– ఉద్యోగ కల్పనపై సర్కారు కాకి లెక్కలు
– పాత ఉద్యోగులనూ కలిపేసి గొప్పలు
– కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఉద్యోగులేనట
– తుమ్మితే ఊడే ఉద్యోగాలు చేస్తున్న వారు సైతం…
– వ్యవసాయంలో ఉపాధి పొందుతున్న వారినీ చేర్చారు
మన దేశం బానిసత్వ మనస్తత్వాన్ని కలిగి ఉన్నదని, ఇప్పటికీ విదేశీ రేటింగుల పైనే ఆధారపడుతున్నామని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇటీవల ఓ బడా మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో చెప్పుకొచ్చారు. దేశంలో నిరుద్యోగంపై ఢిల్లీకి చెందిన స్వతంత్ర సంస్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ (ఐహెచ్‌డీ) ఇచ్చిన నివేదిక ఆయన వ్యాఖ్యకు కారణమై ఉండొచ్చు. అనేక ఇతర సంస్థల మాదిరిగానే ఐహెచ్‌డీ కూడా దేశ ప్రాధాన్యత కలిగిన పరిశోధనా ప్రాజెక్టులు నిర్వహిస్తోంది. దీనికి ఐక్యరాజ్యసమితికి చెందిన ఐఎల్‌ఓ ఆర్థిక సాయం అందించింది. అయినప్పటికీ భారత ప్రభుత్వం అందించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని భారతీయులే ఈ నివేదికను రూపొందించారు. నివేదిక రూపకర్తలు ఈ రంగంలో నిపుణులు, నిష్ణాతులు. కాబట్టి దాని విశ్వసనీయతను ప్రశ్నించలేము. అయినా ఈ విషయాన్ని విస్మరించిన కేంద్ర మంత్రి రేటింగ్స్‌పై అక్కసు వెళ్లగక్కారు.
న్యూఢిల్లీ : దేశంలో ఉద్యోగ సంక్షోభం ఏమీ లేదని కేంద్ర మంత్రితో పాటు ప్రభుత్వానికి వంత పాడే నిపుణులు చెబుతుంటారు. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ గణాంకాల కార్యాలయం ప్రచురించిన ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) సమాచారాన్ని వారు ఉటంకిస్తున్నారు. దేశంలో ఈపీఎఫ్‌ఓ రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయని ఆ నివేదిక చెబుతోంది. అంటే కొత్తగా ఉద్యోగాలు పొందే వారి సంఖ్య పెరుగుతోందని దాని అర్థం. ఈపీఎఫ్‌ఓలో 6.4 కోట్ల మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారని ఠాకూర్ చెప్పారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సహా పలు దేశాల జనాభా కంటే ఈ సంఖ్య ఎక్కువేనని ఆయన గొప్పలు పోయారు.
నాలుగేండ్లలో 2.58 కోట్ల మందికే ఉపాధి
2019-20, 2022-23 మధ్యకాలంలో కొత్తగా 5.2 కోట్ల మంది ఉద్యోగాలు పొందారని ఈపీఎఫ్‌ఓ, ఈఎస్‌ఐ, జాతీయ పెన్షన్ పథకం (ఎన్‌పీఎస్) వద్ద ఉన్న సమాచారం చెబుతోంది. అయితే ఇందులో ఎంత మాత్రం వాస్తవం లేదు. అసలు ఈపీఎఫ్‌ఓ గణాంకాలే తప్పుల తడకలు. ఈపీఎఫ్‌ఓ, ఈఎస్‌ఐసీ, ఎన్‌పీఎస్ వద్ద ఉన్న పేరోల్ సమాచారాన్ని ప్రభుత్వం 2018 నుండి విడుదల చేస్తోంది. ఈపీఎఫ్‌ఓ వద్ద ఉన్న సమాచారం ప్రకారం 2019-2023 మధ్యకాలంలో కొత్తగా 4.86 కోట్ల మంది చందాదారులు (ఉద్యోగులు) తమ పేర్లు నమోదు చేసుకున్నారు. అయితే వాస్తవంగా ఈ నాలుగు సంవత్సరాలలో నికర నూతన పేరోల్ సమాచారం (తొలి ఉద్యోగం/తాజా ఉద్యోగం)తో పోలిస్తే కొత్తగా ఉద్యోగాలు పొందింది 2.27 కోట్ల మందే.
