కార్మిక కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి

– కనీస వేతనాలు సవరించాలి :జీపు జాతాలో సీఐటీయూ
– రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌
నవతెలంగాణ-మహేశ్వరం
ప్రీమియర్‌ ఎనర్జీస్‌ పరిశ్రమలో మృతి చెందిన కార్మిక కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌ అన్నారు. 73 షెడ్యూల్డ్‌ ఎంప్లాయిమెంట్స్‌లో 15 ఏండ్లుగా పని చేస్తున్నా కనీస వేతనాలు ఇవ్వడం లేదని, రాష్ట్రప్రభుత్వం యాజమాన్యాలకు లొంగి కనీస వేతన చట్టాన్ని సవరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస వేతన చట్టాన్ని సవరించాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో జరుగుతున్న జీపు జాతా.. రంగారెడ్డి జిల్లా కాటేదాన్‌లోని మంఖాల్‌ ఫ్యాబ్‌ సిటీ హార్డ్‌వేర్‌ పార్కులో బుధవారం పర్యటించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న మంకాల, రావిరాల, మహేశ్వరం ప్రాంతాల్లో ఉన్న కార్మికులను యజమానులు నిలువు దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాబ్‌ సిటీలో ఉన్న ప్రీమియర్‌ ఎనర్జీస్‌ కంపెనీలో కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంతో ఇద్దరు కార్మికులు మృతిచెందారనీ, ఆ కుటుంబానికి పెద్దదిక్కును కోల్పోయిన పిల్లలకు కార్మిక శాఖ రూ.కోటి నష్టపరిహారం చెల్లించేలా స్థానిక మంత్రి సబితా ఇంద్రారెడ్డి చొరవ చూపాలని కోరారు. కార్మికులకు భద్రత కరువై పిట్టల్లా రాలిపోతున్నా, పట్టించుకునే వారు లేక కుటుంబాలు అల్లాడిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికులకు కనీస వేతనాలు పెంచకపోవడం వల్ల అనేక ఇబ్బందులకు గురువుతున్నారన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగంలో కార్మికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందనీ, ఈ ప్రాంతాల్లో బెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది కార్మికులు వలస వచ్చి పని చేస్తున్నారని తెలిపారు. వీరికి 1979 అంతర్రాష్ట్ర వలస కార్మిక చట్టం అమలు చేయడం లేదన్నారు. కార్మికులకు ఇవ్వాల్సిన ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సెలవులు, బోనస్‌, గ్రాట్యూటీ కూడా ఇవ్వకుండా 12 గంటలు పని చేయించుకుంటున్నారని వాపోయారు. చట్ట ప్రకారం ప్రతి ఐదేండ్లకు కనీస వేతనాల చట్టాన్ని సవరించాల్సి ఉన్నా చేయడం లేదన్నారు. రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదేండ్లలో 2021 జూన్‌లో ఐదు రంగాలకు కనీస వేతనం రూ.18 వేలు ఉండాలని నిర్ణయించారని, దాన్ని సైతం యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గి ప్రభుత్వం గెజిట్‌ చేయడం లేదని చెప్పారు. కనీస వేతనాల సలహా మండలి సిఫారసులను బేఖాతరు చేస్తూ, కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నాయని విమర్శించారు. ఈ విషయంపై అనేక సందర్భాల్లో ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడంతోనే సీఐటీయూ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపట్టి, కార్మిక లోకాన్ని సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. జులై 17 తర్వాత ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జాతాలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌, జిల్లా ఉపాధ్యక్షులు అలువాల రవికుమార్‌, జిల్లా కార్యదర్శి ఎం. చంద్రమోహన్‌, జిల్లా సోషల్‌ మీడియా కన్వీనర్‌ రుద్రకుమార్‌, స్థానిక నాయకులు పరమేష్‌ కుమార్‌, చంద్రయ్య, శంకర్‌,వెంకటేష్‌, శేఖర్‌, అజరు తదితరులు పాల్గొన్నారు.

Spread the love