స్నేహం అంతులేనిది..

Friendship is endless..స్నేహం ఓ మధురమైన అనుభూతి. దీనికి వయసుతో నిమిత్తం లేదు. ఆటపాటలాడే బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు అందరిలో స్నేహ భావం ఉంటుంది. అటువంటి స్నేహానుభూతి అనుభవిస్తేనే తెలుస్తుంది. సృష్టిలో నా అనేవారు, బంధువులు లేని వారు ఉంటారేమేగాని స్నేహితులు లేని వారుండరు. ఇంట్లో చెప్పలేని సమస్యలు, బాధలు సైతం వీరితో ఎటువంటి దాపరికం లేకుండా చెప్పుకొని ఓదార్పు పొందుతాం. అందుకే స్నేహానికి, స్నేహితునికి అంత ప్రాధాన్యం. అదే నిజమైన స్నేహం… స్వచ్ఛమైన స్నేహం. ఈరోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా కొందరి స్నేహానుభావాలను తెలుసుకుందాం…
అన్నీ తానే అయ్యింది
మా నాన్న పెరు వి.కె రావు. సిబాక కంపెనీలో రెప్రసెంటిటివ్‌గా పని చేసేవారు. అమ్మ పేరు ఉమ. నాకొక అక్క ఉంది. నేను పుట్టింది చెన్నైలో. అయితే నటిని కావడంతో అనేక ప్రాంతాలకు వెళుతుండేదాన్ని. అందుకే స్నేహితులంటూ ప్రత్యేకంగా ఎవరూ లేరు. అదేమి విచిత్రమో కానీ హైద్రాబాద్‌ వచ్చాక నేను ఉంటున్న ఫ్లాట్‌కి ఎదురుగా ఒకరు పరిచయం అయ్యారు. ఆవిడ పేరు ధరణి. నన్ను చూసి చాలా ఆశ్చర్య పోయింది. సంతోషంతో తనకు నోటా మాట రాలేదు. చాలా కలుపు గోలు మనిషి. నాకు హైద్రాబాద్‌లో ఎవరూ తెలియదు, బైటకు వెళ్లాలన్నా ఎలా వెళ్లాలో తెలియదు. తాను పరిచయం అయినప్పటి నుండి చాలా సహాయంగా ఉండేది. వాళ్ళ ఇంట్లో ఏ వంట చేసినా నాకు తెచ్చి పెట్టేది. పండగలకు తప్పకుండా నన్ను పిలిచేది. వారి ఇంటికి ఎవరు వచ్చినా నన్ను పరిచయం చేస్తూ ఉండేది.
ఇంట్లో ఒక్కదాన్నే ఉండాలంటే నాకు భయం. మా వారు ఊళ్ళో లేనప్పుడు నేను ఎక్కువగా తన దగ్గరే, మా డాగీతో సహా ఉండేదాన్ని. నాకు ఆరోగ్య సమస్యలు వస్తే తనే దగ్గరుండి చూసుకునేది. నాకు ఏమీ తోచనప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే, నా కోసం ఏదైనా చేసి పెట్టేది. హైద్రాబాద్‌లో ఎవరూ లేరని అనుకుంటున్న నాకు బంధువు కంటే ఎక్కువగా చేరదీసి, అనుక్షణం నాకు ఏ సహాయం కావాలనా చేసి పెట్టె స్నేహితురాలు దొరికింది. అందుకే అంటారు ఎప్పుడు ఎక్కడ ఎవరితో అనుబంధం ఎర్పడుతుందో తెలియదు అని.
