టాటా..వీడుకోలు

Tata..Goodbye– గ్రూప్‌ ఫోటోతో పాత పార్లమెంట్‌ భవనానికి బైబై
నూతన పార్లమెంట్‌లో అడుగుపెట్టడానికి కొన్ని గంటల ముందు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులంతా పాత భవనం లోపలి ప్రాంగణంలో సమావేశమయ్యారు. అందరూ కలిసి గ్రూప్‌ ఫోటో దిగారు. ఆ తరువాత లోక్‌సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు వేర్వేరుగా గ్రూఫ్‌ ఫోటోలకు పోజులిచ్చారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మెన్‌ జగదీప్‌ ధన్కర్‌, ప్రధాని మోడీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌, మాజీ ప్రధానులు మన్మోహన్‌ సింగ్‌, హెచ్‌డి దేవెగౌడ మొదటి వరుసలో కూర్చున్నారు. మరో ఫోటోలో ఉపరాష్ట్రపతి, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మధ్యలో ప్రధాని మోడీ కూర్చుకున్నారు. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్‌ ఖర్గే, కేంద్ర మంత్రులు, లోక్‌సభలో ఎనిమిది, అంతకంటే ఎక్కువ మంది, రాజ్యసభలో ఐదు అంతకంటే, అంతకంటే ఎక్కువ మంది సభ్యుల బలం కలిగిన పార్టీల నాయకులు, సీనియర్‌ సభ్యులు, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, లోక్‌సభ, రాజ్యసభ సెక్రెటరీ జనరల్స్‌ ముందు వరుసలో కూర్చున్నారు. అయితే ఈ కార్యక్రమంలో చిన్నపాటి అపశృతి చోటు చేసుకుంది. బీజేపీ రాజ్యసభ ఎంపీ నరహరి అమీన్‌ స్పృహ కోల్పోయారు. 68 ఏండ్ల నరహరి అమీన్‌ ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే మిగతా సభ్యులంతా కలిపి ఆయనను పైకి లేపారు. మంచి నీళ్లు ఇచ్చారు. దీంతో 5 నిమిషాలపాటు ఆందోళనకర వాతావరణం నెలకొంది. అయితే ఆ తర్వాత నరహరి కోలుకున్నారు. దీంతో మళ్లీ తిరిగి ఫోటో సెషన్‌లో పాల్గొన్నారు.
రాజ్యాంగం పట్టుకొని కొత్త భవనంలోకి అధిర్‌ రంజన్‌ చౌదరి
పాత పార్లమెంట్‌లో ఫోటో సెషన్‌ ముగిసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీతో సహా ఎంపీలంతా నూతన పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. ఎంపీలంతా పాత భవనం నుంచి కొత్త భవనకు వరకు పాదయాత్రగా వెళ్లారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హౌంమంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కేంద్ర మంత్రులు పీయూశ్‌ గోయల్‌, నితిన్‌ గడ్కరీ, ఇతర సభ్యులు కొత్త పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. అలాగే లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత అయినా నాయకుడు అధీర్‌ రంజన్‌ చౌదరి, ఎంపీలు రాహుల్‌ గాంధీ, గౌరవ్‌ గొగోరు తదితరులు మధ్యాహ్నం లోక్‌సభ సమావేశాల నిమిత్తం పార్లమెంటు కొత్త భవనంలోకి ప్రవేశించారు. కాంగ్రెస్‌ ఎంపీలు పార్లమెంటు కొత్త భవనంలోకి ప్రవేశించినప్పుడు అధీర్‌ రంజన్‌ చౌదరి భారత రాజ్యాంగాన్ని తన చేతుల్లో పట్టుకుని కనిపించారు. పార్లమెంట్‌ నూతన భవనంలో మంగళవారం లోక్‌సభ మధ్యాహ్నం 1.15 గంటలకు ప్రారంభం కాగా.. రాజ్యసభ మధ్యాహ్నం 2.15 గంటలకు ప్రారంభం అయ్యాయి.
