నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో సమావేశాలు నిర్వహించండి

– 18న ఇంటింటికి గ్యారంటీ కార్డులు అందజేయాలి
– కార్యకర్తలతో కలిసి భోజనాలు చేయండి
– సమన్వయంతో సభను విజయవంతం కోసం కృషి
– జూమ్‌ మీటింగ్‌లో రేవంత్‌రెడ్డి పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
విజయభేరి సభకు నాయకులు, కార్యకర్తలు ప్రజలతో మమేకం కావాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. అన్ని నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో సమావేశాలు నిర్వహించాలని కోరారు. ఈనెల 17న విజయబభేరి సభలో ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ ఐదు హామీలను ఇస్తారని తెలిపారు. వాటన్నింటిని 18న ఇంటింటికి కార్డుల రూపంలో అందజేయాలని సూచించారు. ఆదివారం డీసీసీ అధ్యక్షులతో రేవంత్‌రెడ్డి జూమ్‌ మీటింగ్‌లో మాట్లాడారు. ఈనెల 11 నుంచి అన్ని మండలాల్లో సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలోని 35వేల బూత్‌ల నుంచి సభకు తరలివచ్చేలా కృషి చేయాలని కోరారు. సోమవారం పార్లమెంట్‌ నియోజకవర్గాల ఇంచార్జిలు, ఉపాధ్యక్షులతో సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. ఈ నెల 12,13,14 తేదీల్లో పార్లమెంటు పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో సమీక్షలు చేస్తామన్నారు. 18న ఉదయం 11 గంటలకు 119 నియోజకవర్గాలకు జాతీయ నాయకులు చేరుకుంటారనీ, వారితో కలిసి ఐదు హామీలకు సంబంధించి పోస్టర్లు అతికించాలని సూచించారు. ఆ రోజు కార్యకర్తలతో కలిసి భోజనాలు చేయాలని ఆదేశించారు. ప్రతీ ఒక్కరు సమన్వయం చేసుకుని సభను విజయవంతం చేసేందుకు కషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావు ఠాక్రే మాట్లాడుతూ ‘తిరగబడదాం…తరిమికొడదాం’ అనే నినాదంతో బీజేపీ, బీఆర్‌ఎస్‌పై చార్జిషీట్‌ను గ్రామ గ్రామానికి చేర్చాలని చెప్పారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ విజయభేరీ బహిరంగ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి బూత్‌ నుంచి ప్రతి గ్రామం నుంచి ప్రజలను సభలో పాల్గొనేలా చూడాలన్నారు. మండల, నియోజక వర్గ స్థాయిలలో నాయకులంతా ప్రత్యేక శ్రద్ధతో పని చేయాలని కోరారు. ప్రచార కమిటీ చైర్మెన్‌ మధు యాష్కీగౌడ్‌ మాట్లాడుతూ విజయభేరి బహిరంగ సభ తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు పౌర సన్మానం జరగాలనానరు. ఒక రాజకీయ సభలాగా కాకుండా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఉండాలని కోరారు.
జూమ్‌ సమావేశానికి టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ అధ్యక్షతన వహించారు.

Spread the love