– పూర్ణిమ, సినీ నటి
వయసుతో పని లేదు
నాన్న పేరు సాంబశివరావు, రామారావుగారి దగ్గర స్టంట్‌ మాస్టర్‌. అమ్మ సీతారావమ్మా, గృహిణి. నాకు ఇద్దరు అక్కలు, ఒక తమ్ముడు. నేను చిన్నప్పటి నుంచే నటించడం ప్రారంభించాను. ఎందరో సినీ కళాకారులు మా ఇంటి చుట్టు పక్కల ఉండేవారు. మా ఇంటికి ఒక ఇల్లు విడిచి ఝాన్సీ ఉండేవారు. తరచూ మా ఇంటికి వచ్చేవారు. అమ్మను వదిన అని, నాన్నను అన్నయ్య పిలిచేవారు. నేను వయసులో అమెకంటే చాలా చిన్న దాన్ని. అయినా మా ఇద్దరి మధ్య ఒక ఆత్మీయతతో కూడిన అనుబంధం ఉండేది. నాకు ఆపిల్స్‌ అంటే చాలా ఇష్టం. మా ఇంటికొచ్చినప్పుడల్లా ఆపిల్స్‌ తెచ్చి నాకిస్తూ నీ బుగ్గల్లాగా ఉన్నాయి అనేవారు. అప్పుడు నాకు బుగ్గలు బాగా ఉండేవి. అలాగే ఆవిడ షూటింగ్స్‌కి వెళ్లేటపుడు నన్ను చూసి కానీ వెళ్లేవారు కాదు. నేను ఆవిడ కలిసి ఎన్నో సినిమాల్లో నటించాం. షూటింగ్‌ సమయాల్లో నన్ను దగ్గర కూర్చోపెట్టుకుని అన్నం తినిపించేవారు. ఆవిడతో నా అనుబంధం దాదాపు 50 ఏండ్లది. నా పెండ్లి తర్వాత మా మధ్య కొన్నాళ్ళు కాంటాక్ట్స్‌ లేవు. నేను హైద్రాబాద్‌ వచ్చాక నా గురించి తెలుసుకుని నెంబర్‌ సంపాదించి ఫోన్‌ చేసారు. ఎంతో సంతోషించాను. ‘మా ఇంటికి ఒకసారి వస్తావా’ అని అడిగారు. ‘తప్పకుండా వస్తాను’ అని వెళ్లాను. అప్పటి నుండి తరచూ వెళ్లి వస్తుంటాను. నేను వెళ్తే ఆవిడకు ఎన్నో జ్ఞాపకాలు. గంటలు గంటలు మాట్లాడుకుంటూ ఉంటాము. భోజనం పెట్టకుండా పంపరు. చిన్నప్పటి నుండి ఆమెను నేను అత్తా అని పిలిచినా నాకెప్పుడూ ఆమె స్నేహితురాలే. ఎప్పుడు మొదలైనా, ఎలా మొదలైనా, మొదలైన పరిచయం మనసును తాకితే అదే స్నేహం.
– బేబీ రాణి, సీనియర్‌ నటి
స్వార్థం లేనిదే స్నేహం
నాన్న గారి పేరు వరప్రసాద్‌ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేసి పదవి విరమణ పొందారు. అమ్మ ప్రభావతి గృహిణి. వారికి మేము ముగ్గురం ఆడ పిల్లలం. నాకు ఇద్దరు అక్కలు. నేను పుట్టింది పెరిగింది, చదివింది హైద్రాబాద్‌లోనే. పదవ తరగతి వరకు రాజేంద్రనగర్‌లోని భారతీయ విద్యాభావన్‌లో చదువుకున్నాను. నా బెస్ట్‌ ఫ్రెండ్‌ నాజియా. 10వ తరగతి వరకు ఇద్దరం కలిసి చదువుకున్నాం. వేసవి సెలవులు రాగానే పొద్దున్నే ఇద్దరం లంచ్‌ బాక్సులు పట్టుకుని సైకిళ్ళు వేసుకుని రాజేంద్రనగర్‌ చుట్టుపక్కల తిరేగేవాళ్ళం. మధ్యాహ్నం ఎక్కడో ఒక చెరువు గట్టున, చెట్లకిందనో కూర్చుని తెచ్చుకున్న లంచ్‌ బాక్స్‌లోని భోజనాన్ని ఇద్దరం పంచుకుని తినేవ్ళాం. సాయంత్రం వరకు తిరిగి ఇంటికి చేరుకునే వాళ్ళం. ఇంటర్‌ వేరు వేరు కాలేజీ ల్లో చేరినప్పటికీ తరచూ కలుస్తూ ఉండే వాళ్ళం. నేను ఎంబీఏ చేసాను. తను సైకాలజీ చదివింది. సాఫ్ట్‌ వేర్‌ కోర్సులు కూడా చేసింది. ప్రస్తుతం బెంగళూర్‌లో టీచర్‌గా ఉద్యోగం చేస్తోంది.
ఇద్దరం భోజన ప్రియులం. ఇంట్లో అబద్దం చెప్పి బైట తినడానికి వెళ్లిపోయేవాళ్ళం. ఏ రోజూ మేము ఒక్క మాట అనుకుని ఎరుగము. తాను చాలా మృదుస్వభావి, సున్నిత మనస్కురాలు. తనకు సినిమాలంటే చాలా ఇష్టం. ఏ సినిమా వదిలేది కాదు. నేను సినిమాలు అసలు చూడను. నాకు సినిమాలు ఇష్టముండవని సినిమాకి రమ్మని నన్ను ఎప్పుడూ అడిగేది కాదు. స్నేహం అంటే రోజు పలకరించుకోవడాలు, కబుర్లు చెప్పుకోవడాలు కాదు. వాళ్లకు ఏదైనా సమస్య వచ్చినా, కష్టం ఉన్నా అండగా నిలబడటం. అలాగే రోజూ మాట్లాడితినే స్నేహం లేకుంటే లేదు అని కూడా అనుకోకూడదు. వృత్తి రీత్యా తీరుబడి లేక పోయినా తప్పనిసరిగా సమయం తీసుకుని 15 రోజుల కొకసారి మాట్లాడుకుంటాం. తాను ఎప్పుడైనా డిస్టర్బ్‌గా ఉంటే ‘పూరి నువ్వు బాగా గుర్తుకు వచ్చావు, నీతో మాట్లాడాలి’ అంటూ ఫోను చేస్తుంది. అది మా స్నేహంలోని స్వచ్ఛత. ఒక్కోసారి ఉండలేక నేనే సడన్‌గా తనకు ఫోన్‌ చేస్తుంటా. నేను ఫోన్‌ చేసినప్పుడు అనిపిస్తుంది తనకు నా అవసరం ఉంది, అందుకే బాగా గుర్తుకు వచ్చింది అని. అపుడు తాను ఎన్నో విషయాలు నాతో పంచుకుని స్వాంతన పొందుతుంది.
