పార్ట్ టైం జాబ్ పేరుతో మోసం..

నవతెలంగాణ -హైదరాబాద్: కూకట్ పల్లి లో పని చేస్తున్న ఓ డాక్టర్ కొండాపూర్ లో నివసిస్తున్నాడు. అతనికి పార్ట్ టైం జాబ్ ఆఫర్ పేరుతో టెలిగ్రామ్ లో గుర్తు తెలియని వ్యక్తులు మెసేజ్ లు పంపారు.  పార్ట్ టైం జాబ్ పై ఆసక్తితో సైబర్ నేరగాళ్లను అతను సంప్రదించాడు. అక్టోబర్ 4న వాళ్లు వివిధ ప్రొడక్ట్స్ ని చూపి పంపిన వెబ్ పేజీ లింక్ లో రేటింగ్ చేయాలని డాక్టర్ కి సూచించారు. బాధితుడు వాళ్లు చెప్పిన ప్రతి ప్రొడక్ట్ కి రేటింగ్ ఇస్తూ వెళ్లాడు. రేటింగ్ కి సంబంధించిన స్క్రీన్ షాట్ లను షేర్ చేయాలని చెప్పారు. అనంతరం ఒక వెబ్ పేజీ యాక్సెస్ ఇచ్చారు. ఎక్కువ మొత్తంలో డబ్బులు రావడానికి ప్రారంభ చెల్లింపుగా 10,900 డిపాజిట్ చేయాలని అడిగారు. డాక్టర్ మొత్తం అమౌంట్ డిపాజిట్ చేశాడు. అక్టోబర్ 5న రూ.15 వేలు, తరువాత రూ.20 వేలు, రూ.52వేల 427 నగదు పంపాలని సూచించారు. వాటన్నింటినీ నిజమైనవిగా భావించి అక్టోబర్ 6 నుంచి నవంబర్ 7 వరకు రూ.19.7 లక్షలు పంపించాడు. అందుకు తగినట్లు బాధితుడికి పంపిన వెబ్ పేజీలో రూ.27 లక్షల విత్ డ్రా చేసుకోవచ్చని చూపించింది. అమౌంట్ డిపాజిట్ చేయాలని ప్రయత్నించగా సెక్యూరిటీ అవసరాలంటూ, పెనాల్టీ పేరిట వివిధ నిబంధనలతో మరికొన్ని డబ్బులు కట్టాలని మెసేజ్ వచ్చింది. చివరికి తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Spread the love