ఉద్యోగ సంఘాలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం అత్యంత చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు. శుక్రవారం సాయంత్రం మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులతో ఆయన సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగుల విన్నపాలను సావధానంగా విన్న ఆయన, వారి సమస్యలపై సానుకూల హామీ ఇచ్చారు. ఉద్యోగుల సేవలను కొనియాడారు. ”ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఉద్యోగులు ఒక వారధిలా పని చేస్తున్నారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో సామాన్య ప్రజల గడప వద్దకు చేరుతున్నాయంటే, అందులో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకం..” అని భట్టి విక్రమార్క ప్రశంసించారు.
గతంతో పోలిస్తే ప్రస్తుతం ఆర్థిక క్రమశిక్షణతో పాటు ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుండటంపై సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు అందుతున్నాయనీ, దీంతో వేలాది కుటుంబాలకు ఊరట లభిస్తోందని వారు డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బెనిఫిట్స్ చెల్లించేందుకు ప్రభుత్వం ప్రతి నెలా రూ.1,000 కోట్లు కేటాయించడాన్ని వారు హర్షం వ్యక్తం చేశారు.
భేటీ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు ప్రధానంగా పీఆర్సీ, కరువు భత్యం, హెల్త్ కార్డ్స్ వంటి దీర్ఘకాలిక సమస్యలను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఆయన, ఈ అంశాలన్నింటినీ క్యాబినెట్ సబ్ కమిటీలో సమగ్రంగా చర్చించి త్వరలోనే ఉద్యోగులకు చెబుతామని వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. జేఏసీ నాయకులు చెప్పిన కోర్కెలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని చెప్పారు. సమస్యలు, ఇతర అంశాలపై క్యాబినెట్ సబ్ కమిటీలో చర్చించనున్నట్టు తెలిపారు. త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు.
డిప్యూటీ సీఎంతో చర్చలు ఆశాజనకం : టీజీఈజేఏసీ
ఉప ముఖ్యమంత్రితో చర్చలు ఆశాజనకంగా జరిగాయని టీజీఈజేఏసీ చైర్మెన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు వారు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2వ పీఆర్సీ కమిటీ నివేదికను వెంటనే తెప్పించుకుని జేఏసీ ప్రతినిధులతో చర్చించి సత్వర నిర్ణయం తీసుకుంటామనీ, పెండింగ్ లో ఉన్న 5 డీఏలను 2వ పీఆర్సీలో విలీనం చేస్తామని డిప్యూటీ సీఎం తెలిపినట్టు వెల్లడించారు. పెండింగ్స్ బిల్లులకు సంబంధించి పెన్షనర్లకు రూ.6,000 కోట్లను వంద రోజుల్లోపు పూర్తిగా చెల్లిస్తామనీ, ప్రతి నెల వెయ్యి కోట్ల ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపులు కొనసాగిస్తామని తెలిపారని పేర్కొన్నారు. ఈహెచ్‌ఎస్ కార్డులను జూన్ 2 నుంచి అమలు చేస్తామనీ, ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు వెంటనే జారీ చేస్తామని తెలిపారు. ”2004 సెప్టెంబర్ ఒకటి నుంచి ఉద్యోగుల విషయమై పరిశీలించి సత్వర నిర్ణయం తీసుకుంటామనీ, సీపీఎస్ నుంచి ఓపీఎస్‌కు మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటాం. టీజీఈజేఏసీ 63 డిమాండ్లలో పాక్షికంగా పూర్తి చేసిన 26 డిమాండ్లు, పెండింగ్ లో ఉన్న 37 డిమాండ్లను జేఎస్‌సీ సమావేశం ఏర్పాటు చేసి, సీఎస్‌కు ఆదేశాలు జారీ చేసి 30 రోజుల్లోపు తగిన నిర్ణయం తీసుకుంటాం. ఈ అంశాలపై సీఎంతో కూలంకుషంగా మాట్లాడిన తర్వాత మరోసారి జేఏసీ నాయకులతో మాట్లాడుతాను. మే 5న రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన నిరసన కార్యక్రమంపై పునరాలోచన చేయాలి. సీఎంతో సమావేశమైన తర్వాత ఒకట్రెండు రోజుల్లో సమావేశమై నిర్ణయం తీసుకోండి…. ” అని ఉప ముఖ్యమంత్రి కోరినట్టు జేఏసీ నాయకులు వెల్లడించారు. డిప్యూటీ సీఎంతో సమావేశమైన వారిలో జేఏసీ నాయకులు దామోదర్ రెడ్డి, చావ రవి, సదానంద్ గౌడ్, వంగ రవీందర్ రెడ్డి, డాక్టర్ సురేష్ కుమార్, దాస్య నాయక్, ముజీబ్ హుస్సేన్, బి.శ్యామ్, కె.శ్రీనివాస్ రెడ్డి, మడుసూదన్ రెడ్డి, కటకం రమేష్, అంబి రెడ్డి, వెంకట్, శ్రీ వెంకట్ రెడ్డి, కష్ణమూర్తి, గౌతం కుమార్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



