”… భవిష్యత్‌ ఆశలతో.. కొత్త ఊసులతో నేతలంతా పార్లమెంట్‌లో అడుగు పెట్టాలని లక్ష్యంతో ప్రచారంలో పరుగులు తీస్తున్నారు.
గెలుపు లక్ష్యంతో ఎవరికి వారు పోటీ పడుతున్నారు. కానీ ఓటరు మారాజు ఎవరిని దీవిస్తాడో పంచాంగ పఠనం చేసే వేదమూర్తులకు అంతుచిక్కడం లేదు. ఉగాది పర్వదినం పూట.. రాశిఫలాల వారిగా రాజపూజ్యాలు, అవమానాలు, ఆదాయాలు, వ్యయాలు… ఎలా ఉన్నా ఎన్నికల రోజు తరుముకొస్తున్న వేళ.. తమ రాజపూజ్యాన్ని పెంచుకోవడానికి …ఉగాది పూట ప్రచార పంచాంగాన్ని వినిపించనున్నారు నేతలు. ఎవరికి వారు గెలుపు ధీమాతో ప్రచారాన్ని సాగిస్తున్నారు. తీపెవరికో, చేదెవరికో, వగరు, కారం ఫలితాలు ఎలా వస్తాయో వేచిచూడాలి.
ఉగాది కవిసమ్మేళనంలో కవులు, రచయితల వాడే భాషను బట్టి, వాటి అర్థాల స్పష్టతను బట్టి వారి మనోగతాన్ని గుర్తించవచ్చు. కానీ, మన రాజకీయ నాయకులు ఉపన్యాసాల్లో చెప్పే మాటలకు అర్థాలు ఏ డిక్షనరీల్లోనూ దొరకవు. వాటికి పర్యాయపదాలూ వుండవు. సామాన్యులకు మాటలు, సంపన్నులకు మూటలు కట్టబెట్టడం మన పాలకులకు వెన్నతో పెట్టిన విద్య. ‘ఎన్ని ఓట్లు వచ్చాయన్నదే లెక్కకాని, ఎంత సారా ఖర్చయిందన్నది లెక్క కాదే’ అంటారు రావిశాస్త్రి. ఏదోవిధంగా అధికారం దక్కించుకోడమే వారి లక్ష్యం. ఎన్నికల్లో ప్రజలకు ఎన్నెన్నో వాగ్దానాలు చేసి, ఎన్నికల తర్వాత గాలికొదిలేసిన అనేక రాజకీయ పార్టీలను చూస్తున్నాం. ఎన్ని వాగ్దానాలు చేసినా, వాటికి చట్టబద్దత వుండదు కనుక ఇబ్బడిముబ్బడిగా హామీలిస్తూనే వుంటారు.
‘ఎన్నికలలో ఎన్నికలలో?/ ఒక్క చేపకై ఎన్ని వలలో’ అని బాపురెడ్డి అన్నట్టుగా… మాటలతో, ప్రలోభాలతో మభ్యపెడుతూనే వుంటారు. ప్రతి రాజకీయపక్షానికి తన సిద్ధాంతాలకు అనుగుణమైన లక్ష్యాలు వుంటాయి. ఆ లక్ష్యసాధనకు ఉపకరించే కార్యక్రమాలను రూపొందించు కుంటారు. వాటిని ప్రజలకు వివరించి, అధికారం ఇమ్మని కోరుకునే పార్టీలు కొన్నే. దేశంలోని అనేక రాష్ట్రాలలో పాలక పార్టీలన్నీ తమ మ్యానిఫెస్టోలను పథకాల చుట్టూనే తిప్పుతున్నాయి. బీజేపీ మరో రెండడుగులు ముందుకేసి ఒక చంకలో కార్పొరేట్‌ శక్తులను, మరో చంకలో మతాన్ని అంటిపెట్టుకొని భారత్‌ వెలిగిపోతోందంటూ ప్రచారం చేస్తోంది. మరోవైపు సంక్షేమ పథకాల పట్ల బాహాటంగానే తన వ్యతిరేకతను ప్రదర్శి స్తోంది. ‘మాన్పగలిగితి కత్తికోతలు,/ మాన్ప వశమే, మాట కోతలు?/ కత్తి చంపును, మాట వాతలు/ మానవేనాడున్‌’ అంటారు గురజాడ. మాటలు మూటలు గాలిలో కలిసిపోగా, ప్రపంచ ఆకలి సూచీలో, నిరుద్యోగం వంటి అనేక విషయాల్లో భారత్‌ అథమ స్థానంలో వుందని లెక్కలు చెబుతున్నాయి. మట్టిగుర్రాన్ని నమ్ముకుని ఏట్లోకి దిగిన చందంగా మారింది దేశం పరిస్థితి. అందుకే కొత్త ఏడాది ఓటరు కొంగొత్త ఆలోచన చేయాలి. ఎన్నికల బరిలో నిలిచిన నేతల ఆదాయాలను, వ్యయాలను గమనిస్తూ.. ఎవరిపై క్రోధం ప్రకటించాలో.. ఎవరికి రాజయోగం కల్పించాలో యోచించాలి.

Spread the love