తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

నవతెలంగాణ – హైదరాబాద్
లిక్కర్ ఎలర్జీ కేసు ఏంటి.. అనుకుంటున్నారా..? అవును వింటున్నది నిజమే. ఇలాంటి ఓ తొలి కేసును హైదరాబాద్ వైద్యులు గుర్తించారు. మద్యపానం సేవించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్న క్రమంలో ప్రతి ఒక్కరూ దీని గురించి తెలుసుకోవాల్సిందే. ఆగ్రాకు చెందిన జాన్ (36) అనే వ్యక్తి చికిత్స కోసం నగరంలోని అశ్విని అలెర్జీ సెంటర్ ఆసుపత్రికి రావడంతో ఈ వ్యాధి బయటపడింది. ఈ కేసు వివరాలను డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ వెల్లడించారు. ఇది చాలా అరుదైన వ్యాధిగా పేర్కొన్నారు. ప్రపంచంలో మహా అయితే ఈ తరహా కేసులు వంద వరకు ఉండొచ్చన్నారు.
అసలు విషయం ఏమిటంటే జాన్ కొన్ని నెలల క్రితం ఓ విందుకి హాజరై మద్యం సేవించాడు. తర్వాత ముఖం వేడిగా ఉండడంతో అద్దంలో చూసుకోగా, ఎర్రబడినట్టు కనిపించింది. చర్మంపై దురదలు, ఛాతీ పట్టేసినట్టు అనిపించడంతో ఆసుపత్రిలో చేరి, చికిత్సతో నయం చేసుకున్నాడు. కొంత కాలానికి మరోసారి మద్యం సేవించినప్పుడు కూడా అతడికి తిరిగి అదే అనుభవం ఎదురైంది. మళ్లీ మళ్లీ వస్తుండడంతో ఎవరి సూచనో మేరకు హైదరాబాద్ లోని అశ్విని అలెర్జీ సెంటర్ ను సంప్రదించాడు. అక్కడి వైద్యులు ఆల్కహాల్ అలెర్జీగా నిర్ధారించారు. మద్యపాన సమయంలో మసాలా పల్లీలు, బఠానీలు, మటన్, చికెన్ తినడం వల్ల ఇది వస్తుందని తెలిపారు. మద్యం సేవించిన తర్వాత ఈ తరహా అలెర్జీలు కనిపిస్తే తాగకుండా ఉండడమే మంచిదని సూచిస్తున్నారు.

Spread the love