ఇక ఎన్‌పీఎస్ వద్ద ఉన్న సమాచారాన్ని పరిశీలిద్దాం. దీని ప్రకారం 2022-23లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో కొత్తగా ఉద్యోగాలు పొందింది 8.24 లక్షల మంది. గత నాలుగు సంవత్సరాల కాలంలో ఎన్‌పీఎస్‌లో 31 లక్షల మంది చేరారు. ఈపీఎఫ్‌ఓ, ఎన్‌పీఎస్…ఈ రెండు సంస్థల వద్ద ఉన్న సమాచారాన్ని కలిపినప్పటికీ గత నాలుగు సంవత్సరాలలో కొత్తగా ఉద్యోగాలు పొందింది 2.58 కోట్ల మందే. ప్రభుత్వం మాత్రం ఈ సంస్థల సమా చారాన్నే ఉటంకిస్తూ 5.2 కోట్ల మందికి ఉద్యోగాలు వచ్చాయని చెప్పుకుంటోంది. మరి ప్రభుత్వం వాస్త వాలను కప్పిపుచ్చి ఎందుకు అతిగా చెప్పుకుంటోంది?
కాంట్రాక్ట్ కార్మికులనూ చేర్చి…
ఈపీఎస్‌ఓ సమాచారాన్ని నిశితంగా పరిశీలిస్తే 2019-23 సంవత్సరాల మధ్య నికరంగా ఈపీఎఫ్‌లో చేరిన కొత్త సభ్యుల సంఖ్య 4.86 కోట్లు. కానీ సవరణల అనంతరం వాస్తవంగా ఈపీఎఫ్‌లో చేరిన వారు 2.27 కోట్ల మందే. ఈ నూతన ఉద్యోగాల సృష్టిపై చేస్తున్న వాదనలు కూడా తప్పుల తడకలే. ఎందుకంటే కొత్తగా ఉద్యోగాలలో చేరే వారిలో అత్యధికులు కాంట్రాక్ట్ కార్మికులు, ఉద్యోగులే. ఈపీఎఫ్‌ఓ సభ్యులకు వర్తించే సౌకర్యాలు కాంట్రాక్ట్ లేదా క్యాజువల్ కార్మికులకు కూడా వర్తింపజే యడంతో భవిష్య నిధి సంస్థ సభ్యుల సంఖ్య పెరిగింది. ఉద్యోగుల సంఖ్య 20 దాటితే వారంతా ఈపీఎఫ్‌ఓలో చేరాల్సి ఉంటుంది. ఆ విధంగా కూడా సభ్యుల సంఖ్య పెరుగుతుంది. దీనిని బట్టి అర్థమవుతోంది ఏమంటే కొత్తగా ఉద్యోగాల కల్పన ఏమీ జరగలేదు.
నిబంధనలు సరళతరం చేయడంతో…
పేరోల్ సమాచారాన్ని ఆధారంగా చేసుకొని ఉద్యోగాలు కల్పించామని చెప్పుకోవడం సరికాదు. అసలు అది ఉద్యోగుల జాబితా కాదు. ఈపీఎఫ్‌ఓలో సభ్యుడుగా చేరడం చాలా తేలిక. ఇటీవలే దీనికి సంబంధించిన నిబంధనలను సడలించారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్లు ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. వీటిని ఉచితంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. ఈపీఎఫ్‌ఓ కార్యాలయానికి వెళ్లాల్సిన పనే లేదు. ఈ కారణంగా కొత్త రిజిస్ట్రేషన్లు పెరిగాయి. అదీకాక ఉద్యోగి ఒక సంస్థ నుండి మరో సంస్థకు మారినప్పటికీ ఎన్‌రోల్‌మెంట్ నెంబరు అదే ఉంటుంది. ఈపీఎఫ్‌ఓ సభ్యులు ఉద్యోగాలు మారేటప్పుడు పాత పీఎఫ్ ఖాతాలోని నిధులను ప్రస్తుత ఖాతాలో కలుపుకోవచ్చు. ఇలాంటి చర్యల కారణంగా ఈపీఎఫ్‌ఓ సభ్యులుగా చేరే వారి సంఖ్య పెరుగుతోందే తప్ప కొత్తగా ఉద్యోగాలు వచ్చినందుకు కాదు.
