ప్రభుత్వం జనతా వస్త్ర పథకాన్ని ప్రవేశపెట్టి ఉపాధి కల్పించాలి: సీఐటీయూ

– మృతుని కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియ అందించాలి..
– సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్
– మృతుని కుటుంబాన్ని పరామర్శించిన సీఐటీయూ నాయకులు 
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
నేత కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం జనత వస్త్ర పథకాన్ని ప్రవేశపెట్టి శాశ్వత ఉపాధి కల్పించాలని సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో గత రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న నేత కార్మికుడు అంకారపు మల్లేశం కుటుంబాన్ని శనివారం సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గం పరామర్శించారు. సిరిసిల్లలో ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో ఈ మధ్యకాలంలో ఆత్మహత్యలు చేసుకుని చనిపోయిన 5 మంది నేత కార్మికుల కుటుంబాలతో సీఐటీయూ తెలంగాణ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ నాయకులు మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రభుత్వం సిరిసిల్లలో ఆత్మహత్యలను ఆపాలని , ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా నిరంతరం ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం జనతా వస్త్ర పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరారు. కార్మికులకు రావాల్సిన 10% యారన్ సబ్సిడీ 18 కోట్ల రూపాయలు వెంటనే అందించాలన్నారు. అప్పుడే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి దీప దాస్ మున్షి, మంత్రి పొన్నం ప్రభాకర్,ఇతర నాయకులు నేత కార్మికుని కుటుంబాన్ని పరామర్శించడానికి అక్కడికి వచ్చిన సందర్భంగా సిరిసిల్లలో నేతన్నల ఆత్మహత్యలు , ఉపాధి, ఇతర సమస్యలపై వారితో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని కోరారు.
కేంద్రంలో అధికారంలో బీజేపీ ప్రభుత్వం, గతంలో రాష్ట్రన్ని పాలించిన బిఆర్ఎస్ ప్రభుత్వాలు కారణాలు అయితే ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సమస్యలు పరిష్కరించడంలో కాలయాపన చేస్తుందన్నారు. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల సందర్భంగా సిరిసిల్లలో నేతన్నల ఆత్మహత్యలను పార్టీలు రాజకీయం చేయడం తగదన్నారు. గత 5 సంవత్సరాలుగా స్థానిక కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్న బండి సంజయ్  సిరిసిల్ల నేతన్నల గురించి, నేతన్నలకు ఏమి చేయకపోగా  ప్రస్తుతం దీక్ష చేస్తామని ప్రకటించడం సిగ్గుచేటని విమర్శించారు. నేతన్నలు చనిపోతే పరామర్శించడం కాదని,  ముఖ్యమంత్రి దృష్టికి సమస్యలను తీసుకెళ్లి సమస్యలను తీర్చాల్సిన బాధ్యత మాజీ మంత్రి కేటీఆర్ పై ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్, తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూశం రమేష్ , జిల్లా అధ్యక్షులు కోడం రమణ నాయకులు ఎలిగేటి రాజశేఖర్, అన్నల్దాస్ గణేష్, సూరం పద్మ, జవ్వాజి విమల, నక్క దేవదాస్, సిరిమల్ల సత్యం, కుడిక్యాల కనకయ్య, కూచన శంకర్, కంది మల్లేశం, సందుపట్ల పోచమల్లు, వెంకటేశం, రాజు, ప్రవీణ్, సంపత్, సతీష్, శంకర్, వేణు వీరితోపాటు ఆత్మహత్య చేసుకుని చనిపోయిన తడుక శ్రీనివాస్, సిరిపురం లక్ష్మీనారాయణ, ఈగ రాజు, అంకారాపు మల్లేశం, అడిచెర్ల సాయి పాల్గొన్నారు.

Spread the love