చంద్రబోస్‌కు గురజాడ విశిష్ట పురస్కారం

నవతెలంగాణ -విజయనగరం: ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్‌కు గురజాడ విశిష్ట పురస్కారం ఇవ్వనున్నట్లు విజయనగరం గురజాడ సాంస్కృతిక సమాఖ్య వారు ప్రకటించారు. ఆదివారం నాడు స్థానిక గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన పురస్కార కరపత్రాల ఆవిష్కరణ సందర్భంగా … గురజాడ సాంస్కృతిక సమాఖ్య వారు మాట్లాడుతూ, మహాకవి గురజాడకు సమున్నతదిలో నివాళులు అర్పిద్దామన్న ఉద్దేశంతో 2000 సంవత్సరంలో ప్రారంభించిన గురజాడ సాంస్కృతిక సమాఖ్య ప్రతి సంవత్సరం నవంబర్‌ 30వ తేదీన ఉదయం నుండి రాత్రి వరకు గురజాడ సాహితీ చైతన్య ఉత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా సాంస్కృతిక రంగానికి చెందిన ప్రముఖులను గురజాడ విశిష్ట పురస్కారంతో గౌరవించుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఇప్పటివరకు ఈ పురస్కారంతో జీవి సోమయాజులు, గొల్లపూడి మారుతీరావు, డాక్టర్‌ సి.నారాయణరెడ్డి, కె.విశ్వనాథ్‌, గుమ్మడి, షావుకారు జానకి, మల్లెమాల, అంజలీదేవి, రావి కొండలరావు, వంశీ, భరణి, మొదిలి నాగభూషణ శర్మ, సుద్దాల, డాక్టర్‌ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌, గరికిపాటి నరసింహారావు, పద్మ విభూషణ్‌ డాక్టర్‌ ఎస్పీ బాలసుబ్రమణ్యం, డైరెక్టర్‌ క్రిష్‌ గేయ రచయిత రామ జోగయ్య శాస్త్రి, చాగంటి కోటేశ్వరరావును సత్కరించుకున్నామన్నారు. ఈ సంవత్సరం తెలుగు పాటకు అంతర్జాతీయ జాతీయ పురస్కారాలను తెచ్చిన ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్‌ ని ఈ పురస్కారంతో సత్కరించుకుంటున్నామన్నారు. నవంబర్‌ 30న జరిగే ఉత్సవాల్లో తెలుగు సాహిత్య రంగంలో పదిమంది వర్ధమాన కవులను గురజాడ ఉత్తమ సాహితీ పురస్కారంతో గౌరవించడం జరుగుతుందన్నారు. హిందువుగాను జాతీయస్థాయిలో కవితలను ఆహ్వానించి అందులో పదిమందిని ఎంపిక చేసి పురస్కారాన్ని అందజేస్తామన్నారు. గురజాడ రచనలపై విశేషంగా అధ్యయనం చేసి డాక్టరేట్‌ పొందిన సాహితీవేత్తలను ఆహ్వానించి సదస్సు నిర్వహించి వారిని సత్కరించడంతోపాటు గురజాడ రచనలపై నిర్వహించిన పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థుల ప్రసంగాలు కూడా ఏర్పాటు చేయడానికి నిర్ణయించడం అయినది అని, ప్రతి సంవత్సరం మాదిరిగానే ఆరోజు ఉదయం మహాకవి వాడిన వస్తువులతో వారి స్వగఅహం నుండి ఊరేగింపుగా వెళ్లి వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడంతో ప్రారంభమై సాయంకాలం వరకు ఉత్సవం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గురజాడ వారసులు గురజాడ వెంకట ప్రసాద్‌, ఇందిరా, గురజాడ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షులు పీవీ నరసింహారావు ప్రధాన కార్యదర్శి కాపుగంటి ప్రకాష్‌, కోశాధికారి బ్యాటరీ గోపాల్‌ రావు, కార్యవర్గ సభ్యులు సూర్యలక్ష్మి, జక్కు రామకఅష్ణ, ఎం.భీష్మారావు, ఇతర సభ్యులు పాల్గొన్నారు.

Spread the love