అసంఘటితర రంగంలో ఉద్యోగులను కూడా…
ఏదేమైనా నాలుగు సంవత్సరాలలో 5.2 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పించామని ప్రభుత్వం చేస్తున్న వాదనలో ఎంత మాత్రం వాస్తవం లేదు. ఎందుకంటే ఇందులో తిరిగి ఉద్యోగంలో చేరిన వారు, తిరిగి ఈపీఎఫ్‌లో సభ్యత్వం తీసుకున్న వారు కూడా ఉన్నారు. ఒకవేళ 2.27 కోట్ల మందికి నికరంగా ఉద్యోగాలు ఇచ్చారని అనుకున్నా ఆ సంఖ్య కూడా తప్పే. ఎందుకంటే అప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వారు నిబంధనల మేరకు ఈపీఎఫ్ సభ్యులుగా చేరి ఉండవచ్చు. అదీకాక 90శాతం మంది కార్మికులు, ఉద్యోగులు అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారే. వారి ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే వారికి ఉద్యోగ భద్రత అనేదే ఉండదు. అలాంటప్పుడు వారిని కూడా ఉద్యోగులుగా పరిగణించడం సబబు కాదు కదా!.
వీరు కూడా ఉద్యోగులేనట
జీతం భత్యం ఏమీ లేకుండా కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటూ పనిచేస్తున్న వారిని కూడా ఉద్యోగులుగా ఎన్‌ఎస్‌ఓ పరిగణిస్తోంది. ప్రపంచంలోని సుమారు 100 దేశాలు ఇలాంటి వారిని ఉద్యోగులుగా చూడడం లేదు. అయినప్పటికీ ఎన్‌ఎస్‌ఓ తన వైఖరిని మార్చుకోవడం లేదు. ఎన్‌ఎస్‌ఓ లెక్కల ప్రకారం గత ఆరు సంవత్సరాల కాలంలో ఇలాంటి వారి సంఖ్య ఐదు కోట్లు పెరిగింది. ఇలా ఎలాంటి ప్రతిఫలం పొందకుండా కుటుంబానికి సాయపడుతున్న వారిని ఉద్యోగులుగా చూపుతూ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. ఇక దారుణమైన విషయమేమంటే కోవిడ్ కారణంగా 2019-20, 2022-23 మధ్యకాలంలో ఆరు కోట్ల మంది ప్రజలు పట్టణాలు, నగరాలను వీడి పల్లె బాట పట్టి వ్యవసాయ రంగంలో ఉపాధి పొందారు. వ్యవసాయ రంగంలో చేరిన వారి సంఖ్య పెరగడంతో స్వయం ఉపాధి పొందిన వారి వాటా కూడా ఇదే కాలంలో 53 శాతం నుంచి 58 శాతానికి పెరిగింది. మహిళలు కూడా ఎలాంటి వేతనం పొందకుండా తమ కుటుంబాలకు వ్యవసాయంలో సాయపడ్డారు. వీరందరికీ తానే కొత్తగా ఉద్యోగాలు కల్పించానని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది.
పాత ఉద్యోగులనూ కలిపేసి…
ఇక్కడ మరో విషయాన్ని కూడా గమనించాలి. 20 మంది కంటే తక్కువ ఉద్యోగులు ఉన్న సంస్థ ఈపీఎఫ్‌ఓ పరిధిలోకి రాదు. ఆ సంఖ్య 20కి చేరితే చాలు…వారందరూ భవిష్య నిధి సంస్థ సభ్యులు అవుతారు. అంటే 19 మంది ఉద్యోగులు ఉన్న సంస్థలో పనిచేసే వారు ఈపీఎఫ్ చందాదారులు కాలేరు. ఆ సంఖ్య 20కి చేరితే వారంతా ఈపీఎఫ్ సభ్యులు అవుతారు. కొత్తగా ఉద్యోగంలో చేరింది ఒకరే అయినా ఆ 20 మందినీ కొత్త ఉద్యోగులుగా ప్రభుత్వం పరిగణిస్తోంది. ఎన్‌పీఎస్ లెక్కల్లో కూడా ఇదే తర్కం కన్పిస్తుంది. ఇప్పటికే ఉద్యోగులుగా ఉన్న వారు ఎన్‌పీఎస్‌లో చేరవచ్చు. వారిని కూడా కొత్త ఉద్యోగులుగా చెప్పుకుంటే ఎలా?