పాత పార్లమెంట్‌ భవనంలో 71 ఏండ్లు గా కీలక నిర్ణయాలు
పార్లమెంట్‌ పాత భవనంలోని సెంట్రల్‌ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ఉభయసభల సభ్యులనుద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడారు. కొత్త పార్లమెంటు భవనంలో కొత్త భవిష్యత్తును ఈరోజు మనం ప్రారంభించనున్నామని,అభివృద్ధి చెందిన భారతదేశాన్ని సాధించాలనే ధృఢ సంకల్పంతో కొత్త భవంతిలోకి అడుగుపెడుతున్నామని అన్నారు. గత 71 సంవత్సరాల్లో పలు ప్రభుత్వాలు అనేక కీలక నిర్ణయాలను ఇక్కడే తీసుకున్నాయని ఆయన గుర్తుచేసుకున్నారు. పార్లమెంటు సభ్యులకు, దేశ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. పార్లమెంటు సెంట్రల్‌ హాలులో 1952 నుంచి 41 మంది ప్రభుత్వాధినేతలు ప్రసంగించారని, 86 సార్లు రాష్ట్రపతుల ప్రసంగాలు జరిగాయని, సుమారు 4,000 చట్టాలు ఇక్కడే చేశారని మోడీ అన్నారు. ట్రిపుల్‌ తలాఖ్‌, ట్రాన్స్‌జెండర్స్‌ చట్టాలు ఈ పార్లమెంటులోనే ఆమోదం పొందాయన్నారు. 370వ అధికరణ రద్దు ఇక్కడే చోటుచేసుకుందని తెలిపారు.
ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందే లక్ష్యంతో భారత్‌ ముందుకు వెళ్తోందన్నారు. భారతదేశ అభివృద్ధి లక్ష్యంగా, ఆ లక్ష్య సాధన దిశగా ధృఢ సంకల్పంతో కొత్త పార్లమెంటు భవనంలోకి వెళ్తున్నామని అన్నారు. ఇండియా నూతన శక్తితో, నూతన సంకల్పంతో కోట్లాది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేం దుకు సిద్ధంగా ఉందన్నారు. దేశ భవిష్యత్తు కోసం సకాలంలో సరైన నిర్ణయాలు మనం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. నాలెడ్జ్‌, ఇన్నొవేషన్‌లపై మన మంతా దష్టిసారించాలని చెప్పారు. చంద్రయాన్‌-3 విజయం తర్వాత యువత శాస్త్ర, సాంకేతిక రంగాల పట్ల మరింత మక్కువతో ఉన్నారని చెప్పారు. ఈ అవకాశాన్ని మనం జారవిడుచుకోరాదని ప్రధాని సూచించారు. సెప్టెంబర్‌ 19 దేశ చరిత్ర పుటల్లో చిరస్మరణీయమైన ఘట్టంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఆమో దానికి నోచుకోని మహిళ రిజర్వేషన్‌ బిల్లుకు సభ్యు లంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలపాలని కోరారు. పార్లమెంట్‌ కార్యకలాపాలకు విఘాతం కలిగేలా ఆటంకాలను ఆయుధాలుగా మలచుకునే వ్యూహానికి ముగింపు పలికేందుకు ఇదే సరైన సమయమని రాజ్యసభ చైర్మెన్‌ జగదీప్‌ ధన్కర్‌ అన్నారు. అటు వంటి చర్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు.
పార్లమెంట్‌ హౌస్‌ ఆఫ్‌ ఇండియా
అత్యాధునిక హంగులతో నిర్మించిన కొత్త భవనం ఇకపై పార్లమెంటుగా సేవలు అందిచ నుంది. ఈ మేరకు కొత్తగా నిర్మించిన భవనాన్ని పార్లమెంట్‌ హౌస్‌ ఆఫ్‌ ఇండియాగా నోటిఫై చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేసింది.

Spread the love