వాల్ స్ట్రీట్‌లో స్పేస్‌ఎక్స్ సరికొత్త చరిత్ర టాప్ 4 కుబేరుల సంపద కంటే ఎక్కువ
న్యూయార్క్ : ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా అవతరించారు. ఇది లక్ష కోట్ల డాలర్లు లేదా సుమారు రూ.100 లక్షల కోట్లకు పైగా సంపదకు సమానం. ఇప్పటివరకు ఈ స్థాయి సంపదకు చేరిన ఏకైక వ్యక్తి మస్క్ మాత్రమే. మస్క్‌కు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్‌ఎక్స్ వాల్ స్ట్రీట్ స్టాక్ మార్కెట్‌లో కొత్త చరత్ర సృష్టించింది. ఎస్‌పిసిఎక్స్ టిక్కర్‌తో నాస్‌డాక్‌లో రంగప్రవేశం చేసిన ఈ సంస్థ.. ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ ద్వారా రికార్డు స్థాయిలో 75 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.7 లక్షల కోట్లు) నిధులను సమీకరించడమే కాకుండా.. తొలిరోజే షేరు ధర 19 శాతం లాభంతో160.95 డాలర్ల వద్ద ముగిసింది. ఈ భారీ జంప్‌తో స్పేస్‌ఎక్స్ మార్కెట్ విలువ 2.1 ట్రిలియన్ డాలర్లకు చేరడంతో అమెరికాలోనే ఆరో అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీగా ఆవిర్భవించింది. ఇదే సమయంలో ఎలాన్ మస్క్ వ్యక్తిగత సంపద 1.11 ట్రిలియన్లకు (సుమారు రూ. 104 లక్షల కోట్లు) చేరుకోవడంతో ప్రపంచ చరిత్రలోనే అధికారికంగా ఒక ట్రిలియన్ డాలర్ల మార్కును దాటిన మొట్టమొదటి వ్యక్తిగా (ట్రిలియనీర్) మస్క్ సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ఎలాన్ మస్క్ ఒక్కడి సంపదే ఇప్పుడు ప్రపంచంలోని తర్వాతి నలుగురు అగ్ర కుబేరులైన జెఫ్ బెజోస్, లారీ పేజ్, సెర్గీ బ్రిన్, లారీ ఎల్లిసన్ల ఉమ్మడి ఆస్తుల విలువ (1.089 ట్రిలియన్లు) కంటే ఎక్కువగా 1.11 ట్రిలియన్లుగా ఉండటం విశేషం. స్పేస్‌ఎక్స్ సంస్థ 2025 సంవత్సరానికి గానూ 18.67 బిలియన్ల ఆదాయాన్ని ఆర్జించినప్పటికీ 4.94 బిలియన్ల నికర నష్టాన్ని చవి చూసింది. అయినప్పటికీ శాటిలైట్ బ్రాడ్ బాండ్ స్టార్‌లింక్, అంతరిక్ష ప్రయోగాలు, రక్షణ రంగ కాంట్రాక్టులు, కృత్రిమ మేధస్సు రంగాల్లో ఈ కంపెనీకి ఉన్న ఉజ్వల భవిష్యత్తుపై నమ్మకంతో ఇన్వెస్టర్లు మొదటి రోజే 50 కోట్లకు పైగా షేర్లను ట్రేడ్ చేశారు. కాగా.. ఈ ఐపిఒ తర్వాత కూడా క్లాస్ బి షేర్ల ద్వారా కంపెనీలోని దాదాపు 82.4 శాతం ఓటింగ్ హక్కులు ఎలాన్ మస్క్ నియంత్రణలోనే కొనసాగనున్నాయి.
ఎలన్ మస్క్ సంపద రూ.100 లక్షల కోట్లు
- Advertisement -
- Advertisement -



