ఉచితం

katha‘ప్రయాణికులకు విజ్ఞప్తి, హనుమకొండ మీదుగా హైదరాబాద్‌ వెళ్ళుటకు ఎక్ర్‌ప్రెస్‌ సర్వీస్‌ ఐదవ నెంబర్‌ ప్లాట్‌ఫారం మీద సిద్ధంగా ఉన్నది’ అని అనౌన్స్‌మెంటోతో బస్టాండ్‌ ఆవరణలో కిటకిటలాడుతున్న జనాన్ని దాటుకొని బస్సు ఎక్కి కూర్చుంది ఐదు పదుల వయస్సు దాటిన జానకమ్మ.
వెనకాలే వచ్చి పక్క సీట్లో కూర్చున్నాడు జానకమ్మ కంటే ఒకటి రెండు సంవత్సరాలు అటు ఇటుగా ఉన్న శీనయ్య.
జానకమ్మ మామూలు కాటన్‌ చీర, కాళ్లకు సగం అరిగిపోయిన ప్లాస్టిక్‌ చెప్పులు, చేతిలో ఒక కవర్‌ పట్టుకొని సాదాసీదాగా కూర్చుంది. శీనయ్య రెండు చేతులకు నాలుగేసి వేళ్ళకు బంగారు ఉంగరాలు, చేతులకు బేడిలు వేసినట్లుగా ఒక చేతికి బంగారు రంగు ఖరీదైన గడియారం, మరో చేతికి మందపాటి బ్రాస్లెట్‌, మెడలో ఇనుప గొలుసు లాంటి అందమైన బంగారు చైను, ఇస్త్రీ మడత నలగని కద్దర్‌ బట్టలు, చేతిలో ఖరీదైన బ్యాగు పట్టుకొని పక్కనే కూర్చున్న జానకమ్మను చూసి, ”జానకమ్మా హన్మకొండకు వెళ్తున్నావా” అన్నాడు పలకరింపుగా.
”అవును శీనయ్య.. నువ్వెక్కడికి పోతున్నావు” అంది చిరునవ్వుతో జానకమ్మ.
”నా కొడుకు దగ్గరికి వెళ్తున్నాను” అన్నాడు శీనయ్య.
”నీ కొడుకు ఏదో నౌకరి చేస్తుండట కదయ్యా…” అంది జానకమ్మ.
”ఏదో నౌకరి కాదు జానకమ్మ. మంచి నౌకరే. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. మొన్న మన ఊరి చిన్నయ్య ఏదో అవసరం పడి పది ఎకరాల భూమి అమ్మిండు కదా….! ఆ భూమికి బయానగా కొన్ని పైసలు కట్టాను. ఇంకా కొన్ని పైసలు తక్కువ పడ్డాయి. రిజిస్ట్రేషన్‌ నాటికి అవి వాళ్లకు కట్టాలి కదా! అందుకే నా కొడుకు దగ్గర తేవడానికి వెళుతున్నాను” అన్నాడు శీనయ్య హుందాగ.
”అవును పాపం అత్యవసరమని అడ్డికి పావు సేరు అమ్ముకున్నడు” అంది జానకమ్మ జాలిగ.
”ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు చెప్పు. వాని కర్మ నాకు ప్రాప్తం అయింది” అన్నాడు గర్వంగా శీనయ్య.
”అంతేలేయ్యా…!” అంది జానకమ్మ అమాయకంగ.
బస్సు ఎక్కేవాళ్ళు ఇంకా ఎక్కుతూనే ఉన్నారు. సీట్లు నిండిపోయాయి కొందరు నిలబడి ఉన్నారు. డ్రైవర్‌ ఎక్కి బస్సు స్టార్ట్‌ చేశాడు. వెనుక నుండి కండక్టర్‌ టికెట్లు కొట్టుకుంటూ వస్తున్నాడు.
”అవును జానకమ్మ…. ఈ మధ్య నువ్వు పింఛను తీసుకోవడానికి రావడం లేదు ఎందుకు అన్నాడు” శీనయ్య.
”ఇంకెక్కడ పింఛన్‌ శీనయ్య… నా కొడుకుకు గవర్నమెంట్‌ కొలువని నా పింఛను తీసి పడేసిండ్రు” అంది జానకమ్మ నిట్టూర్పుగ.
వెనుక సీట్లో కూర్చొని వీరి సంభాషణ వింటున్న ఒక మహిళ ముసిముసిగా నవ్వుకుంటుంది.
”అవును జానకమ్మా… రేషన్‌ షాపు మీ ఇంటి ముందే కదా తీస్తున్నాడా రోజూ” అన్నాడు శీనయ్య.
”ఏమో శీనయ్యా… రోజు పొద్దున్నే ఇస్తున్నట్టున్నాడు. నేను సరిగ్గా గమనించలేదయ్యా” అంది వినయంగ జానకమ్మ.