– పూర్ణిమ, న్యూస్‌ రీడర్‌
స్నేహం పదిలంగా…
ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితులు తప్పనిసరిగా ఉంటారు. ఇలాంటి స్నేహ బంధాన్ని చాటడానికి ఆగస్టు మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవంగా జరుపుకుంటారు. నిజమైన స్నేహం అనేది ఇద్దరు వ్యక్తులు నిర్మించడానికి సిద్ధంగా ఉన్న నిస్వార్థ సంబంధం. ఇది చిత్తశుద్ధి, ఆసక్తులు, సానుభూతిపై ఆధారపడి ఉంటుంది. ఏర్పడిన స్నేహాన్ని పదికాలాల పాటు పదిల పరుచుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. బంధాలన్నింటిలో స్నేహానికి మించింది లేదంటారు. అందుకే ‘స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వితం’ అంటాడు సినీ గీత రచయిత. మరి అలాంటి స్నేహ బంధం ఎప్పటికీ విచ్ఛిన్నం కాకుండా ఎల్లకాలం కొనసాగాలంటే ఏం చేయాలో చూద్దాం…
స్నేహం నమ్మకంతో నిర్మించబడింది. కాబట్టి స్నేహం మొదటి నియమం అబ ద్ధాల నుండి దూరంగా ఉండడం. స్నేహితులకు ఎప్పుడూ అబద్ధం చెప్పకూడదు. ఎవరి తోనైనా స్నేహం చేస్తున్నప్పుడు మీ ఇద్దరి మధ్య అబద్ధాలకు అసలు చోటే ఉండకూ డదు. ఏ సంబంధాన్ని అయినా అబద్ధాలు వచ్ఛిన్నం చేస్తాయనేది గుర్తు పెట్టుకోవాలి.
డబ్బును స్నేహానికి దూరంగా ఉంచండి
స్నేహ సంబంధం నిస్వార్థంగా ఉండాలి. స్నేహితుల నుండి ఎప్పుడూ ప్రయోజనం పొందాలని ఆశించకూడదు. మీకు ఆర్థిక సహాయం అవసరం కావచ్చు, కానీ స్నేహంలోకి డబ్బు తీసుకురావద్దు. ఎందుకంటే మీరు మీ ఆర్థిక అవసరాల కోసం స్నేహితులపై ఆధారపడితే అది మీ స్నేహానికి మంచిది కాదు.
విషయాలను దాచిపెట్టొద్దు
చాలా మంది దొస్తులు తమ హృదయంలో ఉన్న ప్రతి విషయాన్ని స్నేహితులతో పంచుకుంటారు. కానీ మీరు మీ స్నేహితుల నుండి విషయాలను దాచడం ప్రారంభించినప్పుడు మీ స్నేహం దూరం అవుతుందని గుర్తించండి. మీ స్నేహితులు మీ గురించి మరొకరి నుండి తెలుసుకుంటే అది మీ స్నేహ బంధానికి అసలు మంచిది కాదు.
సహాయానికి వెనుకడుగు వేయకండి
కష్టసుఖాలలో స్నేహుతులకి మద్దతు ఇవ్వడం నిజమైన స్నేహానికి నిదర్శనం. స్నేహితులకి మీ అవసరం ఉన్నప్పుడు, సహాయం చేయడంలో వెనక్కి తగ్గకండి. మీకు సాధ్యమైనంత వరకు వారికి సాయం చేస్తాననే వాగ్దానం ఇవ్వాలి. ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి. స్నేహితులకు సహాయం చేసే శక్తి మీ దగ్గర లేకపోవచ్చు. కానీ మీ స్నేహితునికి ఆ సమయంలో మానసికంగా బలహీనంగా, ఒంటరిగా అనిపించేలా చేయవద్దు. ఇలాంటి సంఘటనలు మీ స్నేహాన్ని మరింత బలహీనపరుస్తాయి.
– పాలపర్తి సంధ్యారాణి

Spread the love