నిధులొచ్చేనా..?

Will the funds come?– నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి ప్రధానితో భేటీపై గంపెడాశలు
– కేంద్రం నుంచి రాష్ట్రానికి భారీగా రావాల్సిన బకాయిలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పదేండ్ల నుంచి రాష్ట్రానికి మొండి చేయి చూపిస్తున్న మోడీ సర్కార్‌… తెలంగాణకు రావాల్సిన గ్రాంట్లు, ఆర్థిక సాయాలకు గండికొట్టింది. వాటిని పోరాడి సాధించాల్సిన గత బీఆర్‌ఎస్‌ సర్కార్‌ పేపర్‌ ప్రకటనలకే పరిమితమైంది. ఇప్పుడు కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్‌ సర్కార్‌… రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలు, పెండింగ్‌ బిల్లులను సాధిస్తుందనే ఆశతో ప్రజలు ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి… ప్రధాని మోడీతో మంగళవారం ఢిల్లీలో భేటీ కానున్న నేపథ్యంలో ఈ ఆశలు రెట్టింపయ్యాయి. ముఖ్యంగా పద్నాలుగు, పదిహేనో ఆర్థిక సంఘాల సిఫారసుల మేరకు కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు, వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే ఆర్థిక సాయాలు, మిషన్‌ భగీరథ నిర్వహణ కోసం పదిహేనో ఆర్థిక సంఘం సిఫారసులు, చెరువుల పునరుద్ధరణ కోసం నిటి అయోగ్‌ చేసిన సూచనలు, స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధులు తదితరాంశాలను కేంద్రం పెడచెవిన పెట్టింది. ఇప్పుడు వీటిని సాధించాల్సిన బాధ్యత కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఉంది.
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు…
-పద్నాలుగో ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం స్థానిక సంస్థలకు రూ.817.61 కోట్లు (ఇందులో గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.315.32 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ.502.29 కోట్లు)
-రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌ 94(2) ప్రకారం వెనుకబడిన జిల్లాలకు 2019 నుంచి 2023 వరకు ఏటా రూ.450 కోట్ల చొప్పున రావాలి
పదిహేనో ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం 2020-21లో రూ.171 కోట్లు
2019-20తో పోల్చితే 2020-21లో తెలంగాణకు రావాల్సిన పన్నుల వాటాలో రూ.723 కోట్లు తగ్గాయి. దీన్ని కేంద్రమే భర్తీ చేయాలంటూ పదిహేనో ఆర్థిక సంఘం సూచించింది.
రాష్ట్రంలోని వివిధ రంగాలకు పదిహేనో ఆర్థిక సంఘం కేటాయించిన మొత్తం రూ.3,204 కోట్లు
మిషన్‌ భగీరథ నిర్వహణ కోసం రూ.2,350 కోట్లు ఇవ్వాలంటూ పదిహేనో ఆర్థిక సంఘం సూచించింది
మిషన్‌ భగీరథ కోసం రూ.19,205 కోట్లు ఇవ్వాలంటూ నిటి అయోగ్‌ సిఫారసు
నిటి అయోగ్‌ సిఫారసుల ప్రకారమే చెరువుల పునరుద్ధరణకు కేంద్రం రూ.5 వేల కోట్లివ్వాలి
2014-15 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రానికి రావాల్సిన సీఎస్‌ఎస్‌ బకాయిలు రూ.495.20 కోట్లు (వీటిని ఏపీకి బదలాయించారు, ఇప్పటి వరకూ రాలేదు)
2021-22కి సంబంధించి రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు రూ.1,013 కోట్లు ఇవ్వాలంటూ పదిహేనో ఆర్థిక సంఘం కేంద్రానికి ప్రత్యేకంగా సూచించింది (ఇందులో గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.682 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ.331 కోట్లు రావాల్సి ఉంది)
ముహూర్తం నేటి సాయంత్రం నాలుగు గంటలు
కాగా హస్తిన పర్యటన కోసం సీఎం రేవంత్‌ మంగళవారం హైదరాబాద్‌ బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి వెళ్లనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా వెళుతున్నారు. ఇందుకోసం ఆయన తన ఖమ్మం జిల్లా పర్యటనను రద్దు చేసుకున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు మోడీతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కార్‌ ఏర్పడిన తర్వాత తొలిసారిగా సీఎం… ప్రధానిని కలవనుండటంతో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. రాష్ట్ర విభజన అంశాలతోపాటు పెండింగ్‌ ప్రాజెక్టులు, వాటి అనుమతులు, తెలంగాణకు రావాల్సిన బకాయిలపై ప్రధానితో రేవంత్‌ ప్రధానంగా చర్చించనున్నట్టు సమాచారం. ఈ భేటీ అనంతరం ఏఐసీసీ అగ్రనేతలతో సీఎం సమావేశం కానున్నారు. అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వం ప్రారంభించిన నూతన కార్యక్రమాలను ఆయన పార్టీ పెద్దలకు వివరించనున్నారు. నామినెటెడ్‌ పోస్టుల భర్తీ, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు, పార్లమెంట్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన వారితో చర్చించనున్నట్టు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.
రేవంత్‌కు జ్వరం..
సీఎంను కలిసిన కేఏ పాల్‌, చిరంజీవి
మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జ్వరంతో బాధపడుతున్నట్టు ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌ నివాసంలో సోమవారం ఆయనకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. గత మూడు రోజుల నుంచి జ్వరం, గొంతు నొప్పితో సీఎం బాధపడుతున్నట్టు సమాచారం. ఆయన్ను పరీక్షించిన ఫ్యామిలీ డాక్టర్‌ రేవంత్‌ను పరీక్షించి, మందులు సూచించారు. ఆదివారం సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలోనూ సీఎం కొంత నీరసంగా కనిపించారు. ఒక రోజు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు ఆయన సూచించారు. దీంతో సోమవారం పూర్తిగా ఇంటికే పరిమితమైన ముఖ్యమంత్రి మంగళవారం ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. క్రైస్తవ మతబోధకుడు కేఏ పాల్‌, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి… రేవంత్‌ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి, శుభాకాంక్షలు తెలిపారు.

Spread the love