పేద బ్రాహ్మణులకు అండగా ప్రభుత్వం

 – 31న బ్రాహ్మణ సదన్‌ ప్రారంభోత్సవం
 – మెదక్‌లో మల్లినాథసూరి సంస్కృత విశ్వ విద్యాలయం
–  సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
వేదాలనే నమ్ముకొని, జీవనం సాగిస్తున్న పేద బ్రాహ్మణులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అన్నారు. ప్రార్థనా మందిరాల్లోనే శాంతి నెలకొని ఉంటుందనీ, అక్కడే సర్వ జనులకు సాంత్వన చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని గోపనపల్లిలో నిర్మించిన ‘బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌’ భవన సదనాన్ని ఈనెల 31న ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు సోమేష్‌ కుమార్‌, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌ శర్మ, బ్రాహ్మణ పరిషత్‌ చైర్మెన్‌, ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు కేవీ రమణాచారి, బ్రాహ్మణ పరిషత్‌ వైస్‌ చైర్మెన్‌ జ్వాలా నరసింహారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఫైనాన్స్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకష్ణారావు, సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ నర్సింగ్‌రావు, ముఖ్యమంత్రి కార్యదర్శులు స్మితా సభర్వాల్‌, భూపాల్‌ రెడ్డి, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ నవీన్‌ మిట్టల్‌, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్‌ కమిషనర్‌ అశోక్‌ రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ బ్రాహ్మణ పరిషత్‌ భవన ప్రారంభోత్సవం సందర్భంగా చండీయాగం, సుదర్శన యాగాలను నిర్వహించాలని బ్రాహ్మణ పరిషత్‌ చైర్మెన్‌ డాక్టర్‌ కేవి రమణాచారిని అదేశించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి అన్ని రాష్ట్రాల ప్రముఖ పుణ్య క్షేత్రాలనుంచి అర్చకులను, దేశవ్యాప్తంగా వున్న పీఠాధిపతులు, హిందూ మత పెద్దలు, అన్ని రాష్ట్రాల బ్రాహ్మణ సంఘాల పెద్దలు, ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని చెప్పారు. వారికి అవసరమైన ప్రయాణాలు, బస ఏర్పాట్లు చేయాలనీ, దానికి అవసరమైన నిధులను విడుదల చేయాలని ఫైనాన్స్‌ సెక్రటరీ రామకష్ణారావును ఆదేశించారు. బ్రాహ్మణ పరిషత్‌ భవనంలో ఆధ్మాత్మిక గ్రంధాలు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, సాహిత్యంతో కూడిన గ్రంధాలయాన్ని ఏర్పాటు చేయాలని అదేశించారు. తెలంగాణ ఆధ్యాత్మిక ప్రాశస్త్యాన్ని పునరుజ్జీవింపచేసుకోవాలనీ, కాలగర్భంలో విస్మరించబడిన మల్లినాధసూరి వంటి నాటి ప్రముఖ భాషా కవి పండితుల చరిత్రలను వెలికితీయాలని చెప్పారు. మల్లినాధుని జన్మస్థలం మెదక్‌ జిల్లా కొల్చారంలో కోలాచల మల్లినాథ సూరి సంస్కృత విశ్వ విద్యాలయం ఏర్పాటు చేయాలనీ, దానికి అవసరమైన కార్యాచరణ ప్రారంభించాలని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశం నుంచే ఫోన్‌ చేసి చెప్పారు.

Spread the love