రైతులపై బాష్ప వాయువు ప్రయోగం దుర్మార్గం

రైతులపై బాష్ప వాయువు ప్రయోగం దుర్మార్గం– ఏఐఎడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
న్యాయమైన రైతాంగ హక్కుల కోసం పోరాడుతున్న రైతులపై మిలటరీ, బాష్ప వాయువులను ఉపయోగించడం దుర్మార్గపు చర్య అని ఏఐఎడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ అన్నారు. మంగళవారం నాడిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ శంబూ సరిహద్దులో రైతులు న్యాయపరమైన డిమాండ్‌ కోసం పోరాడుతున్నారన్నారు. వారిపై మిలటరీని పెట్టి టియర్‌ గ్యాస్‌ ప్రయోగించడాన్ని యావత్తు దేశం ఖండించాలని, ఈ దుర్మార్గపు చర్యలు వీడి మోడీ ప్రభుత్వం తక్షణమే రైతులతో చర్చలు జరపాలని డిమాండ్‌ చేశారు. రైతులకు బీజేపీ ఇచ్చిన హామీలను తక్షణమే అమలు జరపాలని డిమాండ్‌ చేశారు. ‘ఢిల్లీ చలో’ కార్యక్రమానికి 15 రోజుల ముందే రైతులు మోడీకి లేఖ రాశారని ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి వారికి ఎలాంటి భరోసా రాలేదని అన్నారు. దేశం కోసం కష్టనష్టాలను భరించి పంటలు పండించిన రైతులను దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. రాజకీయాల కోసం భారత రత్నాలు ప్రకటిస్తున్న మోడీ హరిత విప్లవ సృష్టికర్త ఎంఎస్‌ స్వామినాథన్‌ కు భారతరత్న ప్రకటించారు. కానీ వ్యవసాయంలో ఆయన చేసిన ప్రతిపాదనలు మాత్రం ప్రభుత్వం తీసుకోదా? అని విమర్శించారు. రాజ్యాంగం కల్పించిన హక్కును హరిస్తున్న మోడీకి 16న జరిగే బంద్‌ తో గ్రామీణ పేదలు, రైతులు, ఉపాధి హామీ కార్మికుల, పేదలు, కూలీలు పెద్ద సంఖ్యంలో పాల్గొని జయప్రదం చేసి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

Spread the love