Monday, April 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రాజెక్టు నిర్వాసితులు, రైల్వే లైన్ లో భూముల రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలి

ప్రాజెక్టు నిర్వాసితులు, రైల్వే లైన్ లో భూముల రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలి

- Advertisement -

– సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ
నవతెలంగాణ – హైదరాబాద్:

బస్వాపురం ప్రాజెక్టులో భూములు, ఇండ్లు కోల్పోయిన, కోల్పోతున్న నిర్వాసితులకు వెంటనే నష్టపరిహారం పూర్తిస్థాయిలో చెల్లించాలని, నడికుడి నుండి బీబీనగర్ వరకు రైల్వే రెండవ లైన్ లో భూములు కోల్పోతున్న రైతులకు బహిరంగ మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెండో విడత ఇందిరమ్మ ఇండ్లను వెంటనే ప్రకటించి కాంగ్రెస్ కార్యకర్తలకు కాకుండా గ్రామంలో ఇండ్లు ప్రతి పేద కుటుంబానికి ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు.

సోమవారం భువనగిరి మండల తహశీల్దార్ కార్యాలయం ముందు మండలంలో ఉన్న ప్రజా సమస్యలను పరిష్కరించాలని సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో ” ధర్నా ” కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం తహశీల్దార్ జగన్ కు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా నర్సింహ పాల్గొని మాట్లాడుతూ .. గత నాలుగైదు సంవత్సరాలుగా వృద్ధులు, వితంతులు, వికలాంగులు, వృత్తిదారులు పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకొని ఎదురు చూస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారం చేపట్టగానే ఇప్పుడు ఇస్తున్న డబ్బులకన్నా అదనంగా పెంచి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇస్తామని చెప్పి రెండు సంవత్సరాలు గడిచిన ఎందుకు అదనంగా పెంచి నూతన పెన్షన్లు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. జిల్లాలో అత్యంత కీలకంగా సాగు నీరు కోసం ఉపయోగపడే బస్వాపురం ప్రాజెక్టుపై ఈ ప్రభుత్వం వివక్షత చూపుతుందని అన్నారు. కేవలం 500 రూ.కోట్లు కేటాయిస్తే జిల్లాలో లక్ష ఎకరాలకు పైగా భూమి సేద్యంలోకి వస్తుందని అన్నారు. దానివల్ల రైతులు, వ్యవసాయ కూలీలు, వృత్తిదారులు తమ కుటుంబాలను పోషించుకుంటారని తెలిపారు.

కొంతమేర నిరుద్యోగ సమస్య కూడా తీరుతుందని అన్నారు. గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో మండలంలో పేరుకుపోయిన అనేక సమస్యలను పరిష్కరించాలని పలు దపాలుగా పోరాటాలు నిర్వహించినా పరిష్కారం చూపలేదని విమర్శించారు. ఇప్పటికైనా మండలంలోని వివిధ గ్రామాల మధ్యన నిలిచిపోయిన లింకు రోడ్లను పూర్తి చేయాలని, నాగిరెడ్డిపల్లి దగ్గర హైవే రోడ్డుపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. బస్వాపురం ప్రాజెక్టు నుండి వివిధ గ్రామాలకు నీళ్లు వెళ్లడానికి రైతుల పొలాల మధ్య నుండి కాలువలు తీశారు కానీ రైతులు కాలువలను దాటడానికి బ్రిడ్జిల నిర్మాణం చేపట్టలేదని ఇప్పటికైనా ఆయా గ్రామాలలో కాలువల పైన బ్రిడ్జిలు నిర్మాణం చేపట్టాలని సూచించారు.

గ్రామాలలో దోమల నివారణకు దోమల మందును పిచికారి చేయాలని, కోతుల భారీ నుండి ప్రజల ప్రాణాలను కాపాడాలని, భూ పంపిణీ నిషేధము ఎత్తివేసి ఆయా గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ భూములను ఇండ్లు లేని పేదలకు ఇండ్ల స్థలాలకు మరియు సాగు భూములకు పంపిణీ చేయాలని కోరారు. ఎండలు తీవ్రంగా పెరుగుతున్న పెరుగుతున్న నేపథ్యంలో ఆయా గ్రామాల్లో ఉన్న మంచినీటి ఎద్దడిని నివారించి తాగునీరు అందించాలని అన్నారు. గ్రామాలలో వీధిలైట్లు, సీసీ రోడ్లను, మురికి కాలువలను ఏర్పాటు చేయాలని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి సమస్యల పరిష్కారం కోసం తగిన సలహాలు సూచనలు తీసుకోవాలని అధికారులను కోరారు. అనంతరం సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నర్సింహ, మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్యలు మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శివర్గ సభ్యులు ఏదునూరి మల్లేశం, కొండ అశోక్ మండల కమిటీ సభ్యులు మోట ఎల్లయ్య, కొండపురం యాదగిరి, ఎంపీ ఆర్డీ జిల్లా అధ్యక్షులు సురుపంగా ప్రకాష్, చీమలకొండూరు సీపీఐ(ఎం) శాఖ కార్యదర్శి బోడు ఆంజనేయులు, ఆయా గ్రామాలకు సంబంధించిన పార్టీ నాయకులు, ప్రజలు బండి శ్రీనివాస్, రాగుల పోషయ్య, కిష్టయ్య, తోటకూరి అయిలయ్య, సురుపంగ మల్లెష్, మోత్కుపల్లి స్వామి, సిలివేరు సత్యనారాయణ, బి. గణేష్, హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.


- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -