అవతరించిన ఆరోగ్య తెలంగాణ

– రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలశాఖ కమిషనర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పటిష్టమైన చర్యలతో తెలంగాణ రాష్ట్రం ఆరోగ్య తెలంగాణగా అవతరించిందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలశాఖ తెలిపింది. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్‌ అర్వింద్‌ కుమార్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం తెలంగాణలో 56 మెడికల్‌ కాలేజీలుండగా, అందులో ప్రభుత్వ రంగంలో 28 ఉన్నాయి.. ఎంబీబీఎస్‌ సీట్లు 2,850 నుంచి 8,515కు పెరిగాయి. పీజీ మెడికల్‌ సీట్లు 2,890, సూపర్‌ స్పెషాలిటీ సీట్లు 206 అందుబాటులో ఉన్నాయి. డాక్టర్‌, నర్సింగ్‌, పారామెడికల్‌ పోస్టులు 22,455 భర్తీ చేశారు. కొత్తగా మరో 26,978 పోస్టులు మంజూరు చేశారు. భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది. జీహెచ్‌ఎంసి ప్రాంతంలో ఉన్న 350 బస్తీ దవాఖానాలుండగా, రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో 434 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.
రాష్ట్రవ్యాప్తంగా 20 తెలంగాణ డయాగస్టిక్‌ హబ్‌ లున్నాయి. ”ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఆరోగ్యశ్రీ” పథకాలను 18 మే 2021న విలీనం చేశారు. దీంతో ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి గరిష్ట కవరేజీ పరిమితి రూ.2 లక్షల నుండి రూ.5 లక్షలకు పెరిగింది. ఎంప్లాయీ అండ్‌ జర్నలిస్ట్‌ హెల్త్‌ స్కీం కింద 344 ఎంప్యానెల్డ్‌ ఆస్పత్రుల్లో 12,04,654 మంది ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు వైద్య సేవలందుతున్నాయి. 2022 వరకు 67,049 మంది రోగులు డయాలసిస్‌ కోసం ప్రభుత్వం రూ.698.08 కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్రంలో 108 అంబులెన్స్‌లు 455 వాహనాలు, 102 వాహనాలు 300 పని చేస్తుండగా, కొత్తగా 33 నియోనాటల్‌ అంబులెన్స్‌లను ప్రారంభించింది. నిమ్స్‌ ఆస్పత్రిని 1,800 పడకల నుంచి 3,800కు, నాలుగు టిమ్స్‌ ఆస్పత్రుల్లో 4,000 పడకలు, వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో మరో 2 వేల పడకలు అదనంగా సమకూరనున్నాయి. ఒక్కో పల్లె దవాఖానాకు రూ.20 లక్షలతో పక్కా భవనాలను నిర్మిస్తున్నది. కంటి వెలుగు మొదటి విడతలో 1.54 కోట్ల మందికి, రెండో విడతలో 1.61 కోట్ల మందికి పరీక్షలు నిర్వహించారు. పాలియేటివ్‌ కేర్‌ కోసం రాష్ట్రంలో 33 సంరక్షణ, సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఆర్టీపీసీఆర్‌ ల్యాబొరేటరీలు
ప్రస్తుతం రాష్ట్రంలో 27 ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌లు పనిచేస్తున్నాయి. కరోనా కంటే ముందు రాష్ట్రంలో ఆర్టీ పీసీఆర్‌ ల్యాబ్‌ కేవలం ఒకటి మాత్రమే ఉండేది. నిమ్స్‌లో ఏర్పాటు చేసిన కొబాస్‌ 8800 మెషిన్‌ రోజుకు 4000 కరోనా పరీక్షలు చేస్తుంది. మరో 8 ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌లను కూడా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కనీసం ఒక్క ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌ అయినా సేవలందించే అవకాశం ఏర్పడింది.

Spread the love