”అదేలే నీ పనులు నీకు ఉంటాయి కదా… అయినా నిన్న డీలరు నాకు ఫోన్‌ చేసి మధ్యాహ్నం వరకే బియ్యం తీసుకొని పొమ్మని నిన్ననే చెప్పాడు. కానీ నిన్న మా కారు డ్రైవర్‌ రాలేదు. అందుకే బియ్యానికి పోలేదు. ఇవాళ మా డ్రైవర్‌ ను తెమ్మందామంటే నేను స్వయంగా పోయి వేలిముద్ర వేస్తేనే కదా రేషన్‌ ఇచ్చేది. రేపొద్దున రాగానే తీసుకొచ్చుకోవాలి” అని శీనయ్య అంటుండగానే
”టికెట్‌ టికెట్‌” అనుకుంటూ జానకమ్మ దగ్గరికి రాగానే కవర్లో నుండి ఆధార్‌ కార్డు తీసి చూపించి హన్మకొండకు ఒక టికెట్‌” అంది.
ఆధార్‌ కార్డు చెక్‌ చేసిన కండక్టర్‌ టికెట్‌ కొట్టి జానకమ్మ చేతిలో పెట్టి, ”మీరు ఎక్కడికి చెప్పండి” అంటూ శీనియ్యను అడిగాడు కండక్టర్‌.
‘హైదరాబాద్‌’ అని చెప్పి జేబులోని డబ్బులు తీసి కండక్టర్‌ ఇస్తూ ”ఈ జానకమ్మ కొడుకు గవర్నమెంట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. ఇదిగో ఈ మేడమ్స్‌ గవర్నమెంట్‌ ఉద్యోగం చేస్తున్నారు. వీళ్ళకి ఎందుకు ఉచిత బస్సు ప్రయాణం, మాలాంటి తెల్ల రేషన్‌ కార్డు ఉన్న వాళ్లకు మాత్రమే ఇవ్వాలి ఉచితం” అన్నాడు వెనక సీట్లో కూర్చున్న మహిళా ఉద్యోగుల వైపు అక్కసుగా చూస్తూ.
”అవునవును ఉద్యోగ మహిళలకు ఎందుకు ఉచితం” అంటూ ముగ్గురు నలుగురు పురుష ప్రయాణికులు శీనయ్యతో గొంతు తెలిపారు.
”ఏం మాట్లాడుతున్నారు మీరందరూ, మీకెందుకండీ అంత నిష్టూరాలు” అంది అనునయంగా వెనక సీట్‌లోని మహిళా ఉద్యోగి అయినా శ్రీలత.
”గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుపుకున్నట్టు నీకెందుకు అమ్మ అంత రోషం, అంత రోషం ఉన్నదానివైతే డబ్బులు పెట్టి టికెట్‌ కొనుక్కొని ప్రయాణం చేయి మరి” అన్నాడు శీనయ్య వెకిలిగా నవ్వుతూ.
”నాకెందుకంటారు ఎందుకండీ… ప్రభుత్వ ఉద్యోగులందరూ ఉన్నవాళ్లు అయిపోతారా….! ఊళ్లో పది ఎకరాల భూమి ఉన్నవాడు పేదోడు అయితే 10 గుంటల భూమిలేని ఉద్యోగి ఉన్నవాడు ఎలా అవుతాడు? 10 లక్షల ఖరీదైన కారులో వచ్చి ఉచిత బియ్యం తీసుకొని పోయే నీలాంటి వాడు పేదోడు అయితే ఆర్టీసీ బస్సులో నానా తంటాలు పడుతూ నిలబడి ప్రయాణాలు చేస్తున్న నాలాంటి ఉద్యోగులు ఉన్నవాళ్లు అయిపోతారా?! లక్షల్లో జీతాలు తీసుకునే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ తెల్ల రేషన్‌ కార్డ్‌ కలిగిన నీ కొడుకు లాంటివాడు పేదోడు అయితే, వేలల్లో జీతాలు తీసుకునే ఈ జానకమ్మ గారి కొడుకు లాంటి ప్రభుత్వ ఉద్యోగి ఉన్నవాడు ఎలా అవుతాడు?! మూడంతస్తుల భవంతిలో ముచ్చటగా నివాసం ఉంటూ, తెల్ల రేషన్‌ కార్డు ద్వారా అన్ని ఉచితాలు పొందేవాడు పేదవాడు అయితే, కిరాయి ఇంట్లో ఉంటూ చాలీచాలని జీతంతో జీవితాలు వెల్లదీసే నాలాంటి వాళ్ళు ఉన్నోళ్లు ఎలా అవుతారు?! ఇన్‌కమ్‌ టాక్స్‌లు కట్టే వ్యాపారవేత్తల తల్లిదండ్రులు తెల్ల రేషన్‌ కార్డు కలిగిన పేదోళ్లు అయితే, 15 సంవత్సరాల ఉద్యోగ సర్వీసులో ఇంతవరకు ఇన్‌కమ్‌ టాక్స్‌ కట్టే స్థాయిలో జీతం పొందని ఓ చిన్న ప్రభుత్వ ఉద్యోగి తల్లిదండ్రులు ఉన్నవాళ్లు ఎలా అవుతారు?! ఇది మీరంతా తెలుసుకోవాలి ముందు. ఉద్యోగులందరూ ఉన్నోళ్లు కాదు….!” అంటూ కొంగుతో కళ్ళు ఒత్తుకుంది శ్రీలత.
”అవునండి ఐరన్‌ బట్టలు వేసుకున్నంత మాత్రాన ఉద్యోగులందరూ డబ్బున్న వాళ్ళు కారు. నూటికి యాబై శాతం ఉద్యోగులు జీతాల మీద లోన్లు తీసుకొని సొంత ఇల్లు కట్టుకొని పిల్లల చదువులు పూర్తి చేసే వరకే వారి జీవితం అయిపోతుంది. అదే గొప్ప విషయం అని సరిపెట్టుకుంటున్నారు” అన్నాడు పక్కనే నిలబడి జరిగిన సంభాషణ అంతా ఆసక్తిగా విన్న ఒక ప్రభుత్వ ఉద్యోగి.
”అవునండి నేటి ఉద్యోగులకు మీరందరూ ఊహించినట్లు ఉచిత వైద్యం లేదు, ఉచిత విద్య, ఫీజు రియంబర్స్‌మెంట్‌ లేదు. రిటైర్మెంట్‌ అయ్యాక పెన్షన్‌ కూడా లేదు! మీరంతా ఈర్ష పడుతున్నట్లు… మీ చుట్టూ ఉన్న ఉద్యోగులకు వారసత్వంగా వచ్చిన ఉద్యోగాలు కావు. అవి వాళ్ళ తల్లిదండ్రులు పస్తులు ఉంటూ కూలి నాలి చేసి బడికి పంపితే చిన్నప్పటినుండి ఆటపాటలు మరిచి, పండగలు ఫంక్షన్లు వదిలేసి, కడుపునిండా తిండి, కంటి నిండా నిద్ర విడిచి, పుస్తకాల పురుగులా పాతిక సంవత్సరాల పాటు కష్టపడితే వచ్చిన ఉద్యోగం అది. ఆ ఉద్యోగం రాగానే వచ్చే జీతంతో ప్రతి పైసా ఖర్చుకు పదిసార్లు ఆలోచిస్తూ పద్ధతిగా పొదుపుగా వాడుకుంటూ ఖర్చు చేస్తూ ప్రణాళికాబద్ధంగా బతుకుతున్నాం. అంతేతప్ప మేమంతా డబ్బున్నోళ్ళం కాదు మీరు అనుకున్నట్లు ఉద్యోగులంతా లక్ష్యాధికారులు కోటీశ్వరులు కాదు…” అన్నాడు ఆవేశంతో కూడిన ఆవేదనతో పక్క సీట్లో కూర్చున్న ఒక యువకుడు.
”మంచిగా చెప్పినవ్‌ కొడకా…. నీ కడుపు చల్లగుండ…. నా కొడుక్కి సర్కారు నౌకర్‌ అని ఏది ఇస్తలేరు నాకు పింఛన్‌ కూడా తీసిపడేసిన్రు. ఇటు నన్ను చూసుకోలేక, పిల్లలను చదివించుకోలేక, ఇల్లు సంసారం ఎల్ల తీయలేక నా కొడుకు అష్టకష్టాలు పడుతూ అప్పులపాలైపోయిండు” అంది తన్నుకొస్తున్న దు:ఖాన్ని పంటి బిగువున అదిమిపడుతూ అంది జానకమ్మ.
”నన్ను క్షమించు జానకమ్మ, మీరు కూడా నన్ను క్షమించాలి మేడం” అంటూ శ్రీలత వైపు తిరిగి ”నేనే కాదు మేడం చాలామంది నాలాగే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఒక డిఏ పెరగగానే ఉద్యోగులకు డబుల్‌ ధమాకా అని, కొత్త సంవత్సరం కానుక అనే వార్తను తాటికాయ అంత అక్షరాలతో రాస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు పెరిగిన జీతాలు అంటూ డబ్బుల కట్టలు పత్రికల్లో, టీవీ వార్తల్లో చూపిస్తున్నారు. అవి చూస్తున్న వారికి ఏం తెలుస్తుంది మీ కష్టం. నిజమే కావచ్చు ఎన్ని వేలల్లో జీతాలు పెరిగాయోనని భ్రమపడి మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నాం….!” అంటూ పాశ్చాత్తాపడ్డాడు శీనయ్య.
”ఇప్పటికైనా మీలాంటి వాళ్లు అర్థం చేసుకున్నారు అంతే చాలు….” అంటూ నమస్కరించింది శ్రీలత. వినయంగా ప్రతి నమస్కారం చేసాడు శీనయ్య.
వీరి సంభాషణనంత ఆ సాంతం ఆసక్తిగా వింటున్న వారంతా చప్పట్లు కొడుతుండగా ప్రయాణికులను చేర్చడానికి బస్సు పరుగులు తీస్తుంది.
– డా|| తాళ్ళపల్లి యాకమ్మ, 9704226681 

Spread the love