తెలంగాణలో భారీ వర్షం.. 11 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్

నవతెలంగాణ – హైదరాబాద్
తెలంగాణ వ్యాప్తంగా గత రెండ్రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు మరో నాలుగు రోజుల పాటు కొనసాగనున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు జిల్లాల్లో మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. 11 జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరికలు, 18 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. ఎల్లో హెచ్చరికలు జారీ అయిన జిల్లాల్లో హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, వికారాబాద్‌ ఉన్నాయి. ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ అయిన జిల్లాల్లో మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగామ జిల్లాలు ఉన్నాయి. ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ అయిన జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ముఖ్యంగా హైదరాబాద్ నగర వాసులు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో జీహెచ్ఎంసీ అలర్ట్ అయింది. వర్షాల వల్ల నగరవాసులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేస్తోంది.

Spread the love