ఒక్కో ఫ్లోర్‌కు రూ.1 లక్ష ఇవ్వండి..!

– మల్కాజిగిరి సర్కిల్‌ టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో అధికారులు, సిబ్బంది చేతివాటంపై విమర్శలు అక్రమ నిర్మాణాలను అడ్డుకునేదెవరు?
నవతెలంగాణ-నేరేడ్‌మెట్‌
మల్కాజిగిరి సర్కిల్‌ పరిధిలోని వివిధ కాలనీల్లో అక్రమ నిర్మాణాలు ఊపందుకున్నాయి. అక్రమ నిర్మాణాలు నియంత్రించాల్సిన అధికారులు, సిబ్బంది తమ చేతివాటం చూపిస్తూ అందినంత దండుకుంటున్నారు. ఒక్కో నిర్మాణా నికి లక్షలాది రూపాయలను వసూలు చేస్తూ, జీహెచ్‌ఎం సీ నిధులకు గండీ కొడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. అధికారులు అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని పైకి హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ పలు అక్రమ నిర్మాణాల యజమా నులతో మల్కాజిగిరి సర్కిల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు, చైన్‌మెన్‌లు కుమ్మక్కు కావడంతోనే అక్రమ నిర్మాణాలు యథేేచ్ఛగా కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నా రు. అక్రమ కట్టడాలను నియంత్రించాల్సిన మున్సిపల్‌ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు తమ సొంత పనులు, సంపాదనకే పరిమితం కావడంతో ఇదే అదనుగా భావించి అక్రమ కట్టడాలను ఆసరాగా చేసుకొని చైన్‌మెన్‌లు లక్షలాది రూపాయలను దిగమింగుతున్నా రని జోరుగా ప్రచారం సాగుతోంది. అక్రమ కట్టడాలను అడ్డుకోవాల్సిన అధికారులు వాటిని అడ్డు కోకపోగా తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తుండడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఇకనైనా జీహెచ్‌ఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ ఉన్నతాధికారులు స్పందించి నిద్రావస్థలో ఉంటున్న మల్కాజిగిరి సర్కిల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులపై, సర్కిల్‌ పరిధిలో చేపట్టే అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
టౌన్‌ ప్లానింగ్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ రూటే వేరు..
అదనంగా ఒక ఫ్లోర్‌కు రూ.1లక్ష ఇవ్వాల్సిందే!
మల్కాజిగిరి టౌన్‌ ప్లానింగ్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ రూటే వేరు అని పలువురు చెవులు కొరుకుంటున్నారు. మీరు ఎన్ని ఫ్లోర్లు అయినా కట్టుకోండి..నో అబ్జక్షన్‌ నాకు మాత్రం ఒక్కో ఫ్లోర్‌కు రూ.1 లక్ష ఇచ్చుకోండి అని అడగడం విడ్డూరంగా ఉందని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈయనకు తోడు ఓ చైన్‌మెన్‌ వీరువురూ అమాయక ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వారికి సూట్‌కేసులు ఇవ్వని వారికి మాత్రమే నోటీసులు పంపుతుంటారని బహిరంగ ఆరోపణలు ఉన్నాయి. బ్రోకర్లతో కుమ్మకై లక్షల్లో దండుకుంటూ జీహెచ్‌ఎంసీ ఆదాయానికి పంగనామాలు పెడుతున్న వారిపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదు
మల్కాజిగిరి సర్కిల్‌ పరిధిలో ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అక్రమ కట్టడాలు మా దష్టికొస్తే వాటిని నిర్ధాక్షిణ్యంగా కూలేస్తాం. అక్రమ నిర్మాణాలు చేపట్టే వారు ఎంతటి వారైనా ఉపేక్షించబోం.
-జి.రాజు, మల్కాజిగిరి సర్కిల్‌ ఉప కమిషనర్‌

Spread the love