డీహెచ్‌ రవీందర్‌ నాయక్‌ పై తప్పుడు ఆరోపణలు ఆపాలి

– బానోత్‌ నెహ్రూ చంద్‌ నాయక్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ రవీందర్‌ నాయక్‌పై తప్పుడు ఆరోపణలు ఆపాలని కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ హెచ్చరించింది. ఈ మేరకు ఆదివారం ఆ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోత్‌ నెహ్రూ చంద్‌ నాయక్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ఆరోపణలు నిరాధారమైనవనీ, బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సీనియర్‌ అయిన రవీందర్‌ నాయక్‌కు డీహెచ్‌ పోస్ట్‌ ఏడేండ్ల క్రితమే రావాల్సి ఉన్నప్పటికీ, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జూనియర్‌ను నియమించిందని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీనియర్‌ అయిన డాక్టర్‌ బానోత్‌ రవీందర్‌ నాయక్‌ను నియమించిందని చెప్పారు.
బీఆర్‌ఎస్‌ హయాంలో డీహెచ్‌గా విధులు నిర్వహించిన డాక్టర్‌ గడల శ్రీనివాసరావు సమయంలో వక్రమార్గంలో సంపదకు అలవాటు పడిన కొంత మంది అధికారుల ఆటలకు ప్రస్తుతం అడ్డుకట్ట పడిందని చెప్పారు. దీంతో అలాంటి వారు నీతి, నిజాయితీతో పని చేస్తున్న రవీందర్‌ నాయక్‌ను అప్రతిష్టపాలు చేసి బదిలీ చేయించే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఆరోపణలను ఇప్పటికైనా ఆపకపోతే ఉద్యోగ సంఘాలు, అసోసియేషన్లతో కలిసి వారి కుట్రలను తేటతెల్లం చెస్తామని హెచ్చరించారు.

Spread the love