సిబిల్‌ స్కోర్‌ తక్కువున్నా గృహ రుణాలు

Home loans with low CIBIL score– ఎస్‌బీఐ వెల్లడి
– పండగ సీజన్‌పై దృష్టి
న్యూఢిల్లీ: గృహ రుణగ్రహీతల పట్ల స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) అత్యంత సానుకూల నిర్ణయం తీసుకుంది. ఖాతాదారులకు సిబిల్‌ స్కోర్‌ తక్కువగా ఉన్నప్పటికీ ఇంటి కోసం అప్పు ఇవ్వాలని నిర్ణయించింది. అదే విధంగా సిబిల్‌ స్కోర్‌ మెరుగ్గా ఉన్న వారికి వడ్డీలో రాయితీ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. వచ్చే పండగ సీజన్‌లో ఈ విభాగంలో మరింత దూసుకుపోవడానికి తాజా నిర్ణయం దోహదం చేయనుందని ఎస్‌బీఐ ఆశాభావం వ్యక్తం చేసింది. సాధారణంగా ఖాతాదారులకు సిబిల్‌ స్కోర్‌ తక్కువగా ఉంటే బ్యాంక్‌లు అప్పులివ్వడానికి వెనుకడుగు వెస్తాయి. కానీ.. ఎస్‌బీఐ అందుకు భిన్నంగా నిర్ణయం తీసుకోవడం విశేషం. సిబిల్‌ స్కోర్‌ (151- 200) తక్కువగా ఉన్న వారికి, లేదంటే.. అసలు క్రెడిట్‌ స్కోర్‌ లేని ఖాతాదారులకు గృహ రుణాలు, టాప్‌ అప్‌ రుణాలు కూడా ఇవ్వాలని ఎస్‌బీఐ నిర్ణయించింది. అదే విధంగా టాప్‌అప్‌ రుణాలపై 65 బేసిస్‌ పాయింట్ల మేర వడ్డీ రాయితీ కల్పించనున్నట్టు పేర్కొంది.
ఇప్పటికే ఇంటి రుణం తీసుకున్న వారు టాప్‌అప్‌ రుణాలు తీసుకోవడానికి అర్హులు. దీని కోసం మళ్లీ ప్రత్యేక డాక్యుమెంటేషన్‌ అవసరం ఉండదు. ఒక విధంగా ప్రస్తుత ఇంటిపైనే అదనపు అప్పు పొందడం. టాప్‌ అప్‌ రుణాలు పొందాలనుకునే ఖాతాదారుల సిబిల్‌ స్కోర్‌ 750 కంటే ఎక్కువగా ఉంటే 45 బేసిస్‌ పాయింట్ల వరకు రాయితీ పొందవచ్చు. వీరికి 9.10 శాతం వడ్డీ రేటు అమల్లో ఉంటుంది. క్రెడిట్‌ స్కోర్‌ 700-749, 151-200 ఉన్న ఖాతాదారులు 45 బేసిస్‌ పాయింట్ల వరకు సబ్సీడీని పొందడంతో 9.30 శాతానికి టాప్‌అప్‌ రుణం తీసుకోవచ్చు. ఎలాంటి క్రెడిట్‌ స్కోరూ లేని వారికీ 65 బేసిస్‌ పాయింట్లు రాయితీ ఇస్తున్నారు. అదే విధంగా గృహ రుణాలపై ప్రాసెసింగ్‌ ఫీజు రూ.2 వేలు నుంచి రూ.10 వేల మధ్య ఉంటాయి. జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
సెప్టెంబర్‌ 1 నుంచి డిసెంబర్‌ 31 వరకు ఎస్‌బీఐ బ్యాంకు నిర్వహించే ఈ క్యాంపెయిన్‌లో సిబిల్‌ స్కోర్‌ 750పైగా ఉన్న వారికి 55 బేసిస్‌ పాయింట్ల వరకు రాయితీ ఇస్తున్నట్లు వెల్లడించింది. దీంతో 8.60 శాతానికే గృహ రుణం పొందవచ్చు. ఇప్పటికే అమ్మేందుకు సిద్ధంగా (రెడీ టు మూవ్‌) ఉన్న ఇళ్లను కొనుగోలు చేయాలనుకున్న వారి సిబిల్‌ స్కోర్‌ 700 పైగా ఉంటే పైన పేర్కొన్న రాయితీల కంటే అదనంగా 20 బేసిస్‌ పాయింట్ల మేర రాయితీ పొందవచ్చని ఎస్‌బిఐ తెలిపింది. దీంతో క్రెడిట్‌ స్కోర్‌ 750 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే 8.40 శాతానికి, 700-749 మధ్య ఉంటే 8.50 శాతానికి గృహ రుణాలు పొందడానికి వీలుంది.

Spread the love