బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ హఠావో… దేశ్‌ – మహిళ బచావో..

– అక్టోబర్‌ 5న చలో ఢిల్లీ
– మహిళలు బతకలేని దేశంగా మారింది : ఐద్వా జాతీయ కన్వెన్షన్‌
న్యూఢిల్లీ: మహిళలు స్వేచ్ఛగా, గర్వంగా జీవించే హక్కును నిరాకరిస్తున్న దేశంగా భారత్‌ మారిందని ఐద్వా జాతీయ కన్వెన్షన్‌ తెలిపింది. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ ప్రభుత్వం మహిళా వ్యతిరేక, కార్పొరేట్‌ అనుకూల విధానాలను అమలు చేస్తున్నదని, ఇది మనుస్మృతి, మతతత్వంపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది. ‘ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీని తరిమికొట్టండి, దేశాన్ని రక్షించండి, మహిళలను రక్షించండి (బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ హఠావో.. దేశ్‌ బచావో, మహిళ బచావో) అనే నినాదాలు చేస్తూ అక్టోబర్‌ 5న నిర్వహించనున్న చలో ఢిల్లీ మార్చ్‌కు కన్వెన్షన్‌ పిలుపునిచ్చింది. గురువారం నాడిక్కడ హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌ భవన్‌లో జరిగిన కన్వెన్షన్‌లో దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల నుంచి 1,000 మంది ప్రతినిధులు హాజరయ్యారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో హింసకు గురైన 15 మంది మహిళలు సదస్సులో మాట్లాడారు. బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రభుత్వ మహిళా వ్యతిరేక మత రాజకీయాలను నిరసిస్తూ వేలాది మంది మహిళలను సమీకరించాలని కన్వెన్షన్‌ తీర్మానించింది. ప్రజాపంపిణీ వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రణాళికాబద్ధంగా చేస్తున్న ప్రయత్నాలను సదస్సు ఖండించింది.
మహిళలపై దాడులు పెరిగాయి : బృందాకరత్‌
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రమాణాల నుంచి రక్తహీనత కాలమ్‌ మినహాయించబడిందని ఐద్వా సీనియర్‌ నేత బృందాకరత్‌ విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయనీ, ఆహార పదార్థాలపైనా జీఎస్టీ విధించారని ఆరోపించారు. పెరుగుతున్న నిరుద్యోగం మహిళలకు అభద్రతను కలిగిస్తున్నదని అన్నారు. ఉపాధి హామీ పథకంలో ఏడాదికి 200 పనిదినాలు కల్పించాలని, పెండింగ్‌ బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. నీటి సరఫరా, విద్యుత్‌, రవాణా, పారిశుద్ధ్య రంగాల ప్రయివేటీకరణను విమర్శించారు. ఆరోగ్యంపై ప్రభుత్వం చేస్తున్న ఖర్చులో భారీగా కోత విధించడం వల్ల మహిళలపై భారం పడుతుందన్నారు. మహిళలపై దాడులు పెరుగుతున్నాయనీ, 2021లో సగటున రోజుకు 86 లైంగికదాడుల కేసులు నమోదయ్యాయని గుర్తుచేశారు. కత్వా, ఉన్నావ్‌, హత్రాస్‌లలో మహిళలపై దాడులకు పాల్పడిన వారికి రాజకీయ ప్రోత్సాహం ఉందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పోక్సో చట్టాన్ని తప్పించేందుకు కఠోర ప్రయత్నాలు జరుగుతున్నాయనీ, మణిపూర్‌ అల్లర్లు, హర్యానా వివాదంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. ఈ కన్వెన్షన్‌ లో ఐద్వా అధ్యక్షురాలు పికె శ్రీమతి టీచర్‌, ప్రధాన కార్యదర్శి మరియం ధావలే డిక్లరేషన్‌ పత్రాన్ని సమర్పించారు. వివిధ సెషన్లలో చర్చలు జరిగాయి. ఈ కన్వెన్షన్‌లో సుభాషిణి అలీ, ఎస్‌. పుణ్యవతి, సిఎస్‌ సుజాత, ఆశా శర్మ, ప్రొఫెసర్‌ అర్చనా ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love