గిల్‌ శతక గర్జన

టాప్‌-2లో
టైటాన్స్‌కు చోటు

ఛేదనలో హైదరాబాద్‌ చతికల
నవతెలంగాణ-అహ్మదాబాద్‌ : యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (101, 58 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్‌) శతక విన్యాసంతో చెలరేగాడు. శుభ్‌మన్‌ గిల్‌ 56 బంతుల్లోనే ఐపీఎల్‌లో తొలి సెంచరీ నమోదు చేయగా.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై గుజరాత్‌ టైటాన్స్‌ 34 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ఐపీఎల్‌16 పాయింట్ల పట్టికలో టాప్‌-2 స్థానం టైటాన్స్‌ ఖాయం చేసుకుంది. 189 పరుగుల ఛేదనలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చేతులెత్తేసింది. పేసర్లు మహ్మద్‌ షమి (4/20), మోహిత్‌ శర్మ (4/28) చెలరేగటంతో సన్‌రైజర్స్‌ 59 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. హెన్రిచ్‌ క్లాసెన్‌ (64, 44 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీ పోరాటంతో హైదరాబాద్‌ గౌరవప్రద స్కోరు సాధించింది. అభిషేక్‌ (4), మార్క్‌రామ్‌ (10), త్రిపాఠి (1), సింగ్‌ (7), సమద్‌ (4), జాన్సెన్‌ (3) విఫలమయ్యారు. 20 ఓవర్లలో 9 వికెట్లకు హైదరాబాద్‌ 154 పరుగులే చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ టైటాన్స్‌ గిల్‌కు తోడుగా సాయి సుదర్శన్‌ (47, 36 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించగా 20 ఓవర్లలో 9 వికెట్లకు 188 పరుగులు చేసింది.
ఇద్దరే అదరగొట్టారు : అహ్మదాబాద్‌లో టాస్‌ నెగ్గిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్‌ వృద్దిమాన్‌ సాహా (0)ను తొలి ఓవర్లోనే భువనేశ్వర్‌ కుమార్‌ అవుట్‌ చేశాడు. మరో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (101)తో జతకలిసిన సాయి సుదర్శన్‌ (47) మూడో వికెట్‌కు 146 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశాడు. తొమ్మిది ఫోర్ల సాయంతో 22 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన శుభ్‌మన్‌ గిల్‌.. అదే ఊపులో కెరీర్‌ తొలి ఐపీఎల్‌ శతకం కొట్టాడు. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య (8), డెవిడ్‌ మిల్లర్‌ (7), రాహుల్‌ తెవాటియ (3), రషీద్‌ ఖాన్‌ (0), నూర్‌ అహ్మద్‌ (0), మహ్మద్‌ షమి (0) తేలిపోయారు. భువనేశ్వర్‌ కుమార్‌ ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగాడు. గిల్‌, సుదర్శన్‌ మెరుపులతో టైటాన్స్‌ 188 పరుగులు నమోదు చేసింది.

Spread the love