పండుగ వాతావరణంలో…

– దశాబ్ది ఉత్సవాలపై మంత్రి సత్యవతి రాథోడ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
పండుగలా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని మంత్రి సత్యవతి రాథోడ్‌ సూచించారు. గిరిజనోత్సవాల నిర్వహణ, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారోత్సవాలపై రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ శనివారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. పదేండ్ల ప్రగతిని చాటుతూ పండుగ వాతావరణంలో అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. గ్రామ స్థాయినుంచి రాష్ట్ర స్థాయి వరకు జూన్‌ 2 నుంచి 22 వరకు ఏరోజున ఏ కార్యక్రమం చేపట్టాలో అధికారులకు మంత్రి వివరించారు. గిరిజన విద్యాలయల్లో సంబరాలు నిర్వహించే విధంగా ఏర్పాట్లు ఉండాలన్నారు. జిల్లాల వారీగా ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు.
గిరిజనుల సాంస్కృతిక ఉత్సవాలు, ఆర్ట్‌ ఫ్రేమ్‌ల ప్రదర్శన, గిరిజనుల ఉత్పత్తుల వర్క్‌షాప్‌ లు నిర్వహించాలన్నారు. నియోజకవర్గాల వారీగా కళ్యాణ లక్ష్మి, ఎకనామిక్‌ సపోర్ట్‌ స్కీమ్‌ ద్వారా లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులతో పాటు గిరిజనుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు తెలిసేలా ఏర్పాట్లు సిద్ధం చేయాలని వివరించారు.

Spread the love