విచారణ అధికారికే తిరిగి డీడీ బాధ్యతలు ఎలా అప్పగిస్తారు

ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శులు
నవతెలంగాణ-భద్రాచలం రూరల్‌

స్థానిక భద్రాచలం ఐటీడీఏ కార్యాలయం ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఎదుట ఆందోళనా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శులు బుర్ర వీరభద్రం, కాళంగి హరికృష్ణ మాట్లాడుతూ పరిపాలనా సౌలభ్యం కోసం ఐటీడీఏ పరిధిలో చేపట్టిన ఉపాధ్యాయుల డిప్యుటేషన్లలో కొందరికి అన్యాయం జరిగిందంటూ వచ్చిన ఆరోపణలపై వేసిన త్రిసభ్య కమిటీలో చైర్మన్‌గా, విచారణ అధికారిగా బాధ్యతల్లో ఉన్న జనరల్‌ ఏపీవోకు డీడీగా అధనపు భాద్యతలు అప్పగించడం సరైంది కాదన్నారు. ఇప్పటికే ఏపీవోగా, ఇన్‌ చార్జి ఆర్‌సీఓగా పలు బాధ్యతలు నిర్వర్తిస్తున్న సదరు అధికారికి తిరిగి డీడీగా బాధ్యతలు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఆయన ఇన్‌చార్జి ఆర్‌సీఓగా వైఫల్యం చెందారనీ, ఆయా గురుకులాల్లో విద్యార్థులను సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయనీ, అనేక సమస్యలు పలు అంశాలపై తన దృష్టికి తీసుకువెళ్లినా స్పందించలేదన్నారు.
కొత్తగూడెం గురుకులంలో డిగ్రీ విద్యార్థులకు కడుపునొప్పి అని చెప్పినా కనీసం స్పందించలే దన్నారు. విద్యార్థుల జీవితాల పట్ల, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారికే తిరిగి డీడీగా బాధ్యతలు అప్పగించడం పట్ల పలు అనుమానాలున్నాయని అన్నారు. అంతకు ముందు కూడా పలు అంశాల్లో విచారణ అధికారిగా ఉండి సదరు అధికారులను పక్కకు తప్పించి వారి పదవులను తాను అనుభవించడం వరుస ఘటనలు పరిశీలించాలన్నారు. త్రిసభ్య కమిటీలో చైర్మన్‌గా బాధ్యతల్లో ఉన్న జనరల్‌ ఏపీవోకు డిడిగా అధనపు భాద్యతలు అప్పగిస్తున్నట్లు కమిషనరేట్‌ నుండి వెలువడిన జీవో పై న్యాయ పోరాటం చేస్తామన్నారు. డిప్యూటేషన్లుబూచిగా చూపి స్వలాభం పొందాలనుకోవడం సహేతుకం కాదన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు సండ్ర భూపేందర్‌, నవీన్‌, కొత్తగూడెం పట్టణ కార్యదర్శి మంద నాగకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Spread the love