Saturday, May 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకర్షకులను కరుణించండి

కర్షకులను కరుణించండి

- Advertisement -

దొడ్డు వడ్లను కొనుగోలు చేయాలని రోడ్డెక్కిన రైతులు
తరుగు పేరిట దోపిడీని అరికట్టాలని డిమాండ్‌
నవతెలంగాణ-సిరికొండ

దొడ్డు రకం వడ్లను కొనుగోలు చేయాలని రైతులు రోడ్డెక్కారు. దొడ్డు రకం వడ్లను తరుగు లేకుండా కొనుగోలు చేసే విధంగా చూడాలని రైతులు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నిజామాబాద్‌ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో తెలంగాణ చౌరస్తాలో పార్టీలకతీతంగా రైతులు రోడ్డుపై బైటయించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులు పండించిన ధాన్యాన్ని రైస్‌మిల్లర్లు తరుగు పేరుతో దోచుకుంటుంటే అధికారులు చోద్యం చూస్తున్నారని అన్నారు. రైస్‌మిల్లులకు తరలించిన ధాన్యాన్ని పది రోజులపాటు దించుకోకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వడ్లను వెంటనే తరలించకపోవడంతో ఎండ వేడిమికి వెయిట్‌ లాస్‌ అయి రైతులు నష్టపోతున్నారని, మండల వ్యాప్తంగా లారీల కొరత ఉండడంతో రైతులే స్వయంగా లారీ డ్రైవర్‌లకు అదనంగా డబ్బులు చెల్లించి లారీలను దగ్గరుండి వెంట తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని రైతులు ఆరోపించారు. రైస్‌మిల్లులో ఆన్‌లోడింగ్‌ చేయడం లేదని, 8 నుంచి 10 కిలోల తరుగు పేరుతో దోచుకోవడం. లారీ డ్రైవర్లకు అదనంగా డబ్బులు చెల్లిస్తేనే రైస్‌ మిల్లులకు తరలించడంపై న్యాయ విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని రైతు ఎన్నం రాజారెడ్డి కోరారు. రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే రైసుమిల్లుకు తరలించే విధంగా చూడాలని, డబ్బులు చెల్లించాలని కష్టకాలంలో రైతులను ఆదుకోవాలని, లేకుంటే పెద్ద ఎత్తున కలెక్టర్‌, తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. అనంతరం హెడ్‌ కానిస్టేబుల్‌ రమేష్‌ ఆధ్వర్యంలో రైతులకు సర్ది చెప్పడంతో ధర్నా విరమించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సాయిచరణ్‌, పోతునురు సర్పంచు మహిపాల్‌యాదవ్‌, మాజీ వైస్‌ ఎంపీపీ తోట రాజన్న, రైతులు గాదరి కిషన్‌రెడ్డి, తలకట్ల గంగారెడ్డి, భూషణ్‌రెడ్డి, బాడాల గంగాధర్‌, తోట బాలరాజ్‌, దువ్వూరి సంతోష్‌రెడ్డి, జంగం గంగాధర్‌, బాబురావు, గడ్డాల పెద్ద గంగాదాస్‌, బాలకిషన్‌, చౌటుపల్లి ప్రభాకర్‌, హరీష్‌ తిరుపతి, దువ్వూరి భూమిరెడ్డి, దన్సింగ్‌, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -