దేశవ్యాప్తంగా ఘనంగా మేడే వేడుకలు
సీపీఐ(ఎం) కేంద్ర కార్యాలయంలో జెండా ఎగురవేసిన ప్రకాశ్‌కరత్
హరికిషన్ సింగ్ సుర్జీత్ భవన్‌లో ఆర్. అరుణ్ కుమార్ జెండా ఆవిష్కరణ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం దేశవ్యాప్తంగా మే డే వేడుకలు ఘనంగా జరిగాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వాడవాడలా నిర్వహించిన కార్యక్రమాలు కార్మికుల్లో నూతనోత్సాహాన్ని నింపాయి. జెండా ఆవిష్కరణలు, ప్రదర్శనలు, మోటర్ సైకిల్ ర్యాలీలు, బహిరంగ సభలతో కార్మిక దినోత్సవం వేడుకగా సాగింది. లేబర్ కోడ్‌లు రద్దు చేయాలని, కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని కార్మికలోకం గొంతెత్తింది. రక్తం చిందించి సాధించుకున్న హక్కుల హననం చేస్తే ఊరుకునేదే లేదని కార్మికనేతలు హెచ్చరించారు. మేడే సందర్భంగా శుక్రవారం నాడిక్కడ సీపీఐ(ఎం) కేంద్ర కార్యాలయం ఏకేజీ భవన్‌లో సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు ప్రకాశ్‌కరత్ ఎర్ర జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) అగ్ర నాయకు రాలు బృందాకరత్ మాట్లాడుతూ ప్రపంచంలో సామ్రాజ్య వాదం మితిమీరిందని, ట్రంప్ యుద్ధోన్మాదానికి పరాకాష్ట ఇరాన్‌పై యుద్ధం, పాలస్తీనాపై దాడులని అన్నారు. ఇండియా ఎప్పుడూ శాంతి కోసం నిలబడిందని, అయితే ప్రపంచంలో క్లిష్ట పరిస్థితులు నెలకొన్న సమయంలో మన పాలకులు నోరు మెదపలేదని విమర్శించారు. ప్రధాని మోడీ నోటికి తాళం పడిందని, దాని కీ ట్రంప్ జేబులో ఉందని ఎద్దేవా చేశారు. కార్మికులు పోరాడి సాధించిన హక్కులను నేటి పాలకవర్గాలు, పెట్టుబడిదారీ వర్గం లాక్కుంటున్నా యని విమర్శించారు. లేబర్ కోడ్‌లతో ఎనిమిది గంటల పని విధానం స్థానంలో 12 గంటల పని విధానం అమలుకు మోడీ సర్కార్ పూనుకుందని ధ్వజమెత్తారు. మోడీ సర్కార్ కార్మిక వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల నిర్ణయాలు అమలు చేస్తోందని విమర్శించారు. ఈ కుట్రలకు వ్యతిరేకంగా కార్మికులంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ఆర్. అరుణ్ కుమార్, కేంద్ర కమిటీ సభ్యులు మురళీధరన్ తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ కేంద్ర కార్యాలయం బీటీఆర్ భవన్‌లో సీఐటీయూ సీనియర్ నేత తపన్ సేన్ జెండా ఆవిష్క రించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జాతీయ కార్య దర్శులు కరుమవలయన్, ఎ.ఆర్ సింధూ, దేవ్ రారు, జె.ఎస్ మజుంధర్ పాల్గొన్నారు. అలాగే పి.రార్తి భవన్‌లో నిర్వహించిన మేడే వేడుకల్లో సీఐటీయూ జాతీయ కార్యదర్శి స్వదేశ్ దేవ్ రారు జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లేబర్‌కోడ్‌ల అమలుకు వ్యతిరేకంగా ఉద్యమా నికి కార్మిక వర్గం సమయాత్తం కావాలని పిలుపు నిచ్చారు. హరికిషన్ సింగ్ సుర్జీత్ భవన్‌లో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ఆర్. అరుణ్ కుమార్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ అంశాలను వివరించారు. కార్మిక వర్గంపై దాడి తీవ్రతరం అవుతోందని, దీన్ని తిప్పి కొట్టేందుకు కార్మికవర్గం ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులంతా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కేరళలోని తిరువనంతపురంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయం ఎకేజీ సెంటర్‌లో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ బేబీ జెండా ఎగురవేశారు. రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. గోవిందన్ మాస్టర్, రాష్ట్ర కమిటీ సభ్యుడు బిజు కందకైతో సహా పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. కొట్టాయంలో జరిగిన ర్యాలీలో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ఎ.విజయ రాఘవన్ పాల్గొన్నారు. త్రిపురలోని అగర్తలాలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి జితిన్ చౌదరి జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వివరించారు. దీనిపై పోరాటానికి కార్మికులు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. తమిళనాడులో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయంలో పొలిట్‌బ్యూరో మాజీ సభ్యులు రామకృష్ణన్ జెండా ఆవిష్కరించారు.
చిదంబర్ పార్టీ కార్యాలయంలో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బాలకష్ణన్, విరుదునగర్ జిల్లా కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.షణ్ముగం జెండా ఆవిష్కరించారు. చెన్నై మెరైనా బీచ్‌లో కార్మిక పోరాట విగ్రహాలకు నివాళులర్పించారు. దిండిగల్ ఎంపీ పి.సచ్చితానందన్, చెన్నై సెంట్రల్ కార్యదర్శి జి.సెల్వ పాల్గొన్నారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయంలో సీనియర్ నేతలు వాసుదేవ్ శర్మ, రవీంద్ర శుక్లా జెండా ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయం వద్ద సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు జెండాను ఆవిష్కరించారు. ఆంధప్రదేశ్‌లోని విజయవాడలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాస రావు జెండాను ఆవిష్కరించారు. బీహార్‌లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి లలన్ చౌదరి జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కమిటీ సభ్యులు అవదేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పంజాబ్‌లో అమరవీరులకు నివాళులర్పించేందుకు ‘హీరో సైకిల్ కార్మికుల సంఘం’ నిర్వహించిన భారీ సభను ఉద్దేశించి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ సుఖ్విందర్ సింగ్ సెఖోన్ ప్రసంగించారు. జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో పోలో గ్రౌండ్‌లో జరిగిన మేడే బహిరంగ సభలో మహ్మద్ యూసఫ్ తరిగామి ప్రసంగించారు.
ఎర్రజెండా రెపరెపలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



