ప్రజావాగ్గేయకారుల పాఠం గరిమెళ్ల

Garimella”అన్యాయకాలంబు దాపురించిందిపుడు అందరం మేలుకోవాలి/ మాన్యాలు భోగాలు మనుజులందరికబ్బు మార్గాలు వెతకాలిరండి” – అంటూ అప్పటికప్పుడే ఆసువుగా పాటలు కట్టి, పాడి, ఆనాటి ప్రజల్లో నిత్యం పోరాట ధైర్య సాహసాలు నూరిపోస్తూ బ్రిటీషు పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించినవాడు గరిమెళ్ల.
‘ఇలాంటి పాటలను నిషేధించండి’ అని బ్రిటీష్‌ అధికారి ఆజ్ఞాపిస్తే… ‘నిషేధాలు నాకేమీ కొత్తకాదు. మీరెంత ఆపినా అన్యాయకాలం అంతం కాక తప్పదు. అసమాన రాజ్యం అంతం కాక తప్పదు’ అంటూ వెన్వెంటనే గర్జిస్తాడు. ”ఏటి పొడుగునా దున్నిన ఎరువేసి నీరెట్టి నూర్చి పండించేది మనవంతా?/ గోటు చేయుచు బూతు కూతలను కూసి కూలగొట్టి కోసుకొని పోవుటింకొకరివంతా?” అంటూ పాటగానే పాలకుల నైజాన్ని ప్రశ్నిస్తాడు. కష్టజీవుల రైతుల పక్షం వహించడమే కాదు, ‘మనవంతా?’ అంటూ ప్రజలతో మమేకమైపోతాడు. జట్టు కడతాడు. సామూహిక ఉద్యమశక్తిగా ముందుకు ఉరుకుతాడు.
బ్రిటీష్‌ పాలకులు ఆనాడు తెలుగునేలపై లెవీ ధాన్యం కట్టాలంటూ రైతుల ఇళ్లనుండి, కల్లాల నుండి దౌర్జన్యంగా పంటను లాక్కుపోయేవారు. పండించిన గింజలు దక్కక చాలామంది పస్తులతో జీవించేవారు. ఆ దురాగతాలను పాటలతో దునుమాడేవాడు గరిమెళ్ల.
తనకుతానుగా ప్రజలభాషలో పాటలు రాసుకుంటూ, పదాలు అల్లుకుంటూ బాణీలు కట్టుకున్న అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు వంటి వాగ్గేయకారులు భక్తి పారవశ్యంలో మునిగితేలుతూ భక్తులను ఓలలాడించారు.
ఆధునిక కాలంలో ప్రజావాగ్గేయకారునిగా ప్రసిద్ధి పొందిన గరిమెళ్ల సత్యనారాయణ (1893-1952). శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనెపాడు గ్రామంలోని ఓ నిరుపేద కుటుంబంలో జన్మించాడు. గరిమెళ్ల యుక్త వయసులో చదువుకుంటుండగానే గురజాడను ఆరాధించాడు. ”మారువేషము తీసివేస్తివి/ రంగులెల్లను తుడిచిపెడ్తివి/ సహజమయిన సౌందర్యముందని చాటి చెప్తివి లోకమునకు/” అని గురజాడను కీర్తిస్తాడు.
జలియన్‌బాలా బాగ్‌ దురంతంలో జనరల్‌ డయ్యర్‌ కర్కశత్వానికి వందలాదిమంది బలయ్యారు. ఈ మారణకాండకు విలపిస్తూ పాడిన పాట… ”కనులనీరు కారెనుగా కరుణలేకయా/ డయ్యరు సల్పిన వధ వినినా/ చచ్చిన జనము లెక్కలేదుగా/ అబలలు బాలలెందరీల్గిరో అసలే తెలియదుగా…” వింటూ కన్నీరు పెట్టనివారు లేరు.
గాంధీజీ పిలుపుతో చదువుమాని స్వరాజ్యసమరంలో దూకిన గరిమెళ్ల సత్యాగ్రహాలు, విదేశీ వస్త్ర బహిష్కరణోద్యమంలో ఉవ్వెత్తున పాల్గొన్నాడు. ”సీమ గుడ్డ కట్టబోకురా నా చిట్టిబిడ్డా/ రాట్నములను పొయిలోనపెట్టి రమ్యకళను మంటబెట్టి/ చేటు నిట్లుతెచ్చుకుంటిమిరా నా చిట్టిబిడ్డా” అంటూ నిరసించాడు.
వేల్స్‌ యువరాజు భారత పర్యటనకు వచ్చినప్పుడు ”దండాలు దండాలోరు బాబు/ మేముండ లేమండోరు బాబు/ ఈ సైతాను ప్రభుతనింక సాగనీమండోరు” అంటూ జనంలో ఉత్సాహాన్ని నింపుతాడు. ”ఉప్పు పన్ను – పప్పు పన్ను – ఊరికెళితే పన్ను బాబు/ కొప్పు కాస్తా దేవునికి మొక్కుకుంటే పన్ను బాబు…” అని వెటకరిస్తూనే ”నూలుపోగు మీద రాజ్యం ఊగుతున్నాదండీ బాబు/ సీమ నూలు తెంచితేనూ సితికి పోవునండీ బాబు” – అలా బ్రిటీష్‌ పాలన ఆర్థిక రహస్యాన్ని ఎండగడతాడు.
అసలు గరిమెళ్లంటే అందరికీ గుర్తుకొచ్చేపాట ”మా కొద్దీ తెల్లదొరతనమూ దేవా/ మా ప్రాణాలపై పొంచి మానాలు హరియించే” – ఈ పల్లవికి అనుగుణంగా ఎక్కడికక్కడ లెక్కలేనన్ని చరణాలు అల్లుకుని పాడిన పాట ఇది. ప్రజలు కూడా ఈ బాణీల్లోనే తమ భావాలను, బాధలను అల్లుకుని పాడుకున్నారు. రైళ్లల్లో బిచ్చగాళ్లు సైతం పాడుకున్నట్లు ఆనాడు వార్తలొచ్చాయి. అంతటి గొప్ప ప్రజాగీతంగా అవతరించింది. వర్థిల్లింది.
ఈ పాట విన్న గోదావరి జిల్లా కలెక్టరు బ్రేకన్‌ దొర ”భాష తెలియని నాకే నీ పాట వింటుంటే రోమాలు నిక్కబొడుచుకున్నాయి. భాష తెలిస్తే ఇంకేమైనా వుందా?” అంటూ పాటను నిషేధించాడు.
”పసిపిల్లలను పాలు తాగనీయకుండా, ప్రజల్ని పాట పాడనీయకుండా మీరు ఆపగలరా?” అని ఎదురు ప్రశ్నిస్తాడు గరిమెళ్ల. బ్రిటీష్‌ కొలువులో చేరమని ఆఫర్‌ చేస్తే… ”దొరబూట్లు నాకుతూ, కుక్కలా బతకాలా…? బానిసత్వం కన్నా చావే మేలు” అని తిరస్కరించాడు.
రాజ్యాధికారం నేరం కింద మద్రాసు ఎగ్మూరు కోర్టు మేజిస్ట్రేట్‌, గరిమెళ్ల కళ్లముందే అతను రచించిన స్వరాజ్యగీతాలు, పుస్తకాలు ఐదువేల ప్రతులను తెప్పించి తగులబెడ్తాడు. ”కూలి పోతుందోరు! కూలిపోతుంది కూకటివేళ్లతో కూలిపోతుంది ఈ రాక్షస రాజ్యం” అంటూ ఆక్రోసిస్తాడు. బ్రిటీష్‌ రాజ్యాన్ని కూల్చాలనే కుట్రలతో అసంఖ్యాకంగా పాటలు రాశాడని గరిమెళ్లకు రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తారు. పాట వలన జైలుకెళ్లిన తొలి జాతీయకవిగా అలా చరిత్రకెక్కాడు గరిమెళ్ల.
గరిమెళ్లకు తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషలు వచ్చు. జైలులో తమిళం, కన్నడం నేర్చుకున్నాడు. జైలులో ఖైదీల హక్కుల కోసం పోరాడుతూ కూడా పాటలు కట్టాడు. ఆ సమయంలో తండ్రి మరణిస్తాడు. క్షమాపణ పత్రం రాసిస్తే విడుదల చేస్తామని జైలరు అంటే, క్షమాపణ చెప్పి నా తండ్రి అభీష్టానికి అప్రతిష్ట తేలేనని నిరసిస్తాడు. ‘స్వాతంత్య్ర సమరంలో తలలు తెగినా సరే తలలు దించం’ అని నినదిస్తాడు.
గాంధీజీ కోర్కె మేరకు సబర్మతి ఆశ్రమంలో జాతీయ కవి గాయక సమ్మేళనంలో పాల్గొని అంటరానితనంపై పాటలు కడతాడు. ”అంటరానివాడని నన్నంటే ఒప్పుకోను తుంటరి, నీ కిష్టము లేకుంటే అడ్డు తొలగిపొమ్ము” – ఇది కూడా జనమందరి పాటయిందప్పుడు.
స్వాతంత్య్రం వచ్చినవేళ (1947 ఆగస్టు 15) దేశ విభజన అల్లర్లు మిన్నంటాయి. మత కలహాలు మంటల్లో ఎందరో బలైపోయారు. గాంధీతో పాటు గరిమెళ్ల దు:ఖసాగరంలో మునిగిపోయాడు. ”మంటలివిగో ఆర్పరండిరా! నా చంటిబిడ్డరాలా! సకల జాతులారా! మంటలివిగో ఆర్పరండిరా!” అంటూ గుండెలవిసేలా దు:ఖించాడు.
‘స్వాతంత్య్ర సమర యోధుడు, కవి, గాయకుడు గరిమెళ్ల సత్యనారాయణ ఈ రోజు నిరాధారంగా వున్నాడు. పాపం వారికి పూర్తిగా దృష్టిపోయింది. తమ్ముడు, భార్యా మరణించారు. ఇద్దరు పిల్లల్ని పోషించవలసిన బాధ్యత వీరియందుంది’ అని ‘పెంకిపిల్ల’ మాసపత్రికలో వచ్చిన ప్రకటన గరిమెళ్ల కడపటి రోజు దయనీయ స్థితికి అద్దం పడ్తుంది.
స్వాభిమానధనుడు, బహుభాషా పండితుడు, కవిగాయకుడు, సంచార పాత్రికేయుడు అయిన గరిమెళ్ల కడకు బిక్షాటనకు కూడా వెనుకాడలేదు.
‘సత్యనారాయణ గారూ! మన దేశానికి నజ్రుల్‌ ఇస్లాంలాగా మీరూ మన తెలుగువారికి జాతీయకవి. ప్రభుత్వం ఇచ్చిన పదెకరాలు నిరాకరించి మీరిలా అడుక్కోవడం బాగోలేదని కాంగ్రెస్‌ పెద్దలంటే… భ్రష్టుపట్టిన పాలకుల మోచేతి నీళ్లు తాగి దేబిరించేకంటే, ప్రజల దగ్గర అడుక్కోవడమే నాకు గౌరవం అని ఘాటుగా సమాధానం ఇస్తాడు. ‘మొండితనంతో మీరేం సాధిస్తారు?’ అని ప్రశ్నిస్తే… ‘కొందరు త్యాగం చేయాలి. నశించాలి. పెత్తనం చేసేవాళ్ల నాశనం కోసం కొందరు నశించాల్సిందే’ అని కసిగా జవాబిస్తాడు.
‘శాంతియు, క్రాంతియు, ద్రవ్యదురాశా విముక్తియు, సుజన గణ సమారాధన శక్తియు, శిల్పకళా సత్కార్య ప్రశస్తియు ఈ ఉర్వీ తలంబున విహరించువలెనని కోరుట వెర్రితనంబో… నేనొక వెర్రినగుదనే గాక ఆక్షేపించే జ్ఞానుల జ్ఞానం నాకెపుడు వద్దు’ అని నిర్ద్వందంగా తన గురించి ప్రకటించుకున్నాడు.
ఆంధ్రుల ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమగీతాలు రచిస్తూ శిక్షణనిస్తూ 1952, డిసెంబర్‌ 18న మరణించాడు. గరిమెళ్ల నిలిస్తే పాట, చలిస్తే పాట. ఆ విధంగా పాటలతో కడవరకు జనాన్ని ఉద్యమశక్తిగా కదలిస్తూనే కన్ను మూశాడు.
‘సత్యవాగ్గేయకారుడా/ నీ గంభీర గళోద్గీతికలు స్వాతంత్య్ర భావ వాహికలు. నీ జీవితమొక విషాదగాయం. తెలుగు జాతికది ఉషోదయగీతం’ అని జనం వేనోళ్ల ప్రస్తుతించారు.
(నేడు గరిమెళ్ల వర్థంతి)
– కె.శాంతారావు, 9959745723

Spread the love