నిషిద్ధ ప్రవేశం

Forbidden entryగడ్డి తీగలన్నీ నా చుట్టూ నీలంగా అల్లుకున్నాయి
నగర ద్వారాలు ఆక్రమించటానికి కూడా
నా చేతులూ కాళ్లలో సత్తువలేదు
భూమి కడుపు కోసి
రక్తం చేతులకు అంటించుకుని
ద్వారాలకు ఇటువైపు నాతోనున్న ఆ అనామక తల్లి
ఎందుకు అంత తీక్షణంగా నా దిక్కే చూస్తుందో
ఆమె కళ్ళ నిండా నీలి మంటలు
గుండె మీద తెగిన పాలిండ్ల నెత్తురు
ద్వారానికి అటు విందు భోజనాలు
ఇటు మట్టి చేతుల మీద తెల్లటిరక్తం పూలై పూస్తుంటే
ఆమె పాలిండ్ల రక్తం ఎర్రటి పక్షులై ఎగురుతూ వెళుతున్నాయి
చూడండి ఆ తల్లికి ఎన్ని గజాల చీర కట్టారో
ఆమె వెనక పరుచుకున్న దారంతా ఆమె చీర అనంతంగా
కాలి అడుగుల కింద చారికల నదుల్లా
తనరక్తమే ఆ చీరని తడుపుతున్నది
ఆ చీర నిండా పురుడుపోసిన దేహ మలినాల చరిత్ర
ఆమె ఎద మీద గునపాలు దించిన ఆనవాళ్లు
ఆమె
నన్ను తన కన్నీళ్లను తుడవమంది
నేను సత్తువ లేని చేతులతో ఆమె కన్నీటిని చుంబించాను
భూమిలోకి పాతుకుపోతున్న నా పాదాల సాక్షిగా
ఆమె నన్ను అమాంతం తన రక్తసహిత చేతులతో పైకి లేపింది
నగర ద్వారబంధాలనల్లుకున్న నీలపు గడ్డిపోచలు
నా దేహాన్ని ఆకాశానికెత్తాయి
అప్పటి వరకూ స్తంభించిన గాలి విముక్తి గీతం పాడటం మొదలుపెట్టింది
అక్కడే పురుడు పోసుకున్న మరో బిడ్డతో ఆమె
తన ఛాతికి ఆ రక్తమాంసపు ముద్దని హత్తుకుని
ముందుకు సాగింది
నేను
నీలిఎరుపు మంటల ఉధృతితో నగరులోకి ప్రవాహంలా దూకాను
– మెర్సీ మార్గరెట్‌, 9052809952

Spread the love