భోపాల్‌లో భారీ ర్యాలీ

Huge rally in Bhopal– సీట్ల పంపకానికి సంబంధించిన ప్రక్రియకు శ్రీకారం
– ఇండియా కూటమి సమన్వయ కమిటీ మొదటి భేటీ
న్యూఢిల్లీ : పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, బీజేపీ ప్రభుత్వ అవినీతిపై అక్టోబర్‌ మొదటి వారంలో మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో తొలి బహిరంగ సభ, ర్యాలీ జరిపేందుకు ప్రతిపక్షాల ఇండియా కూటమి సమన్వయ కమిటీ నిర్ణయించింది. బుధవారం నాడిక్కడ ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ నివాసంలో ఇండియా కూటమి సమన్వయ కమిటీ మొదటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కమిటీకి ఎంపికైన 12 పార్టీల నుంచి శరద్‌ పవార్‌ (ఎన్‌సీపీ), డి.రాజా (సీపీఐ), హేమంత్‌ సోరెన్‌ (జేఎంఎం), కెసి వేణుగోపాల్‌ (కాంగ్రెస్‌), టిఆర్‌ బాలు (డీఎంకే), తేజస్వి యాదవ్‌ (ఆర్జేడీ), సంజరు రౌత్‌ (శివసేన), సంజరు ఝా (జేడీయూ), జావెద్‌ అలీ (ఎస్పీ), రాఘవ్‌ చడ్డా ( ఆప్‌), ఒమర్‌ అబ్దుల్లా (నేషనల్‌ కాన్ఫరెన్స్‌), మెహబూబా ముఫ్తి (పీడీపీ) పాల్గొన్నారు. బీజేపీ ప్రతీకార రాజకీయాల కారణంగా, ఈడీ సమన్ల వల్ల టీఎంసీ నేత అభిషేక్‌ బెనర్జీ, జేడీయూ నేత లలన్‌ సింగ్‌ హాజరుకాలేదు.సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేతలందరతో కలిసి కాంగ్రెస్‌ నేత కెసి వేణుగోపాల్‌ మాట్లాడుతూ సీట్ల పంపకానికి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించాలని సమన్వయ కమిటీ నిర్ణయించిందన్నారు. పార్టీలతో చర్చలు జరిపి వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉమ్మడి బహిరంగ సభలు నిర్వహించాలని కమిటీ నిర్ణయించిందన్నారు.కూటమి పార్టీలు ఏవీ తమ ప్రతినిధులను మీడియా చర్చలకు పంపకూడదని, ఎవరి షోలలో ఎవరి పాల్గోవాలో ప్రతినిధుల పేర్లను నిర్ణయించే అధికారం మీడియా కో-ఆర్డినేషన్‌ కమిటీ సబ్‌ గ్రూప్‌కు ఇచ్చినట్టు తెలిపారు. కుల గణన అంశాన్ని చేపట్టేందుకు సమావేశానికి హాజరైన పార్టీలు అంగీకరించాయని అన్నారు. కుల గణనపై తృణమూల్‌ కాంగ్రెస్‌ వైఖరికి సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నకు స్పందించిన కెసి వేణుగోపాల్‌, టీఎంసీ ప్రతినిధి ఇప్పుడు లేరని, ఇక్కడ ఉన్న పార్టీలన్నీ మద్దతు ఇచ్చాయని అన్నారు.

